Share News

నాట్స్ సాహితీ ఇష్టాగోష్టి.. తెలుగు పద్య మాధుర్యాన్ని వివరించిన తటవర్తి

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:07 PM

నాట్స్ లలిత కళా వేదిక ఆధ్వర్యంలో జూమ్ వేదికగా నిర్వహించిన సాహితీ ఇష్టాగోష్టిలో శతాధిక అవధానార్చనాచార్య తటవర్తి కళ్యాణ చక్రవర్తి తెలుగు పద్య మాధుర్యాన్ని వివరిస్తూ సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. అవధానం, పద్య రచన ప్రాముఖ్యతపై విశేషంగా ప్రసంగించారు.

నాట్స్ సాహితీ ఇష్టాగోష్టి.. తెలుగు పద్య మాధుర్యాన్ని వివరించిన తటవర్తి
NATS Sahithi Ishtagoshti

ఇంటర్‌నెట్ డెస్క్: ‘భాషే రమ్యం సేవే గమ్యం’ అనేది నాట్స్ నినాదం. ఆ నినాదానికి ప్రతీకగా, నాట్స్ లలిత కళా వేదిక ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా నాట్స్ సాహితీ ఇష్టాగోష్టి నిర్వహించింది. శతాధిక అవధానార్చనాచార్య తటవర్తి కళ్యాణ చక్రవర్తి ఈ ఇష్టాగోష్టికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన పద్యాలతో, వాగ్ధాటితో సాహితీ ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. అవధానం అనేది కేవలం ఒక విద్య మాత్రమే కాదని.. అది ఏకాగ్రతకు, అపారమైన జ్ఞాపకశక్తికి జరిగే ఒక అగ్నిపరీక్ష అని తటపర్తి అన్నారు. పద్యం అనేది కేవలం అక్షరాల కూర్పు మాత్రమే కాదని, అది ఒక యజ్ఞం వంటిదని పేర్కొన్నారు.
nats-3.jpg


అవధాన ప్రక్రియలో ఏకాగ్రత, అపారమైన జ్ఞాపకశక్తి ఎంత కీలకమో చెబుతూ.. శతాధిక అవధానాల ద్వారా తాను పొందిన అనుభూతిని వివరించారు. పద్య విద్యను ఒక ఆరాధనగా భావించి, దానిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని శ్రీ కళ్యాణచక్రవర్తి స్పష్టం చేశారు. మన జాతి సంస్కృతిని, భాషా సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని, తాను చేస్తున్న ఈ ప్రయత్నం ఆ మహోద్యమంలో ఒక భాగమని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న భాషాభిమానులకు పద్య రచనలో మెళకువలు, అక్షర క్రమశిక్షణ గురించి చక్కగా వివరించారు.
nats-3.jpg


నాట్స్ సంస్థ 'భాషే రమ్యం సేవే గమ్యం' అనే నినాదంతో తెలుగు సంస్కృతిని విదేశాల్లో కూడా సజీవంగా ఉంచుతున్న తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో 'అక్షర దీపిక' వంటి కార్యక్రమాల ద్వారా పద్య విజ్ఞానాన్ని మరింత మందికి చేరువ చేయాలన్న నాట్స్ సంకల్పానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో కలిసి నిర్వహించే 2026 పద్యయజ్ఞంలో ఔత్సాహికులందరూ పాల్గొనాలని.. తెలుగు పద్య మాధుర్యాన్ని అందరికి పంచాలని శతశతకయజ్ఞ నిర్వాహకులు తటవర్తి కోరారు.
nats-4.jpg


మన సంస్కృతి సాంప్రదాయాలను, పండితులను గౌరవించుకుంటూ సమాజంలో మార్పు తీసుకురావాలనే సదుద్దేశ్యంతో నాట్స్ లలిత కళా వేదికను నడుపుతున్నట్లు నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పద్య రచయితలు కూడా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా నాట్స్ నాయకులు మురళీకృష్ణ మేడిచెర్ల వ్యవహరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని చాటేలా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల ప్రత్యేకంగా అభినందించారు.
nats-22.jpg


ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో చర్చలు ఇప్పట్లో లేనట్టేనా.. పాక్ పర్యటనపై వైట్‌హౌస్ కీలక ప్రకటన..

ఇరాన్‌తో చర్చలు ఇప్పట్లో లేనట్టేనా.. పాక్ పర్యటనపై వైట్‌హౌస్ కీలక ప్రకటన..

Updated Date - Apr 22 , 2026 | 03:13 PM