Share News

వేగం... ఆమె మంత్రం

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:05 AM

ఎన్నో ఏళ్ల చరిత్ర.. పురుషాధిక్య క్రీడ.. గంటకు వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే బైక్‌లు. ఆ నిప్పులు చెరిగే ట్రాక్‌ మీద ఓ 18 ఏళ్ల యువతి సరికొత్త రికార్డు తిరగరాసింది. ‘డేటోనా 200’ రేసులో పోడియం ఎక్కిన తొలి మహిళగా కేలా యాకోవ్‌ రికార్డు సృష్టించింది.

వేగం... ఆమె మంత్రం

ఎన్నో ఏళ్ల చరిత్ర.. పురుషాధిక్య క్రీడ.. గంటకు వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే బైక్‌లు. ఆ నిప్పులు చెరిగే ట్రాక్‌ మీద ఓ 18 ఏళ్ల యువతి సరికొత్త రికార్డు తిరగరాసింది. ‘డేటోనా 200’ రేసులో పోడియం ఎక్కిన తొలి మహిళగా కేలా యాకోవ్‌ రికార్డు సృష్టించింది.

ఆ రేసింగ్‌ ట్రాక్‌ మీద గాలి కూడా వేగంతో పోటీపడాలి. ఇంజిన్ల గర్జనలు, టైర్ల రాపిడితో పుట్టే వేడి.. ప్రాణాలను పణంగా పెట్టి దూసుకెళ్లే రేసర్లు.. ఇదీ, అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘డేటోనా 200’ మోటార్‌ సైకిల్‌ రేస్‌ దృశ్యం. దశాబ్దకాలంగా ఇక్కడ పురుషుల ఆధిపత్యమే నడుస్తోంది. కానీ ఈ ఏడాది మార్చి 7న ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌ ఒక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల కేలా యాకోవ్‌ తన బైక్‌ను మెరుపు వేగంతో పోనిస్తూ ఉద్ధండులైన రేసర్లను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆ క్షణం ఆమె కేవలం రేస్‌ను ముగించలేదు.. ఒక చరిత్రను తిరగరాసింది.

కన్నీళ్లు.. కష్టాలు.. ఆపై విజయం

విజయం అనేది ఆకాశం నుంచి ఊడి పడదు. అది రక్తం, చెమట, కన్నీళ్ల కలయిక అని కేలా నిరూపించింది. రేస్‌ ముగిసిన తర్వాత ఆమె భావోద్వేగానికి లోనైంది. ‘‘నిజం చెప్పాలంటే ఫినిష్‌ లైన్‌ దాటినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియదు. నా భుజాల మీద ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత కలిగిన ఆనందం వర్ణనాతీతం’’ అని చెప్పుకొచ్చింది. ఈ విజయం వెనుక ఉన్న నేపథ్యం చాలా బాధాకరమైనది. రేస్‌ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆమె టీం అనేక సాంకేతిక, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంది. మనోధైర్యం దెబ్బతినేలా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ, ‘రాహుల్‌ డుకాటీ మోటో’ టీం ఆమెపై ఉంచిన నమ్మకం, ఆమెకు అందించిన శక్తివంతమైన బైక్‌.. కేలాను యుద్ధరంగంలో వీర వనితలా నిలబెట్టాయి. అత్యంత క్లిష్టమైన మలుపుల వద్ద కూడా ఆమె ప్రశాంతత కోల్పోకుండా, బైక్‌ను అదుపు చేస్తూ అసాధారణ ప్రతిభ కనబరించింది.


త్యాగాల పునాదులపై కెరీర్‌

ఒక సాధారణ 18 ఏళ్ల అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది? స్నేహితులతో సినిమాలు, షికార్లు, పుట్టిన రోజు వేడుకలు, కుటుంబంతో సరదా సమయం.. కానీ కేలా జీవితం దీనికి పూర్తిగా భిన్నం. ఆమె విజయం వెనుక ఒక నవల రాయగలిగేంత త్యాగం ఉంది. శిక్షణ కోసం ఆమె తన ఇంటికి, కుటుంబానికి కొన్ని నెలలపాటు దూరంగా గడిపింది. తన చిన్న చెల్లెలి పుట్టిన రోజు వేడుకను కూడా ఆమె మిస్సయింది. ‘‘నేను ఎన్నో కుటుంబ వేడుకలకు వెళ్లలేకపోయాను. స్నేహితులతో గడిపే సమయాన్ని త్యాగం చేశాను. రోజులో ఎక్కువ భాగం రేసింగ్‌ ట్రాక్‌ మీద, బైక్‌ మెకానిజం అధ్యయనం చేయడంలో గడిచిపోయేది. ఇది ఒక ప్రొఫెషనల్‌ అథ్లెట్‌ పడే కష్టం. కానీ ఈ రోజు పోడియం మీద నిలబడినప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాను. నేను చేసిన ప్రతి త్యాగానికి ఈ రోజు సార్థకత లభించింది’’ అని కేలా చెబుతున్న మాటలు నేటి యువతకు గొప్ప పాఠం.

నాలుగేళ్లకే మొదలైన ప్రయాణం

కేలా జీవితంలో రేసింగ్‌ అనేది నిన్నమొన్న మొదలైంది కాదు. ఆమెకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిసారి బైక్‌ ఎక్కింది. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకునే వయసులో ఆమె ఇంజిన్‌ శబ్దాన్ని ప్రేమించింది. ‘‘బైక్‌ మీద కాలు వేసిన మరుక్షణం నాకు అర్థమైపోయింది.. నా జీవితం ఇక్కడే ఉందని. ఆ అడ్రినలిన్‌ రష్‌, రేస్‌ గ్యాస్‌ వాసన, టైర్ల రాపిడి.. ఇవే నా ప్రపంచం’’ అంటోంది కేలా. అయితే, ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు వైకల్యం లేదంటే పేదరికం కాదు. అది లింగ వివక్ష. ‘‘నువ్వు అమ్మాయివి, రేసింగ్‌ నీ వల్ల కాదు.. నువ్వు గెలవలేవు’’ అని వందలసార్లు ఆమె ముఖం మీదే చెప్పారు. కానీ కేలా ఆ విమర్శలను తన వేగానికి ఇంధనంగా మార్చుకుంది. ఎవరైతే ఆమెను తక్కువ చేసి చూశారో, వారే ఈ రోజు ఆమె పోడియం ఎక్కుతుంటే చప్పట్లు కొట్టేలా చేసింది.


ముందున్న లక్ష్యాలు

డేటోనా విజయం ఆరంభం మాత్రమేనని కేలా స్పష్టంగా చెప్పింది. ఆమె కళ్లు ఇప్పుడు ‘మోటో అమెరికా సూపర్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షి్‌ప’పై ఉన్నాయి. అక్కడ కూడా విజేతగా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించాలని ఆమె పట్టుదలతో ఉంది. ఏప్రిల్‌ 17 నుంచి 19 వరకు రోడ్‌ అట్లాంటాలో జరగబోయే తదుపరి రేస్‌ కోసం ఇప్పటికే శిక్షణ ప్రారంభించింది. వరల్డ్‌ సూపర్‌ బైక్‌ రేసులో పాల్గొని, ప్రపంచవ్యాప్తంగా తన మాతృదేశం ప్రేమను నిలబెట్టాలనేది ఆమె అంతిమ లక్ష్యం. కేలా యాకోవ్‌ ప్రయాణం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. సంకల్ప బలం ఉంటే.. గమ్యం ఎంత దూరంలో ఉన్నా, దారి ఎంత కఠినంగా ఉన్నా విజయం తలుపు తట్టి తీరుతుంది.

లింగ వివక్షపై వేగంతో దాడి

మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ అంటే అది కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన క్రీడ అనే ముద్ర ఉంది. శారీరక దృఢత్వం, వేగంపై నియంత్రణ పురుషులకు మాత్రమే సాధ్యమనే అపోహలను కేలా తన అద్భుత ప్రదర్శనతో తుడిచిపెట్టేసింది. ‘‘నేనుసాధించిన ఈ విజయం రేసింగ్‌లోకి రావాలనుకునే ఎంతోమంది అమ్మాయిల్లో నమ్మకాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను. అడ్డంకులను చూసి భయపడకండి. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి’’ అని సందేశం ఇచ్చింది.

Updated Date - Mar 25 , 2026 | 05:05 AM