జకాత్...సంపద శుద్ధి కోసం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:00 AM
ఇస్లాంలోని సమస్త ఆరాధనల్లో నమాజ్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో జకాత్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఈ రెండిటిలో ఏ దేన్ని నిరాకరించినా...
ఇస్లాంలోని సమస్త ఆరాధనల్లో నమాజ్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో జకాత్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఈ రెండిటిలో ఏ దేన్ని నిరాకరించినా... అవిశ్వాసిగా పరిగణన పొందుతాడు. వీటిలో ఒకటి లేకపోతే రెండోదానికి ఎలాంటి విలువా ఉండదు. ఒక ముస్లిం నిత్యం నమాజ్ చేస్తున్నప్పటికీ... ప్రతి ఏడాది జకాత్ చెల్లించకపోతే... నమాజ్ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అలాగే వేరొకరు ఏటేటా జకాత్ చెల్లిస్తున్నా... జీవితాంతం నమాజ్ చేయకపోతే... పరలోకంలో అతని జకాత్ సత్కార్యం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
‘‘సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులై, నమాజ్ నిర్వహిస్తూ, జకాత్‌ను నెరవేర్చుతూ ఉండేవారికి ప్రభువు వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంది. వారికి పరలోకంలో ఎలాంటి భయం, దుఃఖం ఉండవు’’ అనీ, ‘‘విశ్వాసులైనవారు ఒకరికొకరు స్నేహితులు, శ్రేయోభిలాషులు. వారు మంచి విషయాలు బోధిస్తారు. చెడు విషయాల నుంచి వారిస్తారు. నమాజ్ వ్యవస్థ స్థాపిస్తారు. జకాత్ చెల్లిస్తారు. దేవునిపట్ల, ఆయన ప్రవక్త పట్ల వినయ విధేయతలతో మసలుకుంటారు. వారిపైనే దైవకారుణ్యం వర్షిస్తుంది’’ అనీ అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్‌ఆన్ స్పష్టం చేసింది.
‘‘ఏ సంపద నుంచి జకాత్ తీయకుండా అందులోనే కలిసి ఉంటుందో... ఆ సంపదను అది నాశనం చేస్తుంది’’ అని చెబుతూ జకాత్ చెల్లించకపోవడం వల్ల ప్రళయ దినం నాడు ఎదురయ్యే భయానకమైన పర్యవసానాలను దైవప్రవక్త మహమ్మద్ వివరించారు. ‘‘దేవుడు తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనంతో వ్యవహరించేవారు... ఆ పిసినారితనం తమకు మేలు చేకూరుస్తుందని భావించకూడదు. అది వారికి హాని కలిగిస్తుంది. ఏ ధనం విషయంలో వారు పిసినారితనం వహిస్తున్నారో... అదే ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది’’ అని హెచ్చరించారు.
‘జకాత్’ అంటే పవిత్రత, పరిశుద్ధత అని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పరిభాషలో చెప్పాలంటే... ధనికుడు పవిత్రుడు అయ్యే ఉద్దేశంతో, తన సంపదను శుద్ధి చేసుకోవడానికి ఏడాదికి ఒకసారి తన సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున పేదలకు, ధర్మ సంస్థాపన కార్యాలకు దానం చేసే ధన, కనక, వస్తువులను ‘జకాత్’ అంటారు. ‘‘జకాత్ చెల్లింపును ముస్లింలకు అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఇది వారిలోని ధనికుల నుంచి వసూలు చేసి, వారిలోని నిరుపేదలకు అందజేయడం జరుగుతుంది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్ తెలిపారు. దీన్నిబట్టి జకాత్ పేద ప్రజల హక్కు అని తెలుస్తోంది. ఇస్లాం ధర్మానికి ఉన్న అయిదు మూల స్తంభాలలో విశ్వాస ప్రకటన, నమాజ్ తరువాత జకాత్‌ను మూడో స్తంభంగా పరిగణిస్తారు. దివ్య ఖుర్‌ఆన్ గ్రంథంలో కనీసం 32 సార్లు నమాజ్‌తో పాటు జకాత్ ప్రస్తావన కూడా ఉంది. దీన్నిబట్టి కూడా జకాత్ ప్రాధాన్యత అర్థమవుతుంది.
-మహమ్మద్ వహీదుద్దీన్