Share News

సంగీత శిఖరం ఉస్తాద్‌

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:41 AM

ఉస్తాద్‌ బడే గులామ్‌ అలీఖాన్‌! హిందుస్థానీ సంగీతం తెలిసిన వారికి సుపరిచితమైన పేరు. ఆయనకు మన తెలుగు వారితో ఉన్న సంబంధాలు గురించి కానీ...

సంగీత శిఖరం ఉస్తాద్‌

ఉస్తాద్‌ బడే గులామ్‌ అలీఖాన్‌! హిందుస్థానీ సంగీతం తెలిసిన వారికి సుపరిచితమైన పేరు. ఆయనకు మన తెలుగు వారితో ఉన్న సంబంధాలు గురించి కానీ, ఆయన చివరి రోజులు హైదరాబాద్‌లోనే గడిచాయని కానీ చాలా మందికి తెలియదు. ఆయన సమాధి కూడా మన హైదరాబాద్‌లోనే ఉంది. ఈ విషయం తెలిసిన వారు తక్కువే! గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఉస్తాద్‌ వర్ధంతి రోజు ఆయనకు నివాళులు అర్పించే సంగీత ప్రేమికుడు, ఐఆర్‌టిఎస్‌ అధికారి రవి పూడి పంచుకున్న జ్ఞాపకాలివి.

‘‘ఉస్తాద్‌ హిందుస్థానీ సంగీతంలో ఆనాడు, ఈనాడు ఒక శిఖరం. మొదట్లో నాకు కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. మా నాన్నగారు బషీర్‌బాగ్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఆఫీ్‌సలో పనిచేసేవారు. ఆ రోడ్డు పేరు ఉస్తాద్‌ బడే గులామాలిక్‌ ఖాన్‌ మార్గ్‌. నాన్నగారి దగ్గరకు వెళ్లినప్పుడు ఆ పేరు కొత్తగా అనిపించేది. ఆ రోడ్డుకు ఆ పేరు రావటానికి కారణం ఏమిటని వాకబు చేస్తే దగ్గరలో ఉన్న బషీర్‌బాగ్‌ ప్యాలె్‌సలో ఉస్తాద్‌ నాలుగేళ్లు గడిపారని తెలిసింది. కానీ ఆయన సమాధి హైదరాబాద్‌లో ఉందనే విషయం నాకు అప్పుడు తెలియదు. 1991లో అనుకుంటా... హైదరాబాద్‌లోని రామకృష్ణ థియేటర్‌లో ‘మొఘల్‌- ఏ- ఆజమ్‌’ సినిమా చూశా. అందులో ఆయన రెండు పాటలు పాడారు. ఆ పాటలు సూపర్‌ హిట్‌. ఆ రెండు పాటల కోసం నేను నాలుగుసార్లు ఆ సినిమా చూశా. అవే నాకు హిందుస్తానీ సంగీతంపై ఉన్న మక్కువను మరింతగా పెంచాయి. అప్పటి దాకా కేవలం హిందుస్థానీ సంగీత సమ్రాట్‌గా ఉన్న వ్యక్తి పేరు సామాన్య ప్రజల మనస్సుల్లోకి కూడా చేరిపోయింది. వాస్తవానికి ఉస్తాద్‌కు సినిమాలన్నా, సినీ సంగీతమన్నా సదభిప్రాయం లేదు. అందుకే ‘మొఘల్‌- ఏ - ఆజమ్‌’ సినిమా సంగీత దర్శకుడు నౌషాద్‌ ఎన్ని సార్లు పాటలు పాడమని అడిగినా ఒప్పుకోలేదట. చివరకు నౌషాద్‌ విసిగిపోయి- ‘‘ఈ విషయం నిర్మాతకే చెప్పండి’’ అని తప్పుకున్నారట. నిర్మాత వచ్చి ఉస్తాద్‌ను పాటలు పాడమని అడిగారట. ఈ రోజుల్లో (1960లలో) లతా మంగేష్కర్‌, రఫీ లాంటివారికి 300 రూపాయలు రెమ్యునరేషన్‌ ఇచ్చేవారు. అందువల్ల ఎక్కువ అడిగితే వదిలేస్తారని భావించిన ఉస్తాద్‌- ఒక్కో పాటకు 25 వేల చొప్పున రెండు పాటలకు 50 వేల రూపాయలు డిమాండ్‌ చేశారట. నిర్మాత మారుమాట్లాడకుండా 50 వేలు ఇచ్చి ఆ రెండు పాటలు పాడించుకున్నారట! ఉస్తాద్‌ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో!


తిరుగుబాటుగా...

ఉస్తాద్‌ది పాకిస్థాన్‌లోని కసూర్‌ ప్రాంతం. ఆయన లాహోర్‌లో రేడియోలో పనిచేసేవారు. ఆ సమయంలో తన ప్రోగ్రాములను ‘హరి ఓం తత్సత్‌’ అని ప్రారంభించేవారుట. ఒకసారి ఆ రేడియో డైరెక్టర్‌... ‘‘ఎప్పుడూ ‘రామ్‌ రామ్‌’ అంటుంటారు రహీమ్‌ గురించి మాట్లాడరా!’’ అని మందలించాడట. దానితో ఆయనకు కోపం, బాధ కలిగాయి. వెంటనే భారత్‌కు వచ్చేశారు. ఉస్తాద్‌ ముంబాయిలో మురార్జీ దేశాయ్‌ను కలిస్తే ఆయనకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన దేశమంతా తిరుగుతూ కచేరీలు చేస్తూ ఉండేవారు. మైసూర్‌, మద్రాసు, కాకినాడ, విశాఖపట్నం... ఇలా అనేక పట్టణాల్లో కూడా ఆయన కచేరీలు చేశారు. మద్రాసు సంగీత అకాడమీలో కచేరీ చేయటానికి వస్తే అక్కడి హోటల్‌లో ఆయనకు అవమానం జరిగింది. ఆ సమయంలో ఆ రోడ్డు మీద నుంచి వెళ్తున్న ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆయనను తన ఇంటికి తీసుకు వెళ్లి ఆతిఽథ్యమిచ్చారు. బహుశా ఆ సమయంలోనే ఉస్తాద్‌ ప్రభావం ఘంటసాలపై పడింది. ‘రసిక రాజ తగువారము కాదా!’ లాంటి అనేక పాటలలో హిందుస్థానీ ఛాయలను మనం గమనించవచ్చు. ఇక ఉస్తాద్‌ సాధన ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉండేదని చెబుతారు. నూతి లోపల ముఖం పెట్టి సాధన చేస్తూ- లోపల నుంచి వచ్చే ప్రతిధ్వనులను ఆయన గమనిస్తూ ఉండేవారని చెబుతారు. సాధారణంగా శాస్త్రీయ సంగీత కళాకారులు పక్కవాద్యంగా తాన్పురాను వాడతారు. కానీ ఉస్తాద్‌ తానే స్వయంగా సుర్‌మండల్‌ అనే వాయిద్యాన్ని తయారు చేసుకున్నారు.

సమాధి అద్బుతం...

హైదరాబాద్‌ను పాలించిన కులీ కుతుబ్‌షాహీలు షియాలు. ఇరాక్‌లో ఉన్న కర్బలా ప్రాంతం నుంచి వచ్చినవారు. తమ మాతృభూమి నుంచి దూరంగా వచ్చేశామని వారి బాధపడుతూ ఉండేవారు. కులీ కుతుబ్‌షా ప్రధాని మీర్‌ మోమిన్‌ ప్రస్తుత హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ‘దియారీ ఈ మోమిన్‌’ అనే శ్మశాన వాటికను నిర్మించి, దానిలో కర్బలా మైదానం నుంచి తీసుకువచ్చిన ఇసుకను చల్లించాడు. ఉస్తాద్‌ సమాధి కూడా అక్కడే ఉంది. అక్కడ కుతుబ్‌షాహీ రాజవంశస్తుల సమాధులు మనకు కనిపిస్తాయి. ఉస్తాద్‌ సమాధిని లతామంగేష్కర్‌, ఆశాబోంస్లే సహా అనేక మంది ప్రముఖ సంగీత కళాకారులు సందర్శించి, నివాళులు అర్పించారు. ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి.


తాన్‌సేన్‌ సమాధి పక్కనే ఒక చింతచెట్టు ఉంటుంది. ఈ చెట్టు చిగురు తింటే గాత్ర శుద్ధి అవుతుందని కళాకారుల నమ్మకం. ఉస్తాద్‌ సమాధి పక్కనే ఇలాంటి చింత చెట్టే ఉంటుంది! ఉస్తాద్‌ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించటానికి సమాధి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ఆయన ముని మనవడు ఫాజిల్‌ అలీఖాన్‌ కసూరీ నన్ను కలిశారు. ముత్తాతగారి టూమ్రీలతో మా అందరినీ ఆనందంలో ఓలలాడించారు. ఉస్తాద్‌ మన దేశం గర్వించదగ్గ గొప్ప కళాకారుడు. బిస్మిల్లాఖాన్‌, తాన్‌సేన్‌ల పేరిట ప్రభుత్వాలు పురస్కారాలు అందిస్తున్నారు. మన తెలుగు నేలతో సంబంధం ఉన్న ఉస్తాద్‌ పేరిట- తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక అవార్డు నెలకొల్పి యువకళాకారులకు అందిస్తే బావుంటుంది. అదే మనం ఉస్తాద్‌కు నిజమైన

నివాళి!’’

బిస్మిల్లాఖాన్‌, తాన్‌సేన్‌ల పేరిట ప్రభుత్వాలు పురస్కారాలు అందిస్తున్నాయి. తెలుగు నేలతో సంబంధం ఉన్న ఉస్తాద్‌ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఒక అవార్డు నెలకొల్పి యువకళాకారులకు అందిస్తే బావుంటుంది.

Updated Date - Apr 26 , 2026 | 03:41 AM