Share News

సుమన్‌... మరువలేని సంగీత సౌరభం

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:06 AM

లతా మంగేష్కర్‌లాంటి సుమధుర గాత్రం... ఆమెతో సరిపోలిన ప్రతిభ.. అయినా అదృష్టం కలిసిరాలేదు.. అయినా వెనకడుగు వేయకుండా తాను ప్రేమించిన హిందుస్థానీ....

సుమన్‌... మరువలేని సంగీత సౌరభం

లతా మంగేష్కర్‌లాంటి సుమధుర గాత్రం... ఆమెతో సరిపోలిన ప్రతిభ.. అయినా అదృష్టం కలిసిరాలేదు.. అయినా వెనకడుగు వేయకుండా తాను ప్రేమించిన హిందుస్థానీ సంగీతాన్నే నమ్ముకున్నారు సుప్రసిద్ధ బాలీవుడ్‌ గాయనీమణి సుమన్‌ కళ్యాణ్‌పూర్‌. ఇటీవల మరణించిన సుమన్‌ జీవితంలో మలుపులెన్నో!

సుమన్‌ తల్లితండ్రులది ఉడుపి. సారస్వత బ్రాహ్మణుల కుటుంబం. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరిగిన సుమన్‌ కలకత్తాలో పుట్టి ఢాకా, ముంబైలో విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి సుమన్‌కు సంగీతమన్నా, చిత్రలేఖనమన్నా మక్కువ ఎక్కువ. పటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ఖాన్‌ దగ్గర హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందారు. చిత్రలేఖనంలో సుప్రసిద్ధ జేజే ఆర్ట్స్‌ స్కూలో తర్ఫీదు పొందారు. ఆల్‌ఇండియా రేడియోలో అనేక మరాఠీ పాటలు పాడారు. ఇలా ఒక ప్రోగ్రామ్‌లో సుమన్‌ పాడిన పాటను సుప్రసిద్ధ గాయకుడు తలత్‌ మహమూద్‌ విని ఆమెకు కబురుచేసి, ‘‘నాతో పాడతావా?’’ అని అడిగారట! అప్పుడప్పుడే ఎదుగుతున్న గాయనీకి అదొక గొప్ప ప్రశంస అనే చెప్పాలి. ఆ తర్వాత సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్‌ - ‘ఆర్‌పార్‌’ సినిమాలో రఫీ, గీతాదత్‌తో కలిసి సుమన్‌తో ఒక పాట పాడించారు. ఆ పాట పెద్ద హిట్‌ అయింది. అయితే ‘‘సుమన్‌ చిన్నపిల్ల. ఆమె పేరు గ్రామ్‌ఫోన్‌ రికార్డుల మీద వేయడం మంచిది కాదు’’ అని కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పటంతో ఆమె పేరు ఎక్కడా కనిపించదు. బహుశా ఆమె దురదృష్ట పరంపర అక్కడే మొదలయిందేమో! ‘మంగు’ సినిమా విజయం తర్వాత సుమన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు.


రఫీ-లత వివాదం...

సంగీత దర్శకుడు ట్యూన్‌ అందిస్తే- ఇద్దరు కలిసి ఒక డ్యూయెట్‌ పాడారనుకుందాం. ఆ పాటకు రాయల్టీ ఎవరికి వస్తుంది? సంగీత దర్శకుడికా? పాడిన గాయనీ గాయకులకా? ఈ వివాదమే రఫీ-లతల మధ్య తలెత్తింది. సంగీత దర్శకుడే పాటకు ప్రాణం పోస్తాడు కాబట్టి రాయల్టీ అతనికే దక్కాలనేది రఫీ వాదన. ‘పాటకు శ్వాస గాయకులే’ అనేది లత భావన. ఈ వివాదం ముదరడంతో లత, రఫీతో పాడను అని భీష్మించుకుంది. ఆ కాలంలో డ్యూయెట్లంటే రిహార్సల్స్‌ జరిగేవి. గాయకుడు, గాయనీ కలిపి ప్రాక్టీసు చేసేవారు. ఆ తర్వాత రికార్డు చేసేవారు. 1963 నుంచి 1967 వరకూ సుమారు నాలుగేళ్లు- అనేక సినిమాల్లో లత గాత్రాన్ని పోలిన సుమన్‌కు అనేక అవకాశాలు వచ్చాయి. రఫీ, సుమన్‌ కలిపి డ్యూయెట్లు పాడేవారు. సోలో పాటలు లత పాడేవారు. 1967ల తర్వాత లత-రఫీల మధ్య సంధి కుదిరింది. ఇద్దరు కలిపి డ్యూయెట్లు పాడటం ప్రారంభించారు. అయినా సుమన్‌కు అవకాశాలు తగ్గలేదు. రోషన్‌, శంకర్‌ జైకిషన్‌, మదన్‌మోహన్‌, లక్ష్మీకాంత్‌-ప్యారెలాల్‌ లాంటి సంగీత దిగ్గజాల దగ్గర పాటలు అనేకం పాడారు.

అరుదైన పురస్కారం...

బాలీవుడ్‌పై దృష్టి పెట్టినా- సుమన్‌కు హిందుస్థానీ సంగీతం మీద మక్కువ పోలేదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఆధారంగా భావగీతాలు, భజనలు పాడుతూ ఉండేవారు. సినిమాల్లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ధోరణిని ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది ‘సుర్‌ సింగార్‌ సంసద్‌ పురస్కార్‌ ఇస్తారు. అనేకసార్లు ఈ బహుమతి లతా మంగేష్కర్‌కు లభించింది. లత ప్రాభవంలో కూడా సుమన్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు మూడుసార్లు దక్కింది. 2023లో ఆమెకు భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్‌’ పురస్కారం కూడా అందించింది. ఆమె ఆత్మకథ ‘సుమన్‌ సౌగంధ్‌’ మరాఠీలో వెలువడింది. దానికి అనేక ప్రశంసలు లభించాయి. మేరు శిఖరంలాంటి లత ప్రభ వెలుగుతున్న సమయంలో కూడా సుమన్‌ తన అస్థిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తనదైన రీతిలో, బాణీలో పాడుతూనే ఉన్నారు. కోట్లాది మంది అభిమానులను తన పాటలతో ఓలలాడిస్తూనే ఉన్నారు. సుమన్‌ గాత్రం సంగీత సుగంధం. అందమైన వెన్నెలలో సుమన్‌ పాటలు వినటం ఒక అదృష్టం. వెన్నెలకు సుగంధం ఉంటే అది సుమన్‌ గాత్రమవుతుంది. అది ఎప్పటికీ మనల్ని మైమరపిస్తూనే ఉంటుంది.

రవి పాడి, 9701370954

Updated Date - Jun 07 , 2026 | 05:06 AM