రియాధ్‌లో ప్రతిష్ఠాత్మకమైన సమాఖ్యలో తెలుగు మహిళకు స్థానం
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:54 PM
ఇప్పటివరకూ కేవలం పురుషాధిక్యత కలిగిన సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఐ.యస్.సి అనే ప్రవాస భారతీయ సంఘాల సమాఖ్యలో తాజాగా సత్యసాయి జిల్లాకు చెందిన మహిళకు స్థానం దక్కింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆకాశంలో సగం అవకాశాలలోనూ సగం అంటూ ఇంటా బయటా మహిళలు దూసుకుపోతున్నారు. అబల కాదు సబలలం అని అంటున్నారు. ఉద్యోగాలలోనే కాదు, సామాజిక జీవనంలోనూ పాత్రను కోరుకుంటున్నారు.
ఇప్పటివరకూ కేవలం పురుషాధిక్యత కలిగిన సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఐ.యస్.సి అనే ప్రవాస భారతీయ సంఘాల సమాఖ్యలో సత్యసాయి జిల్లాకు చెందిన మహిళకు స్థానం దక్కింది. భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థలో అడుగిడిగిన తొలి మహిళగా చేతన జగదీష్గారి ఖ్యాతి పొందారు.

వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ సదస్సులలో పర్యావరణ, వాతావరణ మార్పుల ఆంశాలపై వక్తగా చేతన పాల్గొన్నారు. సందర్భానుసారం భారతీయ మహిళల సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తారనే పేరుపొందారు.
ఒక్క సౌదీ అరేబియాయే కాకుండా మొత్తం గల్ఫ్ దేశాలలో స్త్రీ స్వావలంబనకు శ్రీకారం చుట్టిన సాటా (సౌదీ అరేబియా తెలుగు సంఘం) నాయకురాలిగా ఉన్న ఆమె ముక్కుసూటిగా మాట్లాడే నాయకురాలిగా పేరొందారు. యూనిఫాం ధరించి నెత్తిపై టోపి పెట్టి ఆగే ముఢ్ అంటూ పురుషుల మెజార్టీలో కవాతు చేసే ఎన్.సి.సిలో మహిళలు అసలు కనిపించని కాలంలో ఆమె చేరడమే కాకుండా దాని ఉత్తమ కమాండర్‌గా ప్రతిష్ఠాత్మక అవార్డును గవర్నర్ చేతుల మీదుగా పొందారు. రైఫిల్ షూటింగుతో పాటు కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగిన చేతన వ్యక్తిత్వ వికాస అభివృద్ధి (పర్సనాల్టీ డెవలప్మెంట్) నిపుణురాలు కూడా.
