Share News

కెనడాలో వృద్ధ జంట హత్య.. దోషులుగా భారత సంతతి యువకులు

ABN , Publish Date - May 09 , 2026 | 08:05 PM

కెనడాలో నాలుగేళ్ల నాటి వృద్ధ జంట హత్య కేసులో ముగ్గురు భారత సంతతి యువకులు తాజాగా దోషులుగా తేలారు. త్వరలో కోర్టు వారికి శిక్షను ఖరారు చేయనుంది.

కెనడాలో వృద్ధ జంట హత్య.. దోషులుగా భారత సంతతి యువకులు
Indian origin men convicted in Canada Murder Case

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో నాలుగేళ్ల క్రితం జరిగిన వృద్ధ జంట హత్య కేసులో స్థానిక కోర్టు శుక్రవారం ముగ్గురు భారత సంతతి యువకులను దోషులుగా తేల్చింది. మే 28న వారికి శిక్ష ఖరారు చేయనుంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, 2022 మే 9న బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని ఆర్కేడియన్ వే అనే గ్రామీణ ప్రాంతంలో ఆర్నాల్డ్ (77), జొయేన్ డీ జాంగ్ (76) అనే వృద్ధ జంట హత్యకు గురైంది. వారు ఉంటున్న ఇంట్లోని వేర్వేరు గదుల్లో పోలీసులకు మృతదేహాలు లభించాయి. ఆర్నాల్డ్ ముఖానికి టేపు చుట్టి ఉండగా, జోయేన్ గొంతుపై కత్తిపోటు గాయం కనిపించింది. ఘటనా స్థలంలో ముగ్గురు నిందితుల డీఎన్‌ఏ, వారు వాడిన తాడు, ఇనుప బేస్ బాల్ బ్యాట్ లభించాయి. వీటి ఆధారంగా ప్రాసిక్యూటర్లు భారత సంతతికి చెందిన గురుకరణ్ సింగ్, అభిజిత్ సింగ్, కుష్‌వీర్ సింగ్‌ ఈ హత్య చేశారని వాదించారు.


కెనడాలో హత్యానేరానికి శిక్షపై వారు గూగుల్‌లో వేతికారని కూడా ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్య తరువాత నిందితులు ఆ వృద్ధ జంటకు చెందిన క్రెడిట్ కార్డులు, చెక్కులను చోరీ చేశారని చెప్పారు. అభిజీత్ సింగ్‌ అనే వ్యక్తికి చెందిన క్లీనింగ్ కంపెనీలో నిందితులు పని చేసేవారని అన్నారు. గతంలో కొన్నిసార్లు వారు వృద్ధ జంట ఇంటికి వచ్చి క్లీన్ చేసి వెళ్లారని చెప్పారు.

అయితే, నిందితులు మాత్రం తాము నిర్దోషులమని వాదించే ప్రయత్నం చేశారు. యువకులే దోషులని తేల్చేందుకు ఈ ఆధారాలు సరిపోవని వారి తరపు న్యాయవాదులు వాదించారు. చోరీ చేస్తుండగా పరిస్థితులు అనుకోని మలుపు తిరిగి హత్యకు దారి తీశాయని వాదించారు. అయితే, నిందితులు కావాలనే ఈ హత్యలకు తెగబడ్డారని బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. డబ్బులపై ఆశతోనే నిందితులు ఈ దారుణానికి తెగబడ్డారన్న ప్రాసిక్యూటర్ల వాదనతో ఏకీభవించింది. మే 28న దోషులకు శిక్ష ఖరారు చేస్తామని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

అల్ హాస్సాలో ప్రవాసీ ప్రముఖుడి స్మారక సభ

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

Updated Date - May 09 , 2026 | 08:21 PM