Share News

త్యాగాల బాటలో... రికార్డుల వేట

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:13 AM

15 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి భారత పురుషుల క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తుంటే.. మరోవైపు అదే 15 ఏళ్ల వయసులో కర్ణాటక చిన్నారి మహిళా క్రికెట్‌ రికార్డులను తిరగరాస్తోంది.

త్యాగాల బాటలో... రికార్డుల వేట

15 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి భారత పురుషుల క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తుంటే.. మరోవైపు అదే 15 ఏళ్ల వయసులో కర్ణాటక చిన్నారి మహిళా క్రికెట్‌ రికార్డులను తిరగరాస్తోంది. కొచ్చి వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్‌ 2027 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కొనుగోలు చేయడంతో లీగ్‌ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన క్రికెటర్‌గా ఉమా కశ్వి కందికుప్ప సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ చిన్నారి ప్రయాణం ఆమె మాటల్లోనే..

‘‘నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు క్రికెట్‌ ప్రయాణం మొదలైంది. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మా మేనమామ సాయి సత్య విజయ్‌. సచిన్‌ టెండూల్కర్‌ ఆటతీరును చూస్తూ, అభిమానిస్తూ పెరిగిన ఆయన నాలోని ఆసక్తిని గమనించి నన్ను మైదానం వైపు నడిపించారు. మేము బెంగళూరులోని బెల్లందూరులో ఉండేవాళ్లం. నేను బెంగళూరు శివార్లలోని నైస్‌ క్రికెట్‌ అకాడమీలో చేరినప్పుడు నా సాధనకు ఆటంకం కలగకూడదని అకాడమీకి దగ్గర్లోనే ఆయన ఇల్లు తీసుకున్నారు. ఉదయం ఐదున్నర గంటలకే నిద్రలేపి క్రికెట్‌ సాధన చేయించేవారు.

నిశ్శబ్ద త్యాగాలు

నేను ఈ స్థాయిలో నిలబడటం వెనుక మా కుటుంబం చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఐటీ ఉద్యోగి అయిన మా అమ్మ విజిత.. ఆఫీస్‌ మీటింగ్‌లను మైదానం స్టాండ్స్‌ నుంచే ల్యాప్‌టాప్‌లలో అటెండ్‌ అవుతూ నేను ఆడే అన్ని మ్యాచ్‌లకు హాజరైంది. మా నాన్న ప్రవీణ్‌కుమార్‌ నిత్యం నా ప్రణాళికలను సమన్వయం చేస్తే.. మా మేనమామ సత్య విజయ్‌ మ్యాచ్‌లకు నాతోపాటు మైదానానికి వచ్చి వెన్నంటి నిలిచారు. ఎనిమిదేళ్ల వయసులో అబ్బాయిలతో కలిసి ఆడుతున్నప్పుడు అవకాశాలు తక్కువగా వచ్చేవి. ఆ తర్వాత మాజీ క్రికెటర్‌ శాంతా రంగస్వామి నా ఆటచూసి ‘ఈ పాపలో ప్రత్యేకమైన టైమింగ్‌ ఉంది, క్రమశిక్షణతో శిక్షణ ఇస్తే భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పారు. అలాగే టీమిండియా క్రికెటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ చిన్ననాటి కోచ్‌ నసీరుద్దీన్‌ వద్ద, ఆపై అర్జున్‌దేవ్‌ అకాడమీలో చేరి నా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను.


పెరిగిన ఆత్మవిశ్వాసం

తొమ్మిదేళ్ల వయసులో ఇండియా నిప్పాన్‌ కప్‌లో ‘యంగ్‌ టాలెంట్‌ అవార్డు’ అందుకోవడం నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. వేద కృష్ణమూర్తి, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తిశర్మ, శ్రేయాంక పాటిల్‌ వంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకునే అవకాశం దక్కింది. 12 ఏళ్ల వయసులోనే బెంగళూరులో జరిగిన జూనియర్‌ క్లబ్‌ లెవల్‌ ఇంటర్‌ స్కూల్‌ టోర్నీలో అజేయంగా 217 పరుగులు సాధించి నా బ్యాటింగ్‌ సమర్థతను నిరూపించుకున్నాను. అర్జున్‌ దేవ్‌ అకాడమీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వరుసగా 11 టోర్నమెంట్లు గెలిపించాను. అనంతరం కర్ణాటక అండర్‌-15 జట్టుకు, మహారాణి ట్రోఫీలో బెంగళూరు బ్లాస్టర్‌ జట్టుకు నాయకత్వం వహించాను. 2026 జూన్‌- జూలైలో భారత అండర్‌-19 జట్టు తరఫున శ్రీలంక పర్యటనకు ఎంపికై టీ20ల్లో 4 వికెట్లు, వన్డేల్లో 2 వికెట్లు తీశాను.


కలల దిశగా పయనం

డబ్ల్యూపీఎల్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నన్ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన వార్త వినగానే కొచ్చిలో ఉన్న మా మేనమామ సత్య విజయ్‌ ఎంతో సంతోషించారు. గతంలో దీయా యాదవ్‌ (16 ఏళ్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి 15 ఏళ్లకే లీగ్‌ కాంట్రాక్ట్‌ సాధించడం నా బాధ్యతను మరింత పెంచింది. త్వరలో బంగ్లాదేశ్‌, నేపాల్‌లలో జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ సన్నాహాల్లో భాగంగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. చిన్న వయసులోనే దేశానికి ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను స్పూర్తిగా తీసుకుంటూ, భారత సీనియర్‌ జట్టులో సుస్థిర స్థానమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నాను.’’

అదే మలుపు

బీసీసీఐ మహిళల అండర్‌-15 వన్డే ట్రోఫీ టోర్నమెంట్‌ నా కెరీక్‌కు కీలక మలుపు. 172 సగటుతో ఏకంగా 516 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాను. అందులో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో మణిపూర్‌పై 66 బంతుల్లోనే 23 ఫోర్లు, ఏడు సిక్సర్లతో అజేయంగా 158 పరుగులు చేసి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాను. ఆల్‌ రౌండర్‌గా రాణిస్తూ విదర్భతో జరిగిన అండర్‌-19 టీ20 క్వార్టర్‌ ఫైనల్‌లో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాను.

Updated Date - Oct 31 , 2026 | 12:13 AM