Share News

నోరూరించే చాట్‌లు..!

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:18 AM

పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడే స్నాక్‌ ఐటెమ్‌ ‘చాట్‌’. దీన్ని ఇంట్లోనే తయారుచేసుకుంటే ఆ మజానే వేరు. పోషకాలతో నిండి మంచి ఆరోగ్యాన్ని అందించే వెరైటీ చాట్‌ల తయారీ మీకోసం...

నోరూరించే చాట్‌లు..!

పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడే స్నాక్‌ ఐటెమ్‌ ‘చాట్‌’. దీన్ని ఇంట్లోనే తయారుచేసుకుంటే ఆ మజానే వేరు. పోషకాలతో నిండి మంచి ఆరోగ్యాన్ని అందించే వెరైటీ చాట్‌ల తయారీ మీకోసం...

  • పాలక్‌ పత్తా చాట్‌

కావాల్సిన పదార్థాలు: కమ్మటి పెరుగు- ఒక కప్పు, పంచదార- ఏడు చెంచాలు, నల్ల ఉప్పు- పావు చెంచా, ఉప్పు- తగినంత, శనగపిండి- ఒక కప్పు, పసుపు- అర చెంచా, కారం- రెండు చెంచాలు, పచ్చి మిర్చి- రెండు, అల్లం తురుం- ఒక చెంచా, మంచినీళ్లు- రెండున్నర కప్పులు, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, పాలకూర ఆకులు పెద్దవి- పన్నెండు, చింతపండు గుజ్జు- ఒక కప్పు, జీలకర్ర పొడి- ఒక చెంచా, అరటి పండు- ఒకటి, ద్రాక్ష పండ్లు- ఒక కప్పు, చాట్‌ మసాలా పొడి- అర చెంచా, దానిమ్మ గింజలు- పావు కప్పు, కర్బూజ గింజలు- పావు కప్పు, పుదీనా చట్నీ- రెండు చెంచాలు

తయారీ విధానం: వెడల్పాటి గిన్నెలో పెరుగు, మూడు చెంచాల పంచదార, నల్ల ఉప్పు, ఉప్పు వేసి క్రీమ్‌లా వచ్చే వరకు చెంచాతో కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో శనగపిండి, ఉప్పు, పసుపు, చెంచా కారం, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుం వేసి కప్పు నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. స్టవ్‌ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడిచేయాలి. పాలకూర ఆకులను నీళ్లతో కడగాలి. ఒక్కో ఆకును శనగపిండి మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో చింతపండు గుజ్జు, నాలుగు చెంచాల పంచదార, చెంచా కారం, జీలకర్ర పొడి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని దగ్గరకు వచ్చే వరకు ఉడికించి గిన్నెలోకి తీయాలి. అందులో అరటి పండు ముక్కలు, ద్రాక్ష పండ్లు వేసి కలపాలి. వెడల్పాటి గిన్నెలో పాలకూర బజ్జీలు పరచాలి. వాటిమీద స్వీట్‌ పెరుగు చుక్కలు, చింతపండు-పండ్ల మిశ్రమం వేసి పైన చాట్‌ మసాలా చిలకరించాలి. ఆపైన దానిమ్మ గింజలు, కర్బూజ గింజలు చల్లి అక్కడక్కడ చెంచాతో పుదీనా చట్నీ వేయాలి. అంతే పాలక్‌ పత్తా చాట్‌ రెడీ..!


  • బనారసీ టమాటర్‌ చాట్‌

కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు- ఒక కప్పు, నెయ్యి- అయిదు చెంచాలు, పంచదార- నాలుగు చెంచాలు, జీలకర్ర- చెంచా, అల్లం తురుం- చెంచా, పచ్చి మిర్చి- నాలుగు, కారం- చెంచా, నల్ల ఉప్పు- అర చెంచా, ఉప్పు- తగినంత, గరం మసాలా పొడి- చెంచా, చాట్‌ మసాలా పొడి- చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉడికించి మెత్తగా మెదిపిన ఆలుగడ్డ ముక్కల ముద్ద- ఒక కప్పు, ఉడికించిన బఠాణీలు- అర కప్పు, వేయించిన జీలకర్ర- చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, డైమండ్‌ నమ్‌కిన్స్‌- అర కప్పు

తయారీ విధానం: స్టవ్‌ మీద చిన్న గిన్నె పెట్టి నాలుగు చెంచాల పంచదార, అయిదు చెంచాల నీళ్లు పోసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, అల్లం తురుం, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కారం వేసి కలపాలి. ఆపైన టమాటా ముక్కలు, నల్ల ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరువాత టమాటా ముక్కలను గరిటెతో మెత్తగా మెదిపి అందులో గరం మసాలా పొడి, చాట్‌ మసాలా పొడి, నిమ్మరసం, ఉడికించిన ఆలుగడ్డ ముక్కల ముద్ద వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన బఠాణీలు వేసి కలిపి ఉప్పు సరిచూసి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఒక గాజు బౌల్‌లో టమాటా-ఆలూ మిశ్రమం పరచాలి. దాని మీద షుగర్‌ సిరప్‌ వేసి ఆపైన వేయించిన జీలకర్ర, కొత్తిమీర తరుగు చల్లాలి. మధ్యలో డైమండ్‌ నమ్‌కిన్స్‌ వేసి చుట్టూరా కరిగించిన నెయ్యి చిలకరించాలి. అంతే బనారసీ టమాటర్‌ చాట్‌ రెడీ!

2.jpg


  • దహీ పాపడీ చాట్‌

కావాల్సిన పదార్థాలు: మైదా- రెండు కప్పులు, బొంబాయి రవ్వ- రెండు చెంచాలు, శనగపిండి- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, మిరియాల పొడి- చెంచా, చింతపండు- అర కప్పు, బెల్లం- అర కప్పు, ఖర్జూరాలు- అయిదు, యాలకుల పొడి- పావు చెంచా, కారం- ఒకటిన్నర చెంచాలు, ఉడికించిన ఆలుగడ్డలు- అయిదు, నానబెట్టి ఉడికించిన శనగలు- అరకప్పు, జీలకర్ర- చెంచా, మిరియాలు- ఒకటిన్నర చెంచాలు, యాలకులు- రెండు, ధనియాలు- చెంచా, అల్లం- రెండు చిన్న ముక్కలు, పచ్చి మిర్చి- ఏడు, మామిడి పొడి- ఒకటిన్నర చెంచాలు, ఇంగువ- పావు చెంచా, నూనె తగినంత, ఎండు మిర్చి- రెండు, పుదీనా- ఒక కట్ట, కొత్తిమీర- ఒక కట్ట, బూందీ- అర కప్పు, పెరుగు- అర కప్పు, దానిమ్మ గింజలు- అర కప్పు

తయారీ విధానం: స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో జీలకర్ర, మిరియాలు, యాలకులు, ధనియాలు, ఉప్పు వేసి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి గిన్నెలోకి తీయాలి. అందులో మామిడి పొడి, అర చెంచా కారం వేసి కలపాలి. మిక్సీలో పుదీనా, కొత్తిమీర, అర చెంచా పంచదార, నాలుగు పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, చిన్న అల్లం ముక్క, మూడు చెంచాల నూనె వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వెడల్పాటి గిన్నెలో మైదా, రవ్వ, శనగపిండి, అర చెంచా మిరియాల పొడి, ఉప్పు, మూడు చెంచాల నూనె వేసి బాగా కలపాలి. ఆపైన కొన్ని నీళ్లు చిలకరించి మెత్తటి ముద్దలా కలపాలి. అరగంట తరువాత సన్నని చపాతీలు పామి దానిమీద ఫోర్క్‌తో రంధ్రాలు గుచ్చాలి. తరువాత చిన్న మూతతో పాపడీలు కట్‌ చేయాలి. వీటిని వేడి నూనెలో వేసి డీప్‌ ఫ్రై చేసి పళ్లెంలోకి తీయాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు కప్పుల నీళ్లు, బెల్లం, చింతపండు, ఖర్జూరాలు, తగినంత ఉప్పు, రెండు చెంచాల నూనె, అర చెంచా మిరియాల పొడి, యాలకుల పొడి, చెంచా కారం వేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించి స్టయినర్‌లో వేసి మరోగిన్నెలోకి వడబోయాలి. ఆలుగడ్డలను చిన్న ముక్కలుగా కోసి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉడికించిన శనగలు, అల్లం తురుం, కొత్తిమీర తరుగు, మూడు పచ్చి మిర్చి ముక్కలు వేసి కలిపి నూనె, ఇంగువలతో తాలింపు పెట్టాలి. వెడల్పాటి పళ్లానికి చింతపండు చట్నీ రాయాలి. దానిమీద పాపడీలు పరచాలి. వాటిపై చింతపండు చట్నీ వేయాలి. ఆపైన ఆలు మిశ్రమం, పెరుగు వేసి పైన కొద్దిగా పంచదార, మసాలా పొడి, దానిమ్మ గింజలు చల్లాలి. వీటిపై బూందీ వేయాలి. దీనిమీద కొత్తిమీర-పుదీనా చట్నీ వేయాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లేస్తే దహీ పాపడీ చాట్‌ రెడీ..!

4.jpg

Updated Date - Mar 07 , 2026 | 05:18 AM