Recipes Made with Broccoli: బ్రోకలీతో భలేబ్రోకలీతో
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:22 AM
పోషకాల గనిగా పరిగణించే బ్రోకలీతో రకరకాల కూరలు, సలాడ్లు చేసుకుని తింటూ ఉంటాం. దీనితో పిల్లలు అమితంగా ఇష్టపడే స్నాక్స్ కూడా ప్రయత్నించవచ్చు. బ్రోకలీని విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు.
పోషకాల గనిగా పరిగణించే బ్రోకలీతో రకరకాల కూరలు, సలాడ్లు చేసుకుని తింటూ ఉంటాం. దీనితో పిల్లలు అమితంగా ఇష్టపడే స్నాక్స్ కూడా ప్రయత్నించవచ్చు. బ్రోకలీని విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు.
బ్రోకలీ టిక్కీ
కావాల్సిన పదార్థాలు
బ్రోకలీ- ఒకటి, కేరట్ తురుం- అర కప్పు, పనీర్ తురుం- అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కారం- అర చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, ధనియాల పొడి- అర చెంచా, గరం మసాల- అర చెంచా, ఉప్పు- చెంచా, వెల్లుల్లి తరుగు- ఒక చెంచా, అల్లం తరుగు- చెంచా, శనగ పిండి- రెండు చెంచాలు, బొంబాయి రవ్వ- ఒక చెంచా, నూనె- తగినంత
తయారీ విధానం
బ్రోకలీని సన్నగా తరిగి వేడి నీళ్లలో వేసి తీయాలి. తరువాత బ్లెండర్‌లో వేసి కచ్చాపచ్చాగా బ్లెండ్ చేయాలి. వెడల్పాటి గిన్నెలో బ్రొకలీ తరుగు, కేరట్ తురుం, పనీర్ తురుం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాల పొడి, ఉప్పు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, శనగపిండి, బొంబాయి రవ్వ, ఒక చెంచా వేడి నూనె వేసి ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో
కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో చిన్న బిళ్లల్లా చేయాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. దాని మీద బ్రోకలీ మిశ్రమంతో చేసిన బిళ్లలు పరచాలి. వీటిని చిన్న మంట మీద రెండు వైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారుచేసిన టిక్కీలను టమాటా సాస్ లేదా చిల్లీ సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

ఛీజ్ బాల్స్
కావాల్సిన పదార్థాలు
బ్రోకలీ- ఒకటి, ఆలుగడ్డలు- నాలుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి తరుగు- ఒక చెంచా, పచ్చి మిర్చి- రెండు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్- ఒక చెంచా, ఉప్పు- ఒక చెంచా, మిరియాల పొడి- ఒక చెంచా, గరం మసాల పొడి- ఒక చెంచా, కార్న్‌ఫ్లోర్- రెండు చెంచాలు, బ్రెడ్ పౌడర్- రెండు కప్పులు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, నూనె- తగినంత, ఛీజ్ క్యూబ్స్- తగినన్ని
తయారీ విధానం
బ్రోకలీని వేడి నీళ్లతో కడిగి సన్నగా తరగాలి. ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని గిన్నెలోకి తీసుకుని మెత్తగా మెదపాలి. వెడల్పాటి గిన్నెలో బ్రోకలీ తరుగు, ఉడికించిన ఆలుగడ్డల మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాల పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. తరువాత రెండు చెంచాల బ్రెడ్ పౌడర్, కొత్తిమీర తరుగు వేసి చేత్తో మెత్తగా కలపాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని బ్రోకలీ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ అరచేతిలో చిన్న కప్‌లా చేయాలి. అందులో ఒక ఛీజ్ క్యూబ్ పెట్టి అన్ని వైపుల నుంచి మూసివేసి గుండ్రని బాల్‌లా చేయాలి. ఇలా అన్ని బాల్స్ రెడీచేసి బ్రెడ్ పౌడర్‌లో ఒకసారి దొర్లించి పళ్లెంలో ఉంచాలి. స్టవ్ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. తరువాత అందులో బ్రోకలీ మిశ్రమంతో చేసిన బాల్స్ వేసి అన్నివైపులా బంగారు రంగు వచ్చే వరకూ దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఈ బ్రోకలీ ఛీజ్ బాల్స్‌ను టమాటా సాస్ లేదా మయొనైజ్‌తో వేడిగా సర్వ్ చేయాలి.

బ్రోకలీ ఆమ్లెట్
కావాల్సిన పదార్థాలు
బ్రోకలీ- ఒకటి, కోడిగుడ్లు- మూడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, టమాటా తరుగు- పావు కప్పు, క్యాప్సీకమ్ తరుగు- పావు కప్పు, పచ్చి మిర్చి- రెండు, మిరియాల పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
బ్రోకలీని చిన్న గుత్తులుగా తరిగి వేడినీళ్లలో వేసి పది నిమిషాలపాటు ఉంచాలి. తరువాత నీళ్లలో నుంచి తీసి సన్నగా తరగాలి. ఒక గిన్నెలో కోడిగుడ్ల సొనలు వేసి బాగా బీట్ చేయాలి. వెడల్పాటి గిన్నెలో బ్రోకలీ తరుగు, కోడిగుడ్ల సొనలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా తరుగు, క్యాప్సీకమ్ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి వేడి చేయాలి. అందులో బ్రోకలీ మిశ్రమాన్ని పోసి సమంగా పరిచి పైన కొత్తిమీర చల్లి మూతపెట్టి మగ్గించాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసి ఆమ్లెట్‌ను రెండో వైపునకు తిప్పి ఎర్రగా వేగనివ్వాలి. ఆపైన ఈ బ్రోకలీ ఆమ్లెట్‌ను పళ్లెంలోకి తీసి టమాటా సాస్‌తో సర్వ్ చేయాలి.
