Share News

చల్లదనంలో చెక్కుచెదరకుండా...

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:42 AM

చలికాలం చర్మం తేమ కోల్పోయి, పొడిబారిపోతుంది. దాంతో ముఖానికి వేసుకునే మేకప్‌ కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన మేకప్‌ చిట్కాలు పాటించాలి. అవేంటంటే...

చల్లదనంలో చెక్కుచెదరకుండా...

మాస్క్‌: చలికాలం చర్మానికి తేమను అందించడం కోసం వారానికోసారి హైడ్రేటింగ్‌ ఫేస్‌ మాస్క్‌ వాడుతూ ఉండాలి. రాత్రి నిద్రకు ముందు, ఈ మాస్క్‌ అప్లై చేసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసి, మాయిశ్చరైజర్‌ వాడుకుంటూ ఉండాలి.

మాయిశ్చరైజర్‌: మేకప్‌కు ముందు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంగ్రీడియెంట్లు కలిగి ఉండే నాణ్యమైన మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. దీంతో చర్మం ఇన్‌ఫ్లమేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. అయితే మేకప్‌కు ముందు అప్లై చేసిన మాయిశ్చరైజర్‌ చర్మంలో ఇంకిపోయేలా చూసుకోవాలి.

మస్కారా: చల్ల గాలికి మస్కారా, ఐషాడోలు చెదిరిపోకుండా ఉండడం కోసం, కనురెప్పల మీదున్న అదనపు నూనెలు పీల్చుకునేలా ఫేస్‌ పౌడర్‌ అప్లై చేయాలి. అలాగే ఈ కాలంలో వాటర్‌ ప్రూఫ్‌ మస్కారానే ఎంచుకోవాలి. అలాగే ఐషాడోలు, ఐలైనర్లను పై కనురెప్పలకే పరిమితం చేయాలి.

క్లెన్సర్‌: క్లెన్సర్‌ మరీ కఠినంగా ఉంటే చర్మం పాడవుతుంది. మరీ లైట్‌గా ఉంటే మేకప్‌ తొలగించుకోవడం కష్టమవుతుంది. కాబట్టి సున్నితమైన క్లెన్సర్‌నే ఎంచుకోవాలి. ఇందుకోసం క్రీమీ వాష్‌ లేదా హైడ్రేటింగ్‌ క్ల్లెన్సింగ్‌ లోషన్‌ ఎంచుకోవాలి. కాంబినేషన్‌ స్కిన్‌కు జెల్‌ లేదా ఫోమింగ్‌ క్లెన్సర్‌ ఎంచుకోవాలి.

పెదవులు: నూనె గ్రంథులు ఉండవు కాబట్టి పెదవులు త్వరగా పొడిబారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో పెదవుల పైన ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం తడిపిన వెచ్చని వస్త్రాన్ని ఉపయోగించాలి. అలాగే ఈ కాలంలో క్రీమ్‌ లిప్‌స్టిక్స్‌ వాడుకోవాలి.

ఫౌండేషన్‌: ఒక షేడ్‌ లైట్‌గా ఉండే ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. గ్లిజరిన్‌ కలిగి ఉండే ఫౌండేషన్‌ను ఎంచుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

చెదిరిపోకుండా: దుస్తులకు అంటుకుని మేకప్‌ చెదిరిపోకుండా ఉండడం కోసం, ఒక లేయర్‌ ట్రాన్స్‌క్యులెంట్‌ ప్రెస్‌డ్‌ పౌడర్‌ అప్లై చేసుకోవాలి.

అలాగే సెట్టింగ్‌ స్ర్పే కూడా ఉపయోగకరంగానే ఉంటుంది.

Updated Date - Nov 28 , 2026 | 12:46 AM