Share News

జెద్దాలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు

ABN , Publish Date - Oct 17 , 2026 | 03:24 PM

జెద్దానగరంలో ప్రవాసీయులు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్య నిత్యం నిమగ్నమై ఉండే మహిళలకు ఆటవిడుపుగా అందరూ ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని బతుకమ్మ కల్పించింది.

జెద్దాలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
Bathukamma Celebrations in Jeddah

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: రామా రామా నే ఉయ్యాలో.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలతో అరబ్బు నాట ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు, పరాయి గడ్డపై పరిమళ పూల వనాలు, అడవి పూల బతుకమ్మ పండుగ సంబురాలు ఎర్ర సముద్ర తీర అరబ్బు నగరంలోని తెలుగు సమాజంలో అంబరాన్నంటాయి.

మహిళల సామూహిక జీవనసౌందర్యాన్ని జెద్దా నగరంలోని తెలుగు ప్రవాసీయులు ప్రతిబింబించారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్య నిత్యం నిమగ్నమై ఉండే మహిళలకు ఆటవిడుపుగా అందరూ ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని బతుకమ్మ కల్పించింది. ఆ వైపు మహారాష్ట్ర సరిహద్దులోని ఆసిఫాబాద్‌లోగల వీణాక్షి నుంచి ఈ వైపు కొత్తగూడెంకు చెందిన శ్రీ లక్ష్మి వరకూ బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ పాడిన పాటల్లో కుటుంబ బంధాలు, ప్రకృతి అందాలు, పల్లెజీవనం, తెలంగాణ మహిళ సామాజిక పరిస్థితులు చాటాయి.

2.jpg


బతుకమ్మ పాట ఒక సామూహిక అనుభవం. అది ఒక్క గొంతుకకే పరిమితం కాకుండా, దానికి అనేక గొంతులు కలిసి ప్రాంతాలకు అతీతంగా పరాయిదేశంలో తెలుగువాళ్లందరూ ఒక్కటే అని చెప్పే సమష్టి గానం. జెద్దా తెలుగు మిత్రులు (జె.టి.యం) తెలుగు ప్రవాసీ సంఘం భారతీయ కాన్సులేటు సౌజన్యంతో శుక్రవారం సామాజిక అనుబంధాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకను సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించింది.

తెలంగాణ సంప్రదాయం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరిదని నిరూపిస్తూ జె.టి.యం నాయకులు శివరామకృష్ణ, దుర్గా భవానీ, కుంట సాగర్, శారదాంబ, గోలి శ్రీనివాస్, ప్రసన్న, కోడూరి శ్రీనివాస్, స్వప్న, వెంకట్, కిషోర్ తదితరుల స్వాగతంతో మొదలయిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రవాసీ కుటుంబాలు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ సంబరాలను కొత్త శిఖరాలకు చేర్చాయి.

1.jpg


దుర్గా భవానీ, శివరామకృష్ణలు పేరుపేరునా ఒక్కొక్కరినీ ఆప్యాయతతో ఆహ్వానించడం, అందరి కుటుంబాల కలయికగా సమష్టి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ద్వారా పండుగ సంబరాలకు నిజమైన నిర్వచనమిచ్చారు.

సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వారితో సహా భారతీయులు ఎవరూ కూడా ఎక్కడ ఉన్నా తమ మూలాలు, సంస్కృతి పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కష్టాలలో ఉన్న తోటి భారతీయులను ఆదుకోవడానికి కూడా తెలుగు ప్రవాసీయులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

5.jpg


తెలంగాణ అస్తిత్వానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం బతుకమ్మ అని హైదరాబాద్‌కు చెందిన కృష్ణవేణి వ్యాఖ్యానించారు. బోనం, బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు ప్రతిరూపమని సిరిసిల్లకు చెందిన స్వప్న అన్నారు.

సద్దుల బతుకమ్మలో వాయినాల (తాంబూలం, నైవేద్యాలు) విశిష్టతను చెబుతూ కృష్ణవేణి, స్వప్న, ప్రసన్నలు వాయినాలను అతిథులకు అందించారు. వీణాక్షి, సౌజన్య, సురేఖ, కవిత, మంజు, రమ్యలు కూడా కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు.

జెద్దా తెలుగు ప్రవాసీ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ తరహా వైభవమైన బతుకమ్మ సంబురాలను చూడలేదని సుదీర్ఘకాలంగా నివసిస్తున్న ఒక ప్రవాసీ ప్రముఖుడు వ్యాఖ్యానించారు.

4.jpg


ఈ వార్తలనూ చదవండి:

డబ్లిన్‌లో ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొన్న శ్రీనివాస్ మిరియాల

శంకర నేత్రాలయ ఆర్కాన్సాస్ విభాగం ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’

Updated Date - Oct 17 , 2026 | 03:44 PM