Share News

పసికందులు పదిలంగా...

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:46 AM

పసికందుల శరీరాలు సున్నితమైనవి. కాబట్టి చలికాలం చల్లదనం ప్రభావం నుంచి వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. స్నానం చేయించే తీరు మొదలు, వెచ్చదనాన్ని అందించే దుస్తుల వరకూ అనేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.

పసికందులు పదిలంగా...

పసికందుల శరీరాలు చిన్నవి, సున్నితమైనవి కాబట్టి చలి కాలంలో వెచ్చదనాన్ని అందించే జాగ్రత్తలు పాటించాలి. మరీ ముఖ్యంగా దుస్తుల విషయంలో ఒక పొర దుస్తులతో సరిపెట్టకుండా, పలు పొరలుగా దుస్తులు వేయాలి. తలకు క్యాప్‌, పాదాలకు సాక్స్‌, చేతులకు మిటెన్స్‌ తప్పనిసరి. అలాగని పిల్లలకు ఊపిరాడకుండా దుప్పట్లతో చుట్టేయకూడదు. బిగుతైన దుస్తులు, అసౌకర్యం కలిగించే నాసి రకం స్వెటర్లు వేయకూడదు. సుతిమెత్తని దుస్తులు, స్వెటర్లు, క్యాప్‌లను ఎంచుకోవాలి. శరీరమంతా కప్పి ఉన్నా, ముఖం బయటకు కనిపించేలా వదిలేయాలి. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ఈ కాలంలో పసిపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. అయినప్పటికీ నిద్రపోతున్న బిడ్డను లేపడం ఎందుకులే అని అనుకోకుండా ప్రతి మూడు, నాలుగు గంటలకోసారి నిద్రలేపి పాలు పట్టిస్తూ ఉండాలి.

స్నానం త్వరత్వరగా...

చలి కాలంలో వాతావరణంలో తేమ తగ్గి, చల్లగాలులకు చర్మం మరింత పొడిబారుతుంది. కాబట్టి ఈ కాలంలో పసిపిల్లలకు నలుగు పెడితే, ఎగ్జీమా సమస్య పెరుగుతుంది. స్నానానికి మరీ వేడిగా ఉండే నీళ్లు వాడకూడదు. అలాగే ఎక్కువ సబ్బుతో చర్మం పొడిబారుతుంది. కాబట్టి తల్లులు కొద్దిగా సబ్బును చేతులకు పట్టించి, రుద్ది స్నానం చేయించాలి. ఈ కాలంలో నూనెతో మర్దనలు చేయడం కూడా సరి కాదు. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత కోల్పోయి, పసికందులు, చేతులు, కాళ్లు చల్లబడిపోయే ‘కోల్డ్‌ స్ట్రెస్‌’లోకి వెళ్లిపోతారు.

ఈ పరిస్థితిలో పిల్లలను అలాగే వదిలేస్తే, చివరకు హైపోథర్మియాకు గురవుతారు. ఈ స్థితిలో పొట్ట కూడా చల్లబడిపోతుంది. దాంతో వెచ్చబరుచుకోవడం కోసం శరీరం అధిక గ్లూకోజ్‌ను వినియోగించుకుంటుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదు పడిపోయి, పిల్లలు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. అలాంటి పిల్లలను చూసిన తల్లులు, చల్లదనానికి వెచ్చగా పడుకున్నారని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. కాబట్టి ఈ కాలంలో పసిపిల్లలకు మర్దన, సుదీర్ఘ స్నానాలు మానేయాలి.


మర్దన ఇలా...

పసిపిల్లలకు స్నానానికి ముందు మర్దన మంచిదే అయినా, ఈ కాలంలో చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయించినా, గది ఉష్ణోగ్రత 26 నుంచి 28 డిగ్రీలకు తగ్గకుండా చూసుకుని, మర్దనను వీలైనంత త్వరగా ముగించాలి. మర్దనకు ఇంట్లో తయారుచేసుకున్న నువ్వుల నూనెను వెచ్చబరుచుకుని వాడుకోవాలి. స్నానం చేయించిన వెంటనే తడి లేకుండా తుడిచి, బేబీ మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్‌ కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి మొదట చేతిలోకి తీసుకుని, రెండు అరచేతులతో రుచ్చి కొద్దిగా వెచ్చబడిన తర్వాత అప్లై చేయాలి. అలాగే ఏ శరీర భాగానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేస్తున్నామో, ఆ శరీర భాగం మాత్రమే బహిర్గతమయ్యేలా చూసుకోవాలి. అంతే తప్ప ఒళ్లంతా బహిర్గతం చేయకూడదు.

దుస్తులు మెత్తగా, సౌకర్యంగా..

ఆ కాలంలో పసిపిల్లలకు పాలియస్టర్‌ దుస్తులు వాడకూడదు. కాటన్‌, సంప్రదాయ ఊలు దుస్తులు వెచ్చదనాన్ని అందించడంతో పాటు సౌకర్యంగా కూడా ఉంటాయి. పిల్లలకు కూడా చర్మ అలర్జీలు ఉంటాయి. కాబట్టి గుచ్చుకునే తత్వం కలిగిన దుస్తులు, ఎంబ్రాయిడరీ, చమ్కీ వర్క్‌ కలిగిన దుస్తులు వేయకూడదు. అలాగే దుస్తులను శుభ్రం చేసేటప్పుడు డెట్టాల్‌ వాడుతూ ఉంటారు. దీంతో పిల్లల ఒంటి మీద దద్దుర్లు తలెత్తే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా పసిపిల్లల దుస్తులను డిటర్జెంట్స్‌కు బదులుగా బేబీ క్లెన్సర్స్‌తో శుభ్రం చేసుకోవాలి.

రూమ్‌ హీటర్స్‌ వాడొచ్చా?

వెచ్చదనం కోసం రూమ్‌ హీటర్స్‌ ఉపయోగించేవారు, రాత్రంతా హీటర్‌ ఆన్‌ చేసి ఉంచేయడం సరి కాదు. హీటర్‌ వల్ల గదిలోని వాతావరణం పొడిబారి, పసికందుల చర్మం కూడా పొడిబారిపోతుంది. ఈ కాలంలో పసికందులు నిద్రపోయేటప్పుడు గొంతులో నుంచి గురక శబ్దం వస్తుంది. చాలా మంది తల్లులు దీన్ని జలుబుగా పొరబడుతూ ఉంటారు. నిజానికి తేమ పూర్తిగా కోల్పోవడం వల్ల వాతావరణం పొడిబారి, ఆ పొడిగాలి పీల్చడం వల్ల పసికందుల గొంతులు కూడా పొడిబారిపోయి గురక శబ్దం వస్తుంది. కాబట్టి హీటర్‌ ఆన్‌ చేసినా గది వెచ్చబడిన తర్వాత ఆపేస్తూ, చల్లబడినప్పుడు ఆన్‌ చేస్తూ ఉండాలి. వీలైనంత వరకూ దుస్తులు, దుప్పట్లతోనే వెచ్చదనాన్ని అందించే ప్రయత్నం చేయాలి.

ఇన్‌ఫెక్షన్లు సోకకుండా...

ఈ కాలంలో ఆర్‌ఎ్‌సవి వైరస్‌, ఫ్లూ వైరస్‌, అడినో,, రైనో వైర్‌సల వల్ల ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి పసికందులకు బయటకు తీసుకెళ్లకూడదు. కుటుంబంలో దగ్గు, జలుబు ఉంటే, వాళ్లు పిల్లల గదికి దూరంగా ఉండాలి. తల్లుల రుగ్మత పాల ద్వారా బిడ్డకు వ్యాపిస్తుందని అపోహ పడుతూ ఉంటారు .నిజానికి తల్లికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, పసికందుకు నిరభ్యంతరంగా పాలివ్వవచ్చు. ముఖానికి మాస్క్‌ ధరించి, చేతులు శుభ్రంగా కడుక్కుని పాలు పట్టించాలి. బిడ్డ ముఖం మీద తుమ్మడం, దగ్గడం, ముక్కు తుడుచుకుని అదే చేత్తో బిడ్డను తాకడం లాంటివి చేయకూడదు. జ్వరం, ఆయాసం, పాలు తాగకపోవడం, అరికాళ్లు, అరచేతులు చల్లబడడం లాంటి లక్షణాలు పసికందుల్లో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

డాక్టర్‌ రీనా లంకల

కన్సల్టెంట్‌ పిడియాట్రీషియన్‌,

రెయిన్‌బో చిల్ర్డెన్స్‌ హాస్పిటల్‌,

ఎల్‌బి నగర్‌, హైదరాబాద్‌.

Updated Date - Nov 24 , 2026 | 12:51 AM