ఫ్రిజ్‌లో ఇలా...
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:15 AM
ఫ్రిజ్ అరల్లో ఆహార పదార్థాలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం...
ఆ పూట వండిన ఆహారాన్ని, మిగిలిన కూరలు, పప్పు తదితరాల గిన్నెలను ఫ్రిజ్ పై అరల్లో ఉంచాలి. వాటిపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. వేసవిలో అయితే గంటలోపే మిగిలిన ఆహారాన్ని చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
పచ్చి మాంసం, చికెన్, చేపలు తదితరాలను కింది అరల్లో ఉంచాలి. వీటినుంచి వచ్చే ద్రవాలు మిగిలినవాటిమీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని ఫ్రీజర్లో ఉంచడం మంచిది.
పాలు, పెరుగు, చీజ్‌లను ఎప్పుడూ చల్లగా ఉండే చోట ఉంచాలి. డోర్‌లో ఉష్ణోగ్రత తరచూ మారుతుంటుంది కాబట్టి అక్కడ వీటిని ఉంచకూడదు.
ఫ్రిజ్ డోర్‌లో సాస్‌లు, జామ్‌లు, ఊరగాయలు పెట్టుకోవచ్చు.
కూరగాయలు, పండ్లను వాటికి ప్రత్యేకించిన బాస్కెట్లో లేదా చిన్న అరల్లో ఉంచాలి. ఆకు కూరలను తేమ పీల్చుకునే కాగితాల్లో చుట్టి పెట్టాలి. అన్నింటినీ ఒకేచోట కాకుండా వేటికవే విడివిడిగా ఉండేలా నిల్వ చేయాలి.
ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా చల్లటి గాలి అంతటా వ్యాపించేలా చూసుకోవాలి. లోపలి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. అదే ఫ్రీజర్లో అయితే -18 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.
ప్రతి వారం ఫ్రిజ్‌లో మూడు లేదా నాలుగు రోజులకు మించి ఉన్న ఆహారాన్ని తొలగించి అరలను శుభ్రం చేయాలి.