ONGC Gas Pipe Line Leak: ‘ఇరుసుమండ మంటల’తో ఉలిక్కిపడ్డ గల్ఫ్ ప్రవాసీయులు
ABN , Publish Date - Jan 05 , 2026 | 09:07 PM
ఏపీలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ లీకైన ఘటన గల్ఫ్‌లోని ప్రవాసీయుల్లో కలకలానికి దారి తీసింది. పైప్‌లైన్ లీకైన మలికిపురం మండలానికి చెందిన అనేక మంది గల్ఫ్‌లో పని చేస్తున్నారు. ఘటన గురించి తెలియగానే తమ వారు ఎలా ఉన్నారో అని కంగారు పడుతూ స్థానికులకు ఫోన్ చేశారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఒఎన్‌జీసీ పైపు లైను నుండి గ్యాస్ లీకై చెలరేగిన మంటల వేడి గల్ఫ్ దేశాలలోని మండల వాసులకూ తాకిందని చెప్పవచ్చు.
ఇరుసుమండ, దాని పొరుగున ఉన్న లక్కవరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రవాసీయులు అనేక మంది గల్ఫ్ దేశాలలో పని చేస్తున్నారు. పైప్‌లైన్ లీక్ ఘటన గురించి తెలిశాక స్వస్థలంలో ఉన్న తమ కుటుంబీకుల గురించి ఆందోళన చెందారు. సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లలో ఉంటున్న మలికిపురం మండలానికి చెందిన ప్రవాసీయులు కలత చెందారు.
మంటల అనంతరం లక్కవరం గ్రామం ఖాళీ చేయిస్తుండడంతో తన తల్లి తోట అన్నపూర్ణ క్షేమం గురించి సౌదీ అరేబియాలోని ఆమె కూతురు రమ్య అల్లాడిపోయింది. కళ్యాణ మండపానికి తరలించిన తన తల్లి ఆ తర్వాత క్షేమంగా ఇతర ప్రాంతానికి చేరుకుందని తెలుసుకున్నాక రమ్య ఊపిరి పీల్చుకుంది. అదే విధంగా దుబాయిలో పని చేసే ఇరుసుమండ వాస్తవ్యుడు గడ్డం నరేశ్.. గ్రామంలోని తన కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతూ తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి వారు క్షేమంగా ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. అదే గ్రామానికి చెందిని అనేక మంది దుబాయిలో పని చేస్తున్నారని నరేశ్ తెలిపారు. ఘటన గురించి తెలిసి వారు ఉలిక్కిపడ్డారని అన్నారు.
ప్రాణ నష్టం లేకున్నా పంట పొలాలు, కొబ్బరి చెట్ల విధ్వంసం వలన ఆర్థికంగా నష్టం జరిగిందని ఖతర్‌లో పని చేసే కోనసీమ జిల్లా వాసి దొండపాటి శశి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యనిర్వాహక వర్గ ప్రమాణస్వీకారోత్సవం
అమెరికా కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతుల మృతి..