Share News

ముద్దొచ్చే ముక్కెర

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:34 AM

ముక్కు పుడక లేదా ముక్కెర.. భారత ప్రాచీన సంప్రదాయ ఆభరణం. ఇది మళ్లీ ట్రెండ్‌గా మారింది. పలు రకాల డిజైన్లలో రూపొందుతున్న ముక్కెరలు నేటి వేడుకల్లో ప్రత్యేక...

ముద్దొచ్చే ముక్కెర

ఫ్యాషన్‌

ముక్కు పుడక లేదా ముక్కెర.. భారత ప్రాచీన సంప్రదాయ ఆభరణం. ఇది మళ్లీ ట్రెండ్‌గా మారింది. పలు రకాల డిజైన్లలో రూపొందుతున్న ముక్కెరలు నేటి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మగువల మనసులు దోచుకుంటున్న ఆ అందమైన ముక్కెరలు మీ కోసం...

ముక్కెర మగువల నాసికలను అలంకరించిన కాలానికి సంబంధించి భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉంటాయి. మధ్యయుగంలో ఈ ఆభరణం ఊపిరి పోసుకుందని కొందరు, పర్షియా, మధ్య ఆసియా, ఇస్లామిక్‌ సంస్కృతి ప్రభావాల ఫలితమని ఇంకొందరంటారు. మూలాలు ఎక్కడివైనా ఈ ఆభరణం భారతీయ సంస్కృతిలో భాగమైపోయిందన్నది మాత్రం అక్షర సత్యం.

పెళ్లికూతురి నగల్లో...

ముక్కుపుడక వధువు ఆభరణాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని సమాజాల్లో ముక్కెరను, పెళ్లి, సంతానసాఫల్యం, కుటుంబ గౌరవాలకు సూచికగా పరిగణిస్తారు. మెడలో హారం, చెవులకు జుంకాలు, నుదుట పాపిటబిళ్ల.. ఎన్ని ఆభరణాలను అలకరించుకున్నా, వాటన్నిటికీ మించి ముక్కెర ఎక్కువగా ఆకట్టుకుంటుంది. కాబట్టే ఇది నేడు సరికొత్త డిజైన్లలో రూపొందుతోంది. వజ్రాలు, కెంపులు పొదిగిన ముక్కెరలు నేడు అధిక ఆదరణ పొందుతున్నాయి.

ఆకట్టుకునే డిజైన్లలో...

మహారాష్ట్ర: అర్థచంద్రాకృతిలో ఉండే నథ్‌, మహారాష్ట్ర శైలి. ముత్యాలు, రంగురాళ్లు పొదిగిన బ్రహ్మణి లేదా పేష్వాయి నథ్‌ వధువు అలంకరణలో ముఖ్యమైన భాగం.

రాజస్థాన్‌: పెద్ద రింగును పోలిన ముక్కెరను జాతిరాళ్లతో అలంకరించడం రాజస్థాన్‌ సంప్రదాయం. దీన్ని పొడవాటి చైన్‌తో చెవికీ, జడకూ తగిలించుకుంటారు. పోల్కి, ముత్యాలు, మీనాకారి పనితనాలతో రూపొందే రాజస్థానీ ముక్కెరలు స్థానిక సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి.

పంజాబ్‌: పంజాబ్‌, ఉత్తర భారతదేశంలో పెద్ద రింగులతో కూడిన నథ్‌ను ధరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి పెళ్లిలో వధువులు ఈ ఆభరణాన్ని తప్పనిసరిగా ధరిస్తూ ఉంటారు.


ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌కు చెందిన ఘర్‌వాలి సమాజాలు ధరించే ముక్కెర... నథూలి. బంగారంతో రూపొందే నథూలి వధువు ఆభరణాల్లో ముఖ్యమైన అంశం. నథూలి పనితనం, పరిమాణాలు... కుటుంబ వారసత్వం, సంపదలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఈ ఆభరణాన్ని తర్వాతి తరాల ఆడపిల్లలకు అందిస్తూ ఉంటారు.

బెంగాల్‌: బెంగాలీలు ముక్కెరను ఫూల్‌, నోలక్‌ అనే రెండు రకాల ముక్కెరలను ధరిస్తూ ఉంటారు. ఈ రెండూ అద్భుతమైన పనితనాలను కలిగి ఉంటాయి.

దక్షిణ భారతదేశం: తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, కేరళల్లో చిన్నసైజు ముక్కుపుడకలు వాడుకలో ఉన్నాయి. ముక్కెర, మూకుతి, ముఖుత్తి అనే ఈ ముక్కుపుడకలు ప్రధానంగా బంగారం, జాతి రాళ్లతోనే రూపొందుతూ ఉంటాయి. కొన్ని దక్షిణభారతీయ సంప్రదాయాల్లో రెండు వైపులా రెండు ముక్కుపుడకలను ధరిస్తూ ఉంటారు.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 05:34 AM