ఆవపిండితో అద్భుత వంటకాలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:38 AM
ఆవాలు మసాలా దినుసుల్లో ముఖ్యమైన ద్రవ్యం. ‘మసాలా’ అనేది ఉర్దూ పదం. ‘సంభారాలు’ అంటారు వీటిని. ఆవాలు ఘాటుగా, కారంగా ఉండి శరీరంలో వేడి పుట్టిస్తాయి. వాతాన్ని, కఫాన్ని అదుపులోకి తెస్తాయి.
ఆవాలు మసాలా దినుసుల్లో ముఖ్యమైన ద్రవ్యం. ‘మసాలా’ అనేది ఉర్దూ పదం. ‘సంభారాలు’ అంటారు వీటిని. ఆవాలు ఘాటుగా, కారంగా ఉండి శరీరంలో వేడి పుట్టిస్తాయి. వాతాన్ని, కఫాన్ని అదుపులోకి తెస్తాయి. ఆవాకు కూర, ఆవ నూనె, ఆవ పిండి, ఆవ గింజలు... ఇలా ఆవ మొక్క అనేక రకాలుగా ఆహార అవసరాలు తీరుస్తోంది. తాలింపు గింజల్ని వేగించేప్పుడు నూనెలో మొదట ఆవ గింజలే వేస్తారు. పరిమళం కోసం మాత్రమే కాదు, తాలింపుల్లో అర చెంచాడు గింజలే వేసినా వాటి ప్రభావం మన శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవ పెట్టిన కూరల్లో కూడా అర చెంచా ఆవపిండిని, అది కూడా కూర చల్లారాక కలిపితే చాలు... రుచే కాదు, గుణాలు కూడా మారిపోతాయి. దంచిన ఆవాల పొడిని ఆవ పిండి అంటారు. ఆవ పిండిని కొన్ని రకాల ఇగురు కూరల్లో కలిపి తినే అలవాటు మన పూర్వులకు బాగా ఉండేది.
కందబచ్చలి ఆవ పెట్టిన కూర: ఆవ పిండి కలిసిన కూరల్లో ప్రసిద్ధి చెందిన వంటకం ఇది. వీలు కుదిరినప్పుడు తరచూ ఈ కూర వండుకొంటే శరీరానికి మేలు చేస్తుంది.
తియ్య కూరలు: సొరకాయ, బూడిద గుమ్మడికాయ, గోరుచిక్కుడు, అరటికాయ, అరటి ఊచ, క్యాబేజీ... ఇలాంటి కూరగాయలతో ఇగురు కూరలు వండిన తరువాత చల్లారే వరకూ ఆగి, చాలా కొద్దిగా ఆవపిండిని కలిపి మూతపెట్టి, ఒకటి రెండు గంటలు కదల్చకుండా ఉంచితే తియ్యగూరలన్నీ చాలా కమ్మగా ఉంటాయి. ఆవపిండికి ఉన్న తీక్షణ గుణంవల్ల ఆ కూరగాయలోని పోషకాలు త్వరగా వంటబడతాయి కూడా!
ఆవ పెరుగు పచ్చడి: చెంచాడు ఆవాలను నీళ్లతో నూరి, లీటరు పెరుగులో కలిపి, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, పచ్చిమిరప ముక్కలు వేసి, జీలకర్ర తాలింపు పెట్టినది ఆవ పెరుగు పచ్చడి. కావాలంటే ఇందులో మీకిష్టటమైన కూరగాయల ముక్కల్ని ఉడికించి కలిపితే... దాన్ని ఆ కూరగాయ పెరుగుపచ్చడి అని పిలుస్తారు. హిందీలో ‘రాయీ’ అంటే ఆవాలు. పెరుగులో ఆవపిండిని కలిపితే దాన్ని ‘రాయితా’ అన్నారు. మన హోటళ్లవాళ్లు పెరుగులో ఉల్లిముక్కలు కలిపి ‘రైతా’ అనటం మొదలు పెట్టారు.
ఆవాలకు విష దోషాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉంది. దురదలు, దద్దుర్లు వంటి అలర్జీ సంబంధమైన వ్యాధుల్లో ఆవ పిండి కలిసిన వంటకాలు తింటూ ఉంటే మంచిది. సర్పి (హెర్పిస్), ఇతర వైరస్ వ్యాధులు వచ్చినప్పుడు ఆవ పెట్టిన కూరలు మేలు చేస్తాయి. ఆవాలు బాగా తీక్షణమైన ద్రవ్యం కనుక... ఎంత పరిమితంగా కలుపుతామో అంత పరిమితంగానే తినటం మంచిది.
ఆవ పిండి కలిసిన వంటకాలను వారంలో ఒకటి రెండుసార్లయినా తింటే... జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆవాలను నూనెలో వేయించి, దంచి, నీళ్లలో కలిపి తాగిస్తే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. జీర్ణకోశ వ్యాధులన్నిటికీ ఆవపిండి ఔషధమే.
చెంచాడు ఆవాల్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగితే కడుపులో వాతం, గ్యాస్, ఉబ్బరం తగ్గి మలమూత్రాలు సాఫీగా అవుతాయి. అజీర్తి, ఆకలి మందగించడం, కడుపునొప్పి వంటి బాధల్లోనూ ఆవాలు మేలు చేస్తాయి.
గంగరాజు అరుణాదేవి