Share News

Suhana Khan Shares Insights on Parenting: అంతిమ సలహా వాళ్లదే

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:21 AM

లైమ్‌లైట్‌కు దూరంగా పెరిగిన సుహానా నటిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ షారూఖ్‌, గౌరిల గారాల పట్టి, నటననే కెరీర్‌గా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Suhana Khan Shares Insights on Parenting: అంతిమ సలహా వాళ్లదే

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ కూతురు, సుహానా ఖాన్‌... తన తల్లితండ్రుల పెంపకం గురించీ, కుటుంబ తీరుతెన్నుల గురించీ ఆసక్తికరమైన విశేషాలను తాజాగా వెల్లడించింది. త్వరలో తండ్రితో కలిసి ‘కింగ్‌’ సినిమాలో నటించబోతున్న సుహానా చెప్పిన వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకుందాం...

లైమ్‌లైట్‌కు దూరంగా పెరిగిన సుహానా నటిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ షారూఖ్‌, గౌరిల గారాల పట్టి, నటననే కెరీర్‌గా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. సంపన్న కుటుంబంలో కుటుంబ వ్యవహారాలు భిన్నంగా ఉంటాయనీ, కుటుంబసభ్యులు ఎవరికి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనీ అనుకుంటాం. కానీ షారూఖ్‌ కూతురు సుహానా ఖాన్‌, తన ఇంట్లో నెలకొని ఉండే పూర్తి భిన్నమైన వాతావరణం గురించి వివరిస్తూ... ‘ప్రతి చిన్న విషయాన్నీ తల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లకపోయినా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి సందర్భంలో తల్లితండ్రులను ఆశ్రయిస్తూ ఉంటాను. మొదట్లో ప్రవృత్తిని అనుసరించి, లాజిక్‌తో ఆలోచించి, ప్రక్రియ మొత్తాన్నీ అవసరానికి మించి విశ్లేషించడం నా నైజం. నిర్ణయం తీసుకునే ముందు, కొన్ని ఆప్షన్స్‌ను ఎంచుకుని, అంతిమంగా వాటిని తల్లిదండ్రుల ముందు ఉంచినప్పుడు, వాళ్లు అంతిమంగా సరైన నిర్ణయం వైపు నడిపిస్తూ ఉంటారు. నాన్న, అమ్మ... ఇద్దరూ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి సందర్భంలో నాకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు’ అంటూ మీడియాకు వివరించింది.


భిన్నమైన ధోరణులే తోడ్పడ్డాయి

సలహాలివ్వడంలో కూడా తన తల్లితండ్రులు భిన్నంగా వ్యవహరిస్తారనీ, ఇద్దరూ భిన్నమైన ధోరణులను అవలంబిస్తారనీ వివరిస్తూ... ‘నాన్న కాస్త కవితాత్మకంగా సలహాలిస్తూ, జీవితం పట్ల తనకున్న బహుముఖ దృక్కోణాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అమ్మ డొంకతిరుగుడు లేకుండా, సూటిగా మాట్లాడుతుంది. ఎలాంటి అయోమయానికి తావు లేకుండా, ఆచరణాత్మకంగా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ రకమైన తల్లిదండ్రుల భిన్నమైన ధోరణులు సంతులనాన్ని కనిపెట్టడంలో నాకెంతో బాగా సహాయపడ్డాయి. మన పట్ల ఇతరులకున్న అభిప్రాయాల గురించిన ఒత్తిడికి లోనవడం సులభం. కానీ ఆ మార్గంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను. బదులుగా, ప్రజాభిప్రాయాల గురించి అతిగా ఆలోచించకుండా, ఒకసారికి ఒక పనిని పూర్తి చేసుకుంటూ వెళ్లే నైజాన్ని అలవాటు చేసుకున్నాను’ అంటూ తల్లిదండ్రుల మార్గనిర్దేశం తనకెంతగా ఉపయోగపడుతూ ఉంటుందో వివరించింది సుహానా.

గదికి వెళ్లి ఏడ్చి....

అనేక సందర్భాల్లో నటుల సంతానం నటననే కెరీర్‌గా ఎంచుకుంటూ ఉంటుంది. కానీ సుహానా బాల్యంలో నటనను ఇష్టపడేది కాదు. ఆ విషయం గురించి వివరిస్తూ... ‘చిన్నప్పుడు నటనను ఇష్టపడేదాన్ని కాదు. చాలా సందర్భాల్లో నటనను అసహ్యించుకునేదాన్ని. కానీ యుకెలో, బోర్డింగ్‌ స్కూల్‌లో చదివే రోజుల్లో ఒక నాటకం కోసం ఆడిషన్లు జరిగాయి. ఆ నాటకంలో ఒక పాత్రంటే నాకు చాలా ఇష్టం. దాన్లో నటించాలని గట్టి పట్టుదల పెరిగిపోయింది. కానీ చివర్లో వెల్లడించిన ఫలితాల్లో ఆ పాత్రకు బదులుగా కోర్‌సకు ఎంపికైనట్టు తెలియడంతో, ఎంతో నిరాశకు లోనయ్యాను. నాటకంలో నటించే అర్హత పొందలేకపోవడంతో, గదికి తిరిగొచ్చి, చాలాసేపు ఏడ్చాను. నటన అన్నది కుటుంబ వారసత్వం మాత్రమే కాదనీ, నాకున్న బలమైన కోరిక అదేననీ తెలిసొచ్చింది. వేదిక మీద నటించడంలో కలిగే సంతృప్తినీ, థ్రిల్‌నూ కోరుకుంటున్నానే విషయాన్ని కూడా ఆ సందర్భంలో పూర్తిగా గ్రహించగలిగాను’ అంటూ నటన పట్ల తనకున్న మక్కువ గురించి వివరించింది సుహానా. ఆ అపజయంతో నటన మీద పట్టు పెంచుకోవాలనే సంకల్పం బలపడి, న్యూయార్క్‌ యూనివర్సిటీ, టిష్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో నటనలో శిక్షణ పొందింది. 2023లో, నెట్‌ఫ్లిక్స్‌, ఆర్చీ్‌సలో నటించిన సుహానా తాజాగా తండ్రి షారూఖ్‌ ఖాన్‌తో కలిసి ‘కింగ్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో వెండితెర కొత్త తారగా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.

Updated Date - Jan 18 , 2026 | 04:21 AM