Share News

దుబాయి జబల్ అలీ ప్రాంతంలో ఒక నూతన దిశ – సూపర్ బజార్

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:58 PM

జబల్ అలీలోని ఇండస్ట్రియల్ ఏరియా-1 లోని ముఖ్య కూడలి బస్ స్టేషన్ వద్ద అట్టహాసంగా సూపర్ బజార్ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కొందరు ఎమిరాతీ ప్రముఖులు, ప్రవాసీయులు పాల్గొన్నారు.

దుబాయి జబల్ అలీ ప్రాంతంలో ఒక నూతన దిశ – సూపర్ బజార్
Super Bazaar Dubai launch

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అది 1976. దుబాయ్ శివారలోని నిర్మానుష్య ప్రాంతమైన జబల్ అలీలో ఓ రోజున మధ్యాహ్నం ఎండలు మండుతున్న వేళ బ్రిటిష్ ఇంజనీర్ నెవిల్లె అల్లెన్ వచ్చారు. అక్కడ ఆధునిక నౌకాశ్రయాన్ని నిర్మింపదలచినట్టు అప్పటి రాజు షేఖ్ రాషేద్ అల్ మొఖ్తూం (ప్రస్తుత రాజు షేఖ్ మొహమ్మద్ తండ్రి) నెవిల్లేకు తన మనసులో మాటను చెప్పారు. తక్షణమే పనులు ప్రారంభించాలన్న రాజు అభీష్టం మేరకు నెవిల్లే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జబల్ అలీ అనతికాలంలో దుబాయి రూపురేఖలను మార్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు తమ పర్యటనల సందర్భంగా జబల్ అలీ ఫ్రీ జోన్ తీరుతెన్నులను చూసి అశ్చర్యపోయారు.

ప్రస్తుతం కొన్ని లక్షల మంది భారతీయులు జబల్ అలీ ప్రాంతంలో పని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారిలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు కూడా ఉన్నారు. ఒక్క దుబాయి మాత్రమే కాదు, అల్ అయిన్ మొదలు అజ్మాన్ వరకూ అనేక ఇతర ప్రాంతాలు, ఎమిరేట్ల నుంచి కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను సెలవు దినాలలో ప్రత్యేక బస్సులలో జబల్ అలీకి తీసుకువస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తుల నుంచి తెలుగు పచ్చళ్ళ వరకూ ప్రతిదీ జబల్ అలీలో లభ్యమవుతున్నాయి.

48.jpg


నాడు ఒక ఇసుక దిబ్బను రద్దీ ప్రాంతంగా అల్లెన్ మార్చగా ఇప్పుడు ఆ ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయులకు ఒక ముఖ్య కూడలిగా మసియోద్దీన్ మార్చుతున్నారు. సూకులు, మాళ్ళు, మార్కేట్లు మాత్రమే తెలిసిన దుబాయిలో సూపర్ బజార్ అనే వ్యవస్థకు ఆయన శ్రీకారం చుట్టారు. సూపర్ బజార్ సువిశాల ప్రాంగణంలో సగటు భారతీయుడికి కావల్సిన ప్రతి వస్తువు, సేవలు అందుబాటులో ఉన్నాయి. హెయిర్ కటింగ్, షేవింగ్ మొదలు మసూరి బియ్యం, పప్పు, ఉప్పు, సిమ్ కార్డులు, బంగారం ఆభరణాలు, భారతదేశానికి డబ్బు పంపించుకోవడానికి మనీ ఎక్స్చేంజ్, దుబాయి ప్రభుత్వ సేవలు బతఖా రెన్యువల్, వీసా దరఖాస్తు తౌజీ తస్హీల్ అనే ప్రభుత్వ సేవల కేంద్రం వరకూ ప్రతిదీ సూపర్ బజార్‌లో అందుబాటులో ఉన్నట్లుగా దీని యజమాని అయిన మసియోద్దీన్ తెలిపారు. వివిధ రకాల రుచికర భోజనాలు, తినుబండరాల రెస్టారెంట్లు సూపర్ బజార్ కాంప్లెక్స్‌లో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం జబల్ అలీలోని ఇండస్ట్రియల్ ఏరియా-1 లోని ముఖ్య కూడలి బస్ స్టేషన్ వద్ద అట్టహాసంగా జరిగిన దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొందరు ఎమిరాతీ ప్రముఖులు, ప్రవాసీయులు పాల్గొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ట్రావెల్, సేవలు, వ్యాపార రంగాలలో ఉన్న సూపర్ జెట్ గ్రూప్ ఈ సూపర్ బజార్ అనే హైపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన కొన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నట్లుగా సూపర్ జెట్ గ్రూప్ చైర్మన్ అయిన మసీయోద్దీన్ తెలిపారు.

16.jpg1.jpg

Updated Date - Mar 31 , 2026 | 08:55 PM