Share News

శరీరం చెబితే వినాలి..!

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:06 AM

వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల శరీరం పలు మార్పులకు లోనవుతూ ఉంటుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం, రుతుక్రమం సరిగా లేకపోవడం, త్వరగా అలసిపోవడం...

 శరీరం చెబితే వినాలి..!

వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల శరీరం పలు మార్పులకు లోనవుతూ ఉంటుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం, రుతుక్రమం సరిగా లేకపోవడం, త్వరగా అలసిపోవడం, ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియలు మందగించడం, పునరుత్పత్తికి సంబంధించిన ఇబ్బందులు వేధిస్తుంటాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటాక శరీరం చేసే ఆరోగ్య హెచ్చరికలను మహిళలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

యుక్తవయసు దాటిన తరువాత 30 ఏళ్లలోపున్న మహిళలు కూడా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో అమ్మాయిలంతా తమకు ఏ సమస్య లేదనే అనుకుంటారు. ఈ ధోరణి వల్ల ఒక్కోసారి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలాగని అమ్మాయిలంతా సంబంధిత పరీక్షలు, స్కానింగ్‌లు చేయించుకోవాలని కాదు. ప్రతి మహిళ తన రొమ్ముల ఆకారం, పరిమాణం, స్పర్శ తదితరాలకు సంబంధించి ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. ఏదైనా అనుకోని మార్పు వచ్చిన వెంటనే గుర్తించగలిగేలా ఉండాలి. యువతుల రొమ్ముల్లో కణజాలం దట్టంగా ఉంటుంది. దీనివల్ల చిన్నపాటి గడ్డలను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతుంది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందని తెలిసినా దాన్ని హార్మోన్ల మార్పులు లేదా ఇన్ఫెక్షన్‌గా పొరబాటుపడే అవకాశం ఉంది. కాబట్టి మహిళలు అసాధారణ మార్పులపై ఏమరుపాటుగా వ్యవహరించకూడదు.


కుటుంబంలో తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి రక్త సంబంధీకులు ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లయితే యువతులు చిన్న వయసు నుంచే తమ రొమ్ముల ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. రొమ్ముల్లో లేదా చంక భాగాల్లో గడ్డలు ఏర్పడడం, రొమ్ములు గట్టిగా ఉండడం, రొమ్ముల చుట్టూ చర్మంపై గుంటలు కనిపించడం, అకస్మాత్తుగా రొమ్ముల ఆకృతిలో మార్పులు రావడం, చను మొనలు లోపలికి వెళ్లడం, చను మొనల నుంచి రక్తస్రావం, రొమ్ముల్లో వాపుతోపాటు విపరీతమైన నొప్పి లాంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వృద్ధాప్యంలో ఉన్నవారికంటే యవ్వనంలో ఉన్నవారికి ప్రమాద అవకాశాలు తక్కువే అయినప్పటికీ పూర్తిగా ఉండవని భావించకూడదు. దీనికి పరిష్కారం వ్యక్తిగత అవగాహన మాత్రమే. ప్రమాదం అంచులకు చేరి బాధపడేబదులు మహిళలంతా ముందునుంచే సరైన అవగాహనతో జాగ్రత్తలు, తగిన చికిత్సలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ప్రారంభ సంకేతాలు...

మెనోపాజ్‌కు అయిదేళ్ల ముందునుంచే మహిళల శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తుంటాయి. ఈ ప్రారంభ సంకేతాలను పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వల్లనే అనుకుంటూ చాలామంది భ్రమపడుతుంటారు. విపరీతమైన అలసట, తలనొప్పి, రుతుక్రమం సరిగా రాకపోవడం లాంటివాటికి తమ బిజీ లైఫ్‌ స్టయిల్‌ కారణమనుకుంటారు. కానీ 40 ఏళ్లు దాటిన మహిళలు ఈ సమస్యలను తేలిగ్గా దాటవేయకూడదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల అధికంగా రుతుస్రావమై రక్తహీనత, తలనొప్పి, నీరసాలకు దారితీస్తుంది. మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం ముప్పయ్యో ఏట నుంచి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. 35 ఏళ్ల తరువాత ఈ మార్పును మరింత స్పష్టంగా గమనించవచ్చు. 40 ఏళ్లు వచ్చే సరికి అండాల పరిమాణం, నాణ్యత గణనీయంగా క్షీణిస్తాయి. దీంతో గర్భధారణ పెద్ద సవాలుగా మారుతుంది. గర్భస్రావమయ్యే అవకాశాలు పెరుగుతాయి. గర్భాశయంలో ఏర్పడే మార్పుల వల్ల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలు తీవ్రంగా అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి ఉపశమనం పొందవచ్చు.


జీవన శైలి మాత్రమే కాదు...

అప్పటి వరకు సన్నగా నాజూగ్గా ఉన్న మహిళలు 30 దాటగానే ఒక్కసారిగా లావైపోతూ బాధపడుతుంటారు. డైటింగ్‌, జిమ్‌ వర్కవుట్లు చేస్తూ ఫలితం కనిపించక నీరసిస్తుంటారు. ఇలా బరువు పెరగడాన్ని.. క్యాలరీలు తీసుకోవడం, వాటిని ఖర్చు చేయడం అనే మామూలు ఆలోచనతో సరిపెట్టకూడదు. రోజూ చేసే శారీరక శ్రమ, తీసుకునే ఆహారం, నిద్ర, పని ఒత్తిడి, మానసిక ఆందోళన, కండరాల పరిమాణంలో వచ్చే మార్పులు అన్నీ కలిసి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. దీంతో పీసీఓఎస్‌, హైపో థైరాయిడిజం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ సమస్యలు ఏర్పడవచ్చు. వీటివల్ల ఆండ్రోజైన్‌ స్థాయిలు పెరిగి రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా మొటిమలు, అవాంఛిత రోమాలు, అధికంగా బరువు పెరగడం, శిరోజాలు రాలడం, అలసట తదితర మార్పులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి మహిళ తప్పనిసరిగా దృష్టి సారించాలి. రోజూ పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, డి విటమిన్‌, పీచు, ప్రొటీన్లు ఉండే ఆహారపదార్థాలను తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. రోజూ హాయిగా నిద్ర పోవాలి. తరచూ థైరాయిడ్‌, గ్లూకోజ్‌, హార్మోనల్‌ టెస్టులను చేయించుకుంటూ ఉండాలి.

Updated Date - Oct 03 , 2026 | 01:06 AM