Share News

జన హృదయాలను గెలిచారు

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:30 AM

ఇటీవల జరిగిన పుర పోరులో మహిళలు సత్తా చాటారు. జన హృదయాలను గెలిచి మేయర్‌ పీఠం దక్కించుకున్నారు. ఆ మహిళామణులే వీరు...

జన హృదయాలను గెలిచారు

న్యూస్‌మేకర్‌

ఇటీవల జరిగిన పుర పోరులో మహిళలు సత్తా చాటారు. జన హృదయాలను గెలిచి మేయర్‌ పీఠం దక్కించుకున్నారు. ఆ మహిళామణులే వీరు...

రాజకీయాలకు ఇల్లే శిక్షణాలయం

కూరగాయల ఉమారాణి, నిజామాబాద్‌ మేయర్‌

‘‘మాది మధ్యతరగతి కుటుంబం. మాకు ముగ్గురు పిల్లలు. దీనితో ఇంట్లో పని ఎక్కువే ఉంటుంది. దీనికి తోడు నాకు ఒక టైలరింగ్‌ దుకాణం కూడా ఉంది. దాని నిర్వాహణను కూడా చూసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు నా షాపుకు అనేక మంది మహిళలు వస్తూ ఉంటారు. వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలా మంది నాయకత్వం అంటే బయటకు ఎక్కడికో వెళ్లి పనిచేయటం అనుకుంటారు. మన ఇంటిని సక్రమంగా.. అందరూ అభివృద్ధి చెందేడట్లు నిర్వహించగలిగితే అదే నిజమైన నాయకత్వం అని నేను అనుకుంటా. రాజకీయాల్లోకి వద్దామనుకొనే మహిళలకు ఇల్లే శిక్షణాలయం. దానిలో నెగ్గుకొస్తే చాలు. మాది ప్రేమ వివాహం. నా భర్త రమేష్‌ నాకు అన్ని విషయాలలోను తోడుగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. నా ఉద్దేశంలో చాలా మంది మహిళలకు రాజకీయాలంటే ఒక భయం ఉంటుంది. చాలా మంది వీటిలోకి రావటానికి ఇష్టపడరు. కానీ మహిళలు ముందుకు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. కుటుంబాన్ని సక్రమంగా నడపగలిగిన వారు సమాజాన్ని కూడా నడపగలుగుతారు. కుటుంబం, సమాజం రెండింటినీ సమన్వయం చేసే శక్తి మహిళలలోనే ఎక్కువగా ఉంటుంది. నేను మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనేక అనుమానాలు ఉండేవి. అయితే ఆ తర్వాతి కాలంలో అవన్నీ తొలగిపోయాయి. అయితే మనం అనుకున్నది సాధించాలంటే- సహనం, పట్టుదల అవసరం. కేవలం మహిళలు మాత్రమే కాదు. యువత కూడా రాజకీయాలలోకి రావాలి. రాజకీయాలలోకి రావాలంటే మన చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన ఉండాలి. చాలా మంది రాజకీయాల్లోకి రావటం అంటే పదవుల కోసమే అనుకుంటారు. కానీ ఆ పదవి పొందటానికి వెనక సేవా భావం కూడా ఉండాలి. సమాజంలోని రుగ్మతలను గమనించాలి. వాటికి చికిత్స చేయటానికి ప్రయత్నించాలి.

కసుపు వెంకటరమణ, నిజామాబాద్‌

00-Navya.jpg


కష్టపడి పనులు చేసి..

గుమాల్‌ మమత, పాలమూరు కార్పొరేషన్‌ తొలి మేయర్‌

‘‘మాది మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అప్పన్నపల్లిలో చిన్న వ్యవసాయ కుటుంబం. నాన్న మొగులయ్య హమాలీ పనిచేసేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కానీ గడిచేది కాదు. అంత కష్టంలో కూడా నాన్న నన్ను, మా తముళ్లను చదివించారు. పదోతరగతి పూర్తి అయిన తర్వాత నాకు వివాహం చేసేశారు. నా భర్త నాకు వివాహం ముందు నుంచి తెలుసు. ముందు ప్రేమ. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. మా అత్త లక్ష్మమ్మ, మామ వెంకన్నలు నన్ను సొంత కూతురిగా చూసుకొనేవారు. ఈ 18 ఏళ్ల దాంపత్య జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు వివాహం అయిన వెంటనే మా మెట్టింటి వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనితో మాకున్న భూమి, డైరీఫాం.. చివరకు ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మేము అద్దె కట్టలేమేమోనని మాకు ఇల్లు అద్దెకు ఇవ్వటానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అలాంటి సమయాల్లో కూడా మేము ఎప్పుడూ అధైర్యపడలేదు. ఈ సమయంలోనే మావారు అప్పు చేసి ఒక టిప్పర్‌ కొన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టులు ప్రారంభించారు. మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఆర్థికంగా ఎదిగాం. మేము అమ్మేసిన ఇంటినే మళ్లీ కొనుక్కున్నాం. మొదటి నుంచి నేను రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేను. కానీ మా ఆయన మాత్రం రాజకీయంగా చురుకుగా ఉన్నారు. దీనితో అన్ని విషయాలు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేవి. అవన్నీ ఈ సారి పోటీ చేసినప్పుడు పనికొచ్చాయి. నేను మేయర్‌గా ఎన్నికవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మేయర్‌గా ఎన్నికవటం వల్ల నా బాధ్యతలు చాలా పెరిగాయి. పాలమూరులో 60 డివిజన్లు ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చేయాలి. నగరంలో చెత్త లేకుండా శుభ్రంగా ఉండాలి. ఈ రెండింటి కోసం పనిచేస్తాను.

నోముల రవీందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌


0000-Navya.jpg

నా సమర్థత నిరూపించుకుంటా

బుర్రి చైతన్య, నల్లగొండ మేయర్‌

‘‘మాస్వగ్రామం రామన్నపేట మండలం జనంపల్లి. నేను డిగ్రీవరకు చదువుకున్నాను. మా పుట్టింటివైపు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మాభర్త శ్రీనివాసరెడ్డి మాకు దూరపు బంధువులే. ఆయన మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. దీనితో వివాహం తర్వాత నాకు రాజకీయాల గురించి అవగాహన పెరిగింది. నాకు భక్తి ఎక్కువ. రోజూ ఇంట్లో పూజలు చేస్తుంటాను.

దీనితో నన్ను నల్గొండలోని రామాలయం కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంపికచేశారు. రెండు పర్యాయాలు ఆ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించా. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మా భర్త ప్రాతినిధ్యం వహించే వార్డు రెండుగా చీలడంతో స్థానికులు నన్ను ఒకవార్డు నుంచి పోటీచేయాలని ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉండడంతో మేం బాధ్యతగా భావించి నా భర్తతో పాటు నేను సైతం కౌన్సిలర్‌గా పోటీచేసి ఇద్దరమూ గెలుపొందాం. ఇలా అనుకోకుండా పార్టీ , ప్రజల సూచనల మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయంగా నాకు వచ్చిన అవకాశం ద్వారా నల్లగొండ నగరంలో మహిళల సాధికారతకు నావంతుగా కృషి చేస్తా. నగరంలో పొదుపు సంఘాలను మరింతగా బలోపేతం చేసి ప్రతి మహిళా స్వయం సమృద్ధి సాధించేలా చేయాలనేది నా లక్ష్యం. మా కార్పొరేషన్‌కు వచ్చే నిధులు, ఇక్కడున్న సమస్యలు, పాలనాపరమైన అంశాలపై నాకు అవగాహన ఉంది. అందరిసమన్వయం, సహకారంతో నల్లగొండ కార్పొరేషన్‌ ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తా.

చల్లా సాంబశివా రెడ్డి, నల్గొండ

Updated Date - Feb 19 , 2026 | 02:30 AM