Share News

జగద్రక్షకం... వరాహరూపం

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:01 AM

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో మూడోది వరాహావతారం. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తరువాత వరాహస్వామి తన కోరల మీద భూమిని నిలిపి... విశ్వ సముద్రం నుంచి బయటకు...

జగద్రక్షకం... వరాహరూపం

తెలుసుకుందాం

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో మూడోది వరాహావతారం. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తరువాత వరాహస్వామి తన కోరల మీద భూమిని నిలిపి... విశ్వ సముద్రం నుంచి బయటకు తీసినట్టు పురాణాలు వర్ణించాయి.

నృవరాహః ప్రకర్తవ్యః కరాభ్యాం శంఖచక్రధృత్‌... దంష్ట్రోద్ధృత ధరాభాగః పాదేనైకేన సంస్థిత (శ్రీ వరాహరూప ధ్యానం)

శ్రీవరాహస్వామి మనుష్య రూపంతో, వరాహ ముఖంతో ఉంటాడు. కోరలతో భూమండలాన్ని ఎత్తి పట్టుకొని, ఒక పాదంపై నిలబడినట్టు ఉంటాడు. కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో శంఖం ధరించి... నీలమేఘశ్యామ వర్ణంలో దర్శనమిస్తాడు. అయితే శ్రీ వైఖానస ఆగమంలోని ‘ఖిలాధికారం’ అనే గ్రంథం శ్రీవరాహస్వామి మరికొన్ని రూపాలను వివరించింది. వాటిలో కొన్ని:

శ్రీ ఆది వరాహమూర్తి: శ్రీ ఆది వరాహమూర్తి నీలివర్ణంలో ప్రకాశిస్తూ, పుష్పాలతో కూడిన వస్త్రాలు ధరించి, భూదేవిని తన ఎడమ భుజం మీద ఎత్తుకొని నిలబెట్టి ఉంటాడు. భూదేవి కొంచెం సిగ్గుతో కూడిన ముఖంతో, అమితమైన ఆనందంతో స్వామివైపు చూస్తూ ఉంటుంది. స్వామి తన కుడిచేతితో ఆమె పాదాలను పొదివి పట్టుకొని ఉంటాడు. తన పర హస్తాలలో శంఖాన్ని, చక్రాన్ని ధరించి... సర్వాభరణ భూషితుడై ప్రకాశిస్తూ ఉంటాడు. భూమిని రక్షించిన తరువాత తిరుమల గిరులపై ఆయన సంచరించినట్టు ‘వరాహ పురాణం’ చెబుతోంది. అందుకే తిరుమల క్షేత్రానికి ‘వరాహ క్షేత్ర’మనీ, ఆ స్వామికి ‘ఆదివరాహస్వామి’ అని పేరు. శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల కొండపై తన ఆలయం కోసం కొంత స్థలాన్ని ఆదివరాహస్వామి దగ్గరే స్వీకరించారనీ, దానికి బదులుగా తనకన్నా ముందు ఆదివరాహస్వామికే ప్రథమ దర్శనం, ప్రథమ ఆరాధన, ప్రథమ నైవేద్యం జరిగేలా ఒప్పందం చేసుకున్నారనీ ‘వరాహ పురాణం’ వెల్లడిస్తోంది. కాబట్టి తిరుమలకు వెళ్ళే భక్తులు విధిగా ఆదివరాహస్వామిని దర్శిస్తేనే తిరుమల యాత్రాఫలం కలుగుతుంది. అంతేకాదు... ఆ స్వామిని దర్శించి, ఆరాధిస్తే భూ, గృహ యోగాలు సిద్ధిస్తాయని, దోషాలు తొలగి కళ్యాణ ఘడియలు సమీపిస్తాయని శాస్త్రవచనం.


శ్రీ ప్రళయ వరాహమూర్తి: ప్రళయకాలంలో జగత్తును రక్షించే శ్రీప్రళయ వరాహమూర్తి సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. తన ఎడమపాదాన్ని మడిచి, కుడిపాదాన్ని కిందకు ఉంచి... పరహస్తాలలో శంఖం, చక్రం ధరించి, కుడిచేతితో అభయముద్రతో, ఎడమచేతిని నడుముపై ఆనించి ఉంచుతాడు. బంగారు వర్ణపు వస్త్రాలు ధరించి, నీలమేఘశ్యామ వర్ణంతో విరాజిల్లుతూ ఉంటాడు.

శ్రీ యజ్ఞ వరాహమూర్తి: శ్రీయజ ్ఞవరాహ మూర్తి సింహాసనంపై ఆసీనుడై, ఎడమకాలిని మడిచి, ఉంచి, కుడికాలిని కిందకు చాపి ఉంటాడు. కుడిచేతిని అభయముద్రగా, ఎడమచేతిని వరదముద్రగా ఉంచి, పర హస్తాలలో శంఖం, చక్రం ధరించి ఉంటాడు.

మత్స్యపురాణం ప్రకారం... వరాహస్వామి కుడిపాదాన్ని తాబేలు మీద, ఎడమపాదాన్ని అనంతుని పడగమీద ఉంచి, పైకి లేపిన ఎడమ మోచేతిపై భూదేవిని ధరించి మోస్తూ, కుడిచేతితో పద్మం- గదను పట్టుకొని యానకమూర్తిగా నిలబడి ఉంటాడు.

చారిత్రకంగా పరిశీలిస్తే... సామాన్యశకం 900సంవత్సరంలో ఖజురహోలో పూర్తి వరాహస్వామిని నాలుగు కాళ్ళతో, సకల దేవతా స్వరూపాలతో శిల్పంగా మలిచారు. అలాగే తెలంగాణలోని పెద్దపల్లిలో ఒకప్పుడు ‘కోదండపురం’గా భాసిల్లి, ఆధునిక కాలంలో ‘మంధిని కమాన్‌పూర్‌’గా వ్యవహారంలో ఉన్న చిన్న గ్రామంలో కూడా... నాలుగు కాళ్ళతో ఉన్న శ్రీవరాహస్వామి ఒక కుడ్యచిత్రంగా పూజలందుకుంటున్నాడు. సామాన్యశకం ఏడో శతాబ్దంలో... పల్లవరాజుల కాలంలో మహాబలిపురంలో.,. భూదేవిని పట్టుకొని ఉన్న అరుదైన వరాహరూపాన్ని ఒక గోడమీద చూడవచ్చు. అయిదో శతాబ్దంలో, గుప్తుల కాలంలో... ఉదయగిరి గుహలలో కూడా వరాహస్వామి నిలువెత్తు మూర్తిని దర్శించవచ్చు. ఇటీవల విజయవాడ సమీపంలోని సీతానగరం విజయకీలాద్రి మీద ప్రతిష్ఠితుడైన శ్రీభూవరాహస్వామి ఎంతో మహిమాన్వితుడిగా ఖ్యాతిపొందాడు.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

ఇవి కూడా చదవండి...

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News

Updated Date - Apr 24 , 2026 | 05:01 AM