Share News

సమష్టి చైతన్యం కోసం...

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:37 AM

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో... మన శరీరంలోని సూక్ష్మశక్తి వ్యవస్థకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. మనిషి అంతరంగంలో ఉన్న సూక్ష్మ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే చక్రాల గురించి తెలుసుకోవాలి.

సమష్టి చైతన్యం కోసం...

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో... మన శరీరంలోని సూక్ష్మశక్తి వ్యవస్థకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. మనిషి అంతరంగంలో ఉన్న సూక్ష్మ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే చక్రాల గురించి తెలుసుకోవాలి. ఈ చక్రాలలో విశుద్ధి చక్రం అత్యంత విశిష్టమైనది. ఇది కేవలం గొంతు దగ్గర ఉండే ఒక సూక్ష్మ కేంద్రం మాత్రమే కాదు... మన వాక్కు, వ్యక్తిత్వం, సమష్టి భావన, సంబంధాలు, ఆత్మగౌరవం, వివేకం లాంటి అనేక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ చక్రానికి రాధాకృష్ణులు అధిష్టాన దేవతలు.

విశుద్ధి చక్రం స్వభావాన్ని శ్రీమాతాజీ నిర్మలాదేవి తన సందేశంలో వివరిస్తూ... వ్యక్తి తనలోని స్వార్థాన్ని అధిగమించి, సమష్టి చైతన్యంతో జీవించవలసిన అవసరాన్ని స్పష్టం చేశారు. ‘విశుద్ధి’ అనే పదంలోనే దాని ఆధ్యాత్మిక సారాంశం దాగి ఉంది. ‘శుద్ధ’ అంటే పవిత్రమైనది. ‘విశుద్ధ’ అంటే సంపూర్ణంగా శుద్ధమైనది, నిర్మలమైనది, జ్ఞానంతో ప్రకాశించేది. ఈ స్థితికి చేరుకున్న మనిషి తనను తాను మాత్రమే కాదు... తన చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రకృతిని, సమస్త మానవాళిని సమగ్ర దృష్టితో చూడగలుగుతాడు. విశుద్ధి చక్రం మన సూక్ష్మ శరీరంలో... గొంతు ప్రాంతంలో ఉంటుందని, దానికి పదహారు దళాలు ఉంటాయని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతోంది. మనిషి తన ఇంద్రియాల ద్వారా ప్రపంచంతో ఏర్పరచుకొనే సంబంధాలకు ఈ చక్రాన్ని ఒక ముఖ్యమైన కేంద్రంగా భావిస్తారు. కళ్ళతో చూడడం, ముక్కుతో వాసనను గ్రహించడం, నాలుకతో రుచిని తెలుసుకోవడం, చెవులతో వినడం, గొంతు ద్వారా మాట్లాడడం... ఈ చర్యలన్నిటిలోనూ వాక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనిషి ఆలోచనను మాటగా మార్చేది వాక్కే. ఒక మాట మనసును గాయపరచగలదు. బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వగలదు. అది కుటుంబాన్ని కలిపే శక్తి అవుతుంది. సమాజంలో విభేధాలకు కారణం కూడా అవుతుంది. కాబట్టి ‘విశుద్ధి శుద్ధి’ అంటే కేవలం శరీర శుద్ధి కాదు... ఆలోచనలో, వాక్కులో, ప్రవర్తనలో పవిత్రత రావడం.


మాటపై నియంత్రణ

మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాక్కు నియంత్రణ ఎంతో అవసరం. మనకు వచ్చిన ప్రతి ఆలోచనను వెంటనే మాటగా మార్చడం జ్ఞానం కాదు. ‘ఎప్పుడు మాట్లాడాలి? ఏది మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మన మాట ఎదుటివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే వివేకం కలిగి ఉండడమే నిజమైన వాక్సుద్ధి. విశుద్ధి చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు మనిషి మాటలో సత్యం, మాధుర్యం, స్పష్టత, బాధ్యత కనిపిస్తాయి. అసత్యం, అనవసరమైన విమర్శ, పరుషమైన మాటలు, దూషణ, ఇతరులను కించపరచడం, అహంకారపూరితమైన సంభాషణ... ఇవన్నీ మన అంతరంగాన్ని కలుషితం చేస్తాయి. విశుద్ధి చక్రం మనకు అందించే మరొక గొప్ప ఆధ్యాత్మిక బోధ... సమష్టి భావన. మనిషి జీవితంలో ఒక దశలో ‘నేను, నాది, నాకోసం, నా సంపద, నా కుటుంబం, నా ప్రయోజనం’ అనే భావనలు బలపడతాయి. ఆధ్యాత్మిక పరిణతి అంటే ‘నేను’ అనే పరిమితిని దాటి ‘మనం’ అనే విశాల భావనలోకి ప్రవేశించడం. మనిషి ఒంటరిగా జీవించలేడు. అతని జీవితం కుటుంబంతో, సమాజంతో, ప్రకృతితో, దేశంతో, చివరకు సమస్త మానవాళితో అనుసంధానమై ఉంటుంది. ఈ సమష్టి చైతన్యాన్ని విశుద్ధి చక్రం మనకు గుర్తు చేస్తుంది.


ఆచరణ ప్రధానం

విశుద్ధి చక్రం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు... దాని లక్షణాలను జీవితంలో ఆచరించడం ముఖ్యం. మాట్లాడేముందు ఆలోచించాలి. అసత్యం చెప్పకూడదు. పరుషమైన మాటలను నివారించాలి. ఇతరులను అనవసరంగా విమర్శించకూడదు. మన తప్పును అంగీకరించే వినయాన్ని పెంపొందించుకోవాలి. ‘నేను’ అనే భావనకు బదులు... ‘మనం’ అనే భావన పెంచుకోవాలి. ప్రకృతి వనరులను బాధ్యతగా వినియోగించాలి. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకుండా అభినందించాలి. సమాజ ప్రయోజనాన్ని వ్యక్తిగత ప్రయోజనంతో సమానంగా చూడాలి. అహంకారాన్ని, ఆధిపత్య ధోరణిని విడనాడాలి. ప్రతి జీవిలోనూ ఒకే పరమచైతన్యం ఉందని గ్రహించాలి. మన ఆలోచనలో, మాటలో, ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ‘విశుద్ధి’ అనే మాటకు నిజమైన అర్థం మన జీవితంలో ప్రతిఫలిస్తుంది.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ

నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - Sep 04 , 2026 | 06:39 AM