పెరిగిన విమాన టికెట్ల ధరలు! అత్యధిక ధర చెల్లిస్తున్న రాయలసీమ వాసులు
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:10 AM
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ప్రరయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. రాయలసీన ప్రయాణికులు దేశంలో కెల్లా ఎక్కువ అత్యధిక టిక్కెట్ ధర చెల్లిస్తున్నారు.
ధరాభారం కారణంగా స్వదేశానికి వెళ్లేందుకు సంకోచిస్తున్న వైనం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రూట్లు మారిపోయాయి. ఫలితంగా ప్రయాణ దూరం పెరిగింది. దీంతో పాటు అనూహ్యంగా పెరుగుతున్న ఇంధనం ధరలు, దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను పోటు, షెడ్యూల్ విమానాలను నాన్ షెడ్యూల్ విమానాలుగా కేటగిరీని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన అంతర్జాతీయ ప్రయాణికులు ప్రత్యేకించి ప్రవాసీయులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
దేశంలో ప్రజాదరణ పొందిన ప్రముఖ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్‌తో పాటు ఇతర అనేక విమానయాన సంస్థలపై ఇరాన్ – అమెరికా యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం పడింది. ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గడం వలన విమానాలు నడపడం కష్టంగా ఉందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి.
భారత్ నుంచి గల్ఫ్ దేశాలు, ఇరాన్, ఇరాక్ మీదుగా అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలకు విమానాల రాకపోకలన్ని కొనసాగుతాయి. అయితే, అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసిన అనంతరం ఇరాన్ తన గగనతలన్ని మూసివేసింది. ఇరాన్‌తో పాటు దాని పొరుగున ఉన్న ఇరాక్ కూడా తన గగనతలాన్ని మూసివేయడంతో భారత్ నుండి అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాలకు విమానాల సర్వీసుల సంఖ్యను భారతీయ ఎయిర్‌లైన్స్ తగ్గించాయి. కొన్నింటిని రద్దు చేశాయి. ఇప్పటికీ కీలకమైన గల్ఫ్ దేశాలకు షెడ్యూల్డ్ విమానాలను నడపడం లేదు. భారత్ నుండి అమెరికా, ఐరోపా దేశాలకు విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తుండడంతో దూరం పెరిగి అదనపు ఇంధనం అవసరమవుతోంది. అదనపు ఇంధనం ట్యాంకుల కోసం ప్రయాణికుల సంఖ్యను కుదించాల్సి రావడంతో ఆదాయం తగ్గుతోంది.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా, అన్ని రకాల చమురు ధరలు పెరగడంతో విమాన ఇంధనం ఎ.టి.యఫ్ ధర కూడ భారీగా పెరుగుతోంది. విమాన నిర్వహణ ఖర్చులో దాదపు సగం వరకూ కేవలం ఇంధన వ్యయం ఉంటుంది. యుద్ధం మొదలు కాకముందు ఫిబ్రవరిలో ఒక కిలో లీటర్‌కు 91 వేల రూపాయాలుగా ఉన్న ధర ప్రస్తుతం ఒక లక్ష నాలుగు వేల రూపాయాలకు చేరుకుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు ఏ రకమైన వెలుసుబాటు లేకుండా అదనపు మొత్తం వసూలు చేయాలన్న సర్కారు దేశీయంగా ప్రయాణాలకు మాత్రం 25 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని ఆదేశించింది. సహజంగా కస్టం డ్యూటితో పాటు వ్యాట్‌ను కూడా సర్కారు పెంచుకుంటూ వస్తోంది. రాయలసీమ ప్రవాసీయులు ఎక్కువగా వినియోగించే చెన్నై విమానశ్రాయంలో దేశంలో కెల్లా అత్యధికంగా 29 శాతం వ్యాట్ పన్ను ఉండగా అది ప్రయాణికుల నెత్తిన పడింది. వీటికి తోడు పతనమవుతున్న డాలర్- రూపాయి మారకం విలువతో విమానాలను నడపడం కష్టతరమవుతుందని ఎయిర్‌లైన్సులు చేతులెత్తేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కీలకమైన గల్ఫ్ రూట్లలో భారతీయ విమానాలు నడపడానికి ఇప్పటికే అనేక అవరోధాలు ఏర్పడడంతో భారీగా ఆదాయం తగ్గింది.
విదేశీ ఎయిర్ లైన్స్‌తో పాటు భారత్‌కు చెందిన నాన్ షెడ్యూల్డ్, చార్టర్, ప్రత్యేక విమానాలకు విమాన ఇంధనం ధర (ఢిల్లీలో) కిలో లీటర్‌కు రెండు లక్షల ఏడు వేల రూపాయలకు పెరిగింది. ఇది 115 శాతం ఎక్కువ. గల్ఫ్ దేశాలకు, ఇతర కీలక విదేశాలకు ఎయిర్ ఇండియా, ఇండిగోతో సహా అనేక విమానయాన సంస్థలు కూడా నాన్ షెడ్యూల్డ్, ఆడ్ హాక్ విమానాలను నడుపుతుండగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రవాసీయులు అధిక ధరకు టిక్కెట్లు కొనుగోలు చేయవల్సి వస్తోందనే విషయం గమనార్హం. ఈ విషయాన్ని ఇటీవల గల్ఫ్ పర్యటనకు వచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రి యస్. జయశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఉద్రిక్తతలు తగ్గే వరకూ భరించక తప్పదని ఆయన అన్నారు.