Share News

అటుకులతో వెరైటీగా

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:30 AM

ఆరోగ్యానికి ఉపకరించే అటుకులతో అందరూ ఇష్టపడేలా సులువుగా తయారు చేసుకోగలిగే విభిన్న వంటకాలు మీ కోసం...

అటుకులతో వెరైటీగా

  • అటుకుల కేసరి

కావాల్సిన పదార్థాలు

అటుకులు- కప్పు, నెయ్యి- ఆరు చెంచాలు, జీడిపప్పు పలుకులు- పావు కప్పు, కిస్‌మిస్‌లు- తగినన్ని, కాచి చల్లార్చిన పాలు- ముప్పావు కప్పు, చక్కెర- ముప్పావు కప్పు, ఆరెంజ్‌ కలర్‌- పావు చెంచా, యాలకుల పొడి- అర చెంచా

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అటుకులు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. తరువాత మిక్సీలో వేసి రవ్వలా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌ మీద ఉన్న గిన్నెలో మూడు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. ఆపైన జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌లు వేసి వేయించి పళ్లెంలోకి తీయాలి. తరువాత అటుకుల రవ్వ వేసి కలుపుతూ అయిదు నిముషాలు వేయించాలి. రవ్వ ఎర్రగా వేగిన తరువాత కప్పు నీటిని పోసి ఉడికించాలి. ఆపైన పాలు పోసి చక్కెర, చెంచా నెయ్యి, ఆరెంజ్‌ కలర్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడికి దగ్గరకు వచ్చిన తరువాత వేయించిన జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌లు, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. దీని పైన మరో రెండు చెంచాల నెయ్యిని వేసి వేడివేడిగా సర్వ్‌ చేయాలి.


  • అటుకుల కట్టె పొంగలి

కావాల్సిన పదార్థాలు

అటుకులు- కప్పు, పెసరపప్పు- అర కప్పు, నెయ్యి- అయిదు చెంచాలు, పసుపు- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- తగినంత, మిరియాలు- పన్నెండు, ఉప్పు- ఒకటిన్నర చెంచాలు, జీలకర్ర- అర చెంచా, ఆవాలు- అర చెంచా, అల్లం తురుము- రెండు చెంచాలు, పచ్చి మిర్చి- మూడు, జీడిపప్పు పలుకులు- కొన్ని, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

పెసరపప్పును నీటితో శుభ్రంగా కడగాలి. స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి రెండు చెంచాల నెయ్యివేసి వేడిచేయాలి. అందులో పెసరపప్పును వేసి దోరగా వేయించి రెండు కప్పుల నీటిని పోసి పావు చెంచా పసుపు, కొద్దిగా కరివేపాకు, అర చెంచా ఉప్పు, మిరియాలు వేసి బాగా కలిపి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. వెడల్పాటి గిన్నెలో అటుకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. కుక్కర్‌ మూత తీసి పప్పు మిశ్రమంలో అటుకులు, చెంచా ఉప్పు వేసి ఒకటిన్నర కప్పుల నీటిని పోసి కలపాలి. చిన్నమంట మీద ఈ మిశ్రమాన్ని పది నిముషాలు ఉడికించాలి. ఇది ఉడుకుతున్నప్పుడు పైన తేరుకునే నురుగును తీసేస్తూ ఉండాలి.

స్టవ్‌మీద మందపాటి గిన్నె పెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి ముక్కలు, జీడిపప్పు పలుకులు, పావు చెంచా పసుపు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి. ఆపైన అటుకులు-పెసరపప్పు మిశ్రమాన్ని పోసి మరో అయిదు నిముషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గరకు వచ్చాక కొత్తిమీర తరుగు చల్లి దించాలి. ఈ అటుకుల కట్టె పొంగలిని సాంబార్‌ లేదా కొబ్బరి చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేయాలి.


  • పోహా చికెన్‌

కావాల్సిన పదార్థాలు

అటుకులు- అర కిలో, బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు- పావు కేజీ, పెరుగు- కప్పు, పసుపు- పావు చెంచా, కారం- రెండు చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర చెంచాలు, పుదీనా తరుగు- కొద్దిగా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- ఒకటిన్నర చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, నూనె- అయిదు చెంచాలు, అనాస పువ్వు- ఒకటి, మిరియాలు- అయిదు, లవంగాలు- నాలుగు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, షాజీరా- అర చెంచా, ఉల్లిపాయ చీలికలు- అర కప్పు, పచ్చి మిర్చి- నాలుగు, టమాటా ముక్కలు- అర కప్పు, గరం మసాల పొడి- చెంచా, నెయ్యి- రెండు చెంచాలు

తయారీ విధానం

పెద్ద గిన్నెలో చికెన్‌ ముక్కలు, పెరుగు, పసుపు, అర చెంచా కారం, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, అర చెంచా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి మూతపెట్టి అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి అది వేడయ్యాక పైన సూచించిన మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ చీలికలు, పచ్చి మిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి అయిదు నిముషాలు మగ్గించాలి. ఆపైన చికెన్‌ మిశ్రమం, చెంచా ఉప్పు, ఒకటిన్నర చెంచాల కారం, గరం మసాలా పొడి వేసి కలపాలి. ఆపైన అరగ్లాసు నీటిని పోసి పది నిముషాలపాటు ఉడికించాలి. తరువాత శుభ్రంగా కడిగిన అటుకులు వేసి జాగ్రత్తగా కలపాలి. ఉప్పు సరిచూసుకుని నెయ్యి వేసి చిన్న మంటమీద అయిదు నిముషాలు మగ్గించాలి. ఆపైన కొత్తిమీర తరుగు చల్లి దించాలి. ఇలా పొడిపొడిగా తయారైన చికెన్‌ పోహాను నిమ్మచెక్కలు, ఉల్లిపాయ చక్రాలతో వేడివేడిగా సర్వ్‌

చేయాలి.


  • అటుకుల వడలు

కావాల్సిన పదార్థాలు

అటుకులు- రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- ఆరు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, ఉప్పు- అర చెంచా, బియ్యప్పిండి- పావు కప్పు, జీలకర్ర- అర చెంచా, మిరియాలు- కొన్ని, పుల్లటి పెరుగు- అర కప్పు

తయారీ విధానం

వెడల్పాటి గిన్నెలో అటుకులను తీసుకుని శుభ్రంగా కడిగి పావు కప్పు నీటిని పోసి మూతపెట్టి ఇరవై నిముషాలు నాననివ్వాలి.

ఆపైన వాటిని చేత్తో బాగా మెదిపి పిండిలా చేయాలి. అందులో ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, బియ్యప్పిండి, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి బాగా కలపాలి. ఆపైన కొద్దికొద్దిగా పెరుగును వేస్తూ గారెల పిండిలా కలుపుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. చేతులకు నూనె రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని వేళ్లపై వడలా చేసి కాగిన నూనెలో జాగ్రత్తగా జారవిడచాలి. మధ్య స్థాయి మంటపై వడలను రెండు వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వీటిని అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - Oct 24 , 2026 | 02:48 AM