మురిపించే మువ్వల జుంకాలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:36 AM
అందంగా ఊగులాడుతూ శ్రావ్యంగా శబ్దం చేసే మువ్వల జుంకాలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఇటీవల ఇటలీ ప్రధాని ‘జార్జియా మెలోని’ పోస్ట్ చేసిన సెల్ఫీ... సామాజిక మాధ్యమాల్లో ‘జుంకా’ పేరుతో...
అందంగా ఊగులాడుతూ శ్రావ్యంగా శబ్దం చేసే మువ్వల జుంకాలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఇటీవల ఇటలీ ప్రధాని ‘జార్జియా మెలోని’ పోస్ట్ చేసిన సెల్ఫీ... సామాజిక మాధ్యమాల్లో ‘జుంకా’ పేరుతో వైరల్ కావడంతో ఒక్కసారిగా మహిళల దృష్టి వీటివైపు మళ్లింది. లెక్కకు మించిన చిన్న చిన్న మువ్వలు, గంటలు, సన్నని పొడవాటి గొలుసులు, మధ్య మధ్యలో జోడించిన అదనపు హంగులు, మోనాలిసా రాళ్లు, ఎనామెల్ పెయింటింగ్, కుందనాలు... ఈ జుంకాల ప్రత్యేకత. బంగారం, వెండి, ఆక్సిడైజ్డ్ సిల్వర్, బ్లాక్ మెటల్, ఇత్తడి, పంచలోహాలతో రూపొందించిన ట్రైబల్, బోహేమియన్, కశ్మీరీ డిజైన్లను యువతులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఏ సందర్భంలోనైనా ఎలాంటి డ్రెస్‌లమీదనైనా చక్కగా సూటయ్యే ఈ మువ్వల జుంకాలపై ఓ లుక్కేద్దామా...
రాయల్ ఆక్సిడైజ్డ్ డిజైన్స్
గోల్డ్, ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఫినిషింగ్‌లతో వీటిని రూపొందిస్తారు. చాంద్‌బాలీలకు గంటలు జోడించి వాటికి మువ్వలు వేలాడదీసిన రాయల్ డిజైన్డ్ జుంకాలు.. అన్ని వర్గాల మహిళలకు ఎలిగెంట్ లుక్‌నిస్తాయి. ఎంబ్రాయిడరీ కుర్తీలు, పట్టు చీరలు, అనార్కలీ డ్రెస్‌లు, లెహంగాల మీద ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లపై కూడా హుందాగా సూటవుతాయి. రోజువారీ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
యాంటిక్ గోల్డ్ డిజైన్స్
ఇవి మ్యాట్ మెరుపుతో వింటేజ్ గోల్డ్ జ్యువెలరీ లుక్‌తో అలరిస్తుంటాయి. ఎక్కువగా కశ్మీరి, ఆఫ్ఘాని డిజైన్ల మేళవింపుతో వీటిని రూపొందిస్తుంటారు. కెంపులు, పచ్చలు, ముత్యాలు, కుందనాలు పొదిగి ఫిలిగ్రీ నగిషీలతో కూర్చిన డిజైన్లను యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిని పండుగలు, వివాహాది శుభకార్యాలప్పుడు సంప్రదాయ దుస్తులపై ధరిస్తే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది.
మీనాకారీ డిజైన్స్
పూర్వకాలంనాటి పర్షియన్ ఎనామెల్ వర్క్ వీటి ప్రత్యేకత. వీటిని స్టెర్లింగ్ సిల్వర్, ఇత్తడి, మిశ్రమ లోహాలతో రూపొందించి వాటిపై ఆక్సిడైజ్డ్ లేదా గోల్డ్ ఫినిషింగ్‌తో మెరుగులు దిద్దుతారు. ఇవి సల్వార్లు, బోహో-చిక్ డ్రెస్‌లపై మోడరన్ లుక్‌నిస్తాయి. నడుస్తున్నప్పుడు వీటినుంచి మధురమైన చిన్న శబ్దం వస్తుంటుంది.
చెయిన్ డిజైన్స్
అందమైన దిద్దులకు మువ్వలతో కూడిన సన్నని పొడవాటి గొలుసులను వేలాడదీస్తారు. ఇవి మినిమలిస్టిక్ లేయర్ జ్యువెలరీ డిజైన్లను పోలి ఉంటాయి. ఎక్కువగా రాజస్థానీ శైలిని ప్రతిబింబిస్తుంటాయి. వీటిని బంగారం, వెండితోపాటు ఆభరణాలకోసం వినియోగించే లోహాలన్నింటితో రూపొందిస్తుంటారు. విభిన్నమైన డిజైన్లలో అందరికీ అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల సంప్రదాయ, మోడరన్ దుస్తులపై గ్రేస్ లుక్‌నిస్తాయి.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్