Share News

ఊరు పొమ్మన్నా నిలిచి గెలిచారు

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:10 AM

అందరు అమ్మాయిల్లా ఆమెకూ ఎన్నో కలలు. కానీ పెళ్లి తరువాత అవన్నీ కల్లలయిపోయాయి. భర్త నుంచి హెచ్‌ఐవీ సోకి... బాధితురాలయ్యారు. ఊరు వెలివేసినా.......

ఊరు పొమ్మన్నా నిలిచి గెలిచారు

అందరు అమ్మాయిల్లా ఆమెకూ ఎన్నో కలలు. కానీ పెళ్లి తరువాత అవన్నీ కల్లలయిపోయాయి. భర్త నుంచి హెచ్‌ఐవీ సోకి... బాధితురాలయ్యారు. ఊరు వెలివేసినా... సమాజం అవమానించినా... అన్నిటినీ భరించారు. తనలాంటివారి కోసం నిలబడి... ‘ఆశ్రయ ఫౌండేషన్‌’ నెలకొల్పారు. బాధను గుండెల్లో దాచుకొని... సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని... వైరస్‌ బాధితులకు గౌరవప్రదమైన జీవితం కోసం పోరాడుతున్న నాగరత్న రామగౌడ కథ ఇది.

‘‘కళంకిత... ఈ సమాజం నా మీద వేసిన ముద్ర. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి అవమానాలు, ఛీత్కారాలెన్నిటినో భరిస్తున్నాను. నేనే కాదు... దాదాపు హెచ్‌ఐవీ బాధితులందరి పరిస్థితి ఇదే. అందరిలా చిన్నప్పుడు ఎన్నో కలలు కన్నాను. బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం చేయాలి. విలువలు గల వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది! కర్ణాటక రాష్ట్రం... బెళగావి నగరం మాది. నిరుపేద కుటుంబం. ఆడపిల్ల ఇంటికి భారమనుకున్న మా అమ్మానాన్నలు పదహారేళ్లకే నా పెళ్లి చేశారు. మావారు రామగౌడ చిక్కొడిలో ఆటోరిక్షా నడుపుతారు.

ఆనందం ఆవిరి...

ఎన్నో ఆశలతో అత్తింటికి వెళ్లాను. ఆయన కూడా నన్ను బాగా చూసుకునేవారు. సంతోషంగా సాగిపోతున్న కాపురంలో పెద్ద కుదుపు. ఆరు మాసాలు అయిందనుకొంటా... నేను కాపురానికి వచ్చి. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళితే... పరీక్షలు చేశారు. అందులో ఆయనకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలింది. దాంతో నేను కూడా రక్తం నమూనా ఇచ్చాను. నాకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దిగ్ర్భాంతి కలిగించింది. మానసికంగా కుంగిపోయాను. గుమ్మం దాటి అడుగు బయట పెట్టాలంటే భయపడ్డాను.


ఊరు నుంచి తరిమేశారు...

కొద్ది రోజుల్లోనే విషయం ఊరంతా పాకింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మమ్మల్ని దూరం పెట్టారు. సామాజికంగా బహిష్కరించారు. చివరకు ఊరు వదిలిపెట్టి వెళ్లేలా పరిస్థితులు సృష్టించారు. దిక్కుతోచని స్థితిలో చిక్కోడి నుంచి పారిపోయి బెళగావికి వచ్చాం. అంతటితో నా కష్టాలు తీరలేదు. కొన్నేళ్ల తరువాత మావారు మరణించారు. ఆ క్షణం ఒక్కటే అనుకున్నాను... ‘ఎన్నాళ్లని ఇలా దాక్కొంటాం? ఎంత దూరమని పారిపోతాం? నిలబడి పోరాడదాం’ అని. నా ఒక్కదాని కోసమే కాదు... నాలా సమాజానికి దూరంగా, భయంభయంగా బతుకుతున్న హెచ్‌ఐవీ బాధితుల కోసం.

వైరస్‌ కంటే భయంకరం

ఎప్పుడైతే పోరాడాలని నిర్ణయించుకున్నానో... అప్పటి నుంచి ధైర్యంగా అడుగు బయటకు పెట్టాను. హెచ్‌ఐవీ బాధితులను కలిసి, వారి బాధలు తెలుసుకున్నాను. సమాజానికి భయపడి చాలామంది బతుకు మీద ఆశలు వదిలేసుకున్నారు. గౌరవం, ఉపాధి లభించక తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఇవన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే... ఈ వైరస్‌ కంటే కళంకితులని సమాజం వేస్తున్న ముద్ర వారికి ఎక్కువ హాని చేస్తుందని. అందుకే బాధితులందరికీ ఒక భరోసా, జీవితంపై ప్రేమ కల్పించడానికి 2016లో ‘ఆశ్రయ ఫౌండేషన్‌’ నెలకొల్పాను. దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి అవగాహన కల్పించి, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చూస్తున్నాను. హెచ్‌ఐవీ సోకిన ఏ దిక్కూ లేని అనాథ బాలికలు, ఒంటరి మహిళలకు ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాను. కర్ణాటకలో వారి కోసం ఏర్పాటు చేసిన తొలి హోమ్‌ మా ఫౌండేషన్‌. దీనికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉన్నాయి.

వేల జీవితాలకు భరోసా...

మంచి ఉద్దేశంతో ఒక స్వచ్ఛంద సంస్థనైతే నెలకొల్పాను కానీ... దానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాలేదు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వంతో పాటు పలు కార్పొరేటు సంస్థలను కలిశాను. అలా అందరి సహకారంతో క్రమంగా సమస్య పరిష్కారం అయింది. ఈ పదేళ్లల్లో నాలుగు వందలకు పైగా కార్యక్రమాలు నిర్వహించాము. వేలమంది జీవితాల్లో మార్పు తేగలిగాము. ఇదొక్కటేకాదు... ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధిత కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం. నేను చేస్తున్న సేవలకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ‘చైల్డ్‌ వెల్ఫేర్‌ అవార్డు’తో పాటు పలు పురస్కారాలు అందుకున్నాను. ఇవి నా లక్ష్యానికి మరింత ప్రేరణ ఇస్తాయనడంలో సందేహం లేదు.’’

Updated Date - Feb 07 , 2026 | 03:10 AM