జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ గల్ఫ్ విభాగం
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:17 PM
యూఏఈలో మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ గల్ఫ్ విభాగం నిలిచింది. మృతదేహాన్ని భారత్‌కు తరలించడంతో పాటు బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కొరకంటి నాగబాబు ఈ నెల 20వ తేదీన దుబాయ్‌లో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిన వెంటనే ఆయన స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. దీంతో గల్ఫ్ జనసేన టీమ్ తక్షణమే స్పందించింది. మృతుడి కంపెనీ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసింది. అనంతరం నాగబాబు పార్థివ దేహాన్ని నిన్న రాత్రి స్వగ్రామానికి తరలించారు.
ఈ మొత్తం ప్రక్రియను గల్ఫ్ జనసేన యుఏఈ ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు నాయకత్వంలో యుఏఈ టీమ్ సమన్వయం చేసింది. భారత కాన్సులేట్, సంబంధిత సంస్థల సహకారంతో వేగవంతంగా చర్యలు చేపట్టింది.
ఈ విషాద సమయంలో నాగబాబు కుటుంబానికి గల్ఫ్ జనసేన యుఏఈ అండగా నిలుస్తూ, ఆర్థిక సహాయం సహా అవసరమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. అలాగే, గల్ఫ్ జనసేన పార్టీ యుఏఈ ఎగ్జిక్యూటివ్ టిమ్ తరఫున ₹1 లక్ష రూపాయలను, తండ్రి మరణించిన మరుసటి రోజే జన్మించిన పసికందు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో జనసేన సెంట్రల్ ఆఫీస్ ద్వారా పూర్తి చేస్తామని తెలియజేశారు. నాగబాబు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ అపార నష్టాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నామని గల్ఫ్ జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు తెలిపారు.