బుద్ధుడు ఎవరు?
ABN , Publish Date - May 22 , 2026 | 02:31 AM
చైనాలో క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో పై చాంగ్ అనే చాన్ (జెన్) గురువు ఉండేవాడు. మట్జూ అనే మహనీయుడి దగ్గర అతను ధ్యాన పద్ధతులను నేర్చుకున్నాడు. రోజూ ఒక నిర్ణీత...
సద్బోధ
చైనాలో క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో పై చాంగ్ అనే చాన్ (జెన్) గురువు ఉండేవాడు. మట్జూ అనే మహనీయుడి దగ్గర అతను ధ్యాన పద్ధతులను నేర్చుకున్నాడు. రోజూ ఒక నిర్ణీత సమయంలో ధ్యానమందిరానికి మట్జూ వచ్చేవాడు. పై చాంగ్ ఎదుట కూర్చొనేవాడు. ఇద్దరూ కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవారు. ఆ తరువాత తనకు తోచిన కొన్ని విషయాలను మట్జూ బోధించి వెళ్ళేవాడు. ఆ తరువాత తను కూర్చున్న చాపను పై చాంగ్ మడత పెట్టి, పక్కన ఉంచేవాడు.
ఒక రోజు వారిద్దరూ ఎదురెదురుగా కూర్చొని ధ్యానం చేశారు. కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచారు. మట్జూ ఏదైనా చెప్పడానికి ప్రారంభించడానికి ముందే... చాపను చుట్టి, గురువు వైపు నవ్వు ముఖంతో చూశాడు పై చాంగ్. మట్జూ కూడా నవ్వుతూ లేచి వెళ్ళిపోయాడు. వారిద్దరి మధ్యా ఆ రోజు ఎలాంటి సంభాషణా జరగలేదు. కానీ మౌనంలోనే తన సందేహాలను పై చాంగ్ వ్యక్తపరచడం, వాటన్నిటినీ నిశ్శబ్దంగానే మట్జూ తీర్చడం జరిగిపోయింది. కొద్ది సమయంలోనే పై చాంగ్‌కు జ్ఞానసిద్ధి లభించింది. తదనంతరం ఎందరో అతనికి శిష్యులయ్యారు. సన్యాసులై ఆయనతోనే ఉండిపోయారు. తన శిష్యుల కోసం ఒక క్రమశిక్షణ నియమావళిని పై చాంగ్ రూపొందించాడు. దాన్ని అనుసరించాల్సిందిగా వారిని ఆదేశించడంతోపాటు... తను కూడా పాితస్తూ, నియమబద్ధంగా జీవించేవాడు. ‘పని చేయని రోజు... పస్తు ఉండాల్సిన రోజు’ అనేది అతను బోధించిన ముఖ్య సూత్రం. పై చాంగ్, అతని శిష్యులు దాన్ని తు.చా. తప్పకుండా పాటించేవారు.
ఒకసారి ఒక సన్యాసి ‘‘మహాశయా! బుద్ధుడు ఎవరు?’’ అని పై చాంగ్‌ను ప్రశ్నించాడు. వేరెవరైనా అయితే గౌతమ బుద్ధుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి జన్మించాడో, ఎలా జ్ఞానసిద్ధి పొందాడో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏది బోధించాడో... మొత్తం చరిత్ర వివరించి ఉండేవారు. కానీ పైచాంగ్ ‘‘నీవు ఎవరు?’’ అని ఆ సన్యాసిని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కుంటే బుద్ధుడు ఎవరో నీకే తెలుస్తుందన్నాడు. అలా ఆ సన్యాసిని అంతర్ముఖుణ్ణి చేసి, బుద్ధత్వాన్ని కనుగొనే మార్గాన్ని సూచించాడు.
కొన్నేళ్ళకు పై చాంగ్ వృద్ధుడయ్యాడు. ఒకరోజు అతను ఉపయోగించే పరికరాలన్నిటినీ శిష్యులు అతనికి కనిపించకుండా దాచిపెట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన పై చాంగ్ ఆ రోజు ఏదీ తినకుండా మొండికేశాడు. చివరకు శిష్యులు ఆ పరికరాలను తెచ్చి అతని ముందు ఉంచారు. వాటితో కొంతసేపు పని చేసిన తరువాతనే అతను ఆహారం తీసుకున్నాడు. ‘‘శరీరానికి ఏది జరిగినా, ఎలాంటి కష్టనష్టాలు సంభవించినా సాక్షులుగానే ఉండండి. కానున్నది కాకమానదు. జరిగేదాన్ని జరగనివ్వండి. ఏది చూసినా, ఏది విన్నా వాటితో బంధాన్ని ఏర్పరచుకోకండి’’ అని శిష్యులకు అతను బోధించేడు. చాలా సాధారణంగా జీవిస్తూ... ఆ విధంగా జీవించే కళను శిష్యులకు అతను నేర్పాడు.
రాచమడుగు శ్రీనివాసులు
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..