నవ్వుతూ బతకాలిరా..!
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:07 AM
అందానికి కొలమానాల్లో చిరునవ్వుదే ప్రథమ స్థానం. చిరునవ్వు చూడముచ్చటగా ఉండాలంటే దవడలు, దంతాలు, చిగుళ్లు ఆకర్షణీయంగా ఉండాలి. అందుకోసం వాటిలోని లోపాలను సరిదిద్దుకునే చికిత్సలను ఆశ్రయించాలి. చిరునవ్వుకు అడ్డొచ్చే ఇలాంటి అవాంతరాలను సరిదిద్దే ‘స్మైల్ కరెక్షన్’ చికిత్సల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
అందానికి కొలమానాల్లో చిరునవ్వుదే ప్రథమ స్థానం. చిరునవ్వు చూడముచ్చటగా ఉండాలంటే దవడలు, దంతాలు, చిగుళ్లు ఆకర్షణీయంగా ఉండాలి. అందుకోసం వాటిలోని లోపాలను సరిదిద్దుకునే చికిత్సలను ఆశ్రయించాలి. చిరునవ్వుకు అడ్డొచ్చే ఇలాంటి అవాంతరాలను సరిదిద్దే ‘స్మైల్ కరెక్షన్’ చికిత్సల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
పుట్టుకతోనే దవడలు, దంతాలు, చిగుళ్లలో లోపాలుండవచ్చు. వీటి నిర్మాణంలో అవకతకలు, వ్యత్యాసాలు ఉండొచ్చు. ఫలితంగా చిరునవ్వు నవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. ఈ పరిస్థితి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ లోపాలతో సర్దుకుపోకుండా తాజాగా అందుబాటులోకొచ్చిన స్మైల్ కరెక్షన్ చికిత్సలతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా చిరునవ్వుకు అడ్డుపడే లోపాలు ఏవంటే....
దవడలు: పై దవడ లేదా కింది దవడ ముందుకు లేదా వెనక్కి జరిగి ఉండొచ్చు. దవడలు పెద్దగా లేదా చిన్నగా ఉండొచ్చు
దంతాలు: చిన్న లేదా పెద్ద దంతాలు, దంతాలు ముందుకు లేదా వెనక్కి జరిగి ఉండడం, ముదురు రంగుల్లో ఉండడం, దంతాలు ముఖాకృతికి తగిన ఆకారంలో లేకపోవడం, దంతాల మధ్య ఖాళీలు
చిగుళ్లు: ముదురు రంగులో ఉండడం, పెద్దవిగా లేదా చిన్నవిగా ఉండడం డిజిటల్ స్మైల్ డిజైన్‌తో... అత్యధిక రిజల్యూషన్ కలిగిన ఇమేజింగ్, సాఫ్ట్‌వేర్స్ సహాయంతో ఫొటో తీసి, ఏ మార్పులు చేస్తే ఆకర్షణీయమైన చిరునవ్వును సాధించవచ్చో అంచనా వేసి, తదునుగుణమైన చికిత్సా పద్ధతులను ఎంచుకోవచ్చు. ఈ చికిత్సల్లో ప్రోస్థోడాంటి్‌స్టతో పాటు అలైనర్స్ స్పెషలిస్ట్, మాక్సిలోఫేసియల్ సర్జన్ల ప్రమేయం ఉంటుంది. అందరూ కలిసి ఆకట్టుకునే చిరునవ్వుకు అవసరమైన చికిత్సలను అంచనా వేస్తారు. గతంతో పోల్చితే నేడు అందుబాటులో ఉన్న దంత చికిత్సలన్నీ తక్కువ సమయంలో సహజసిద్ధ ఫలితాన్ని రాబట్టగలిగేవే! వీటిలో పొరపాట్లకూ, అసౌకర్యాలకూ ఏమాత్రం తావుండదు. మరీ ముఖ్యంగా సెక్స్, వయసు, ముఖాకృతుల ఆధారంగా సాధ్యమైనంత సహజసిద్ధమైన, ఆకర్షణీయమైన చిరునవ్వు లక్ష్యంగా చికిత్స సాగుతుంది.
దంతాల చికిత్సలివే!
అలైనర్స్: దంతాల రంగులో కలిసిపోయే క్లియర్ అలైనర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఎదగుదిగుడు దంతాలను క్రమంలోకి తీసుకురావచ్చు.
వినీర్స్: దంతాల రంగు, పరిమాణాలను తగ్గించే చికిత్స ఇది. దంతాలను కొంత మేరకు తగ్గించి, వాటి పైన లామినేటింగ్ చేయడం వల్ల దంతాలు ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుంటాయి
టీత్ వైటెనింగ్: దంతాలను మెరుగైన రంగులోకి మార్చుకోవచ్చు
లేజర్ చికిత్స: చిగుళ్ల రంగును లేజర్ చికిత్సలో సరిదిద్ది గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. తేలికపాటి సర్జరీతో చిగుళ్ల పరిమాణాలను సరిదిద్దుకోవచ్చు
జా కరెక్షన్: సర్జరీతో దవడ ఎముకల ఆకారాన్నీ, నిర్మాణాన్నీ సరిదిద్దే చికిత్స ఇది
కృత్రిమ మేథస్సు సహాయంతో...
డిజిటల్ స్మైల్ డిజైన్‌కు కృత్రిమ మేథస్సును జోడించి అడిటివ్ త్రీడి ప్రింటింగ్, క్యాట్ క్యామ్ బిల్డింగ్ సహాయంతో, తాత్కాలిక దంతాల నమూనాలు, అంతిమ వినీర్స్, అలైనర్స్ క్రౌన్స్, క్యాప్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్రా ఓరల్ స్కాన్స్ అందుబాటులోకొచ్చిన తర్వాత నోట్లో కాస్ట్‌లను ఉంచి నమూనాలను సేకరించే ఇబ్బంది తప్పిపోయింది. కాస్ట్‌లను నోట్లో ఉంచడంతో అసౌకర్యం కలగడంతో పాటు వికారానికి లోనయ్యే ఇబ్బంది ఉంటూ ఉండేది. అంతే కాకుండా ఈ నమూనాలతో తయారుచేసిన కట్టుడు పళ్ల కచ్చితత్వంలో సమస్యలు తలెత్తుతూ ఉండేవి. కానీ ఇంట్రా ఓరల్ స్కాన్స్‌లో డిజిటల్ ఇంప్రెషన్ టెక్నిక్స్‌ను అనుసరిస్తారు కాబట్టి ఎలాంటి అసౌకర్యానికీ, పొరపాట్లకూ తావు లేకుండా కచ్చితత్వంతో కూడిన నమూనాలను ఎంతో తక్కువ సమయంలో రూపొందించుకునే వెసులుబాటు ఉంటుంది.
కోలుకునే సమయం...
చికిత్స నుంచి కోలుకునే సమయం లోపం తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. వినీర్స్ అమర్చుకునే ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రంలోగా లేదా ఒకటి నుంచి రెండు రోజుల్లో పూర్తయిపోవచ్చు. స్మైల్ కరెక్షన్ చికిత్సల్లో, దవడలను సరిదిద్దే సందర్భాల్లో మినహా మరెక్కడా సర్జరీల ప్రమేయం ఉండదు. ఈ సర్జరీలతో పాటు గమ్ లేజర్ చికిత్సలు ముగిసి, అంతిమ ఫలితాన్ని సాధించడానికి రెండు నెలల సమయం పట్టొచ్చు. దంతాల హెచ్చుతగ్గులను కూడా సరిదిద్దవలసివస్తే.. జా కరెక్షన్, టూత్ అలైన్‌మెంట్, గమ్ కరెక్షన్ మొత్తం మూడు చికిత్సలకూ కలిపి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టొచ్చు.