Share News

అందం కోసం ఆచితూచి..!

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:09 AM

మేకప్‌ వేసుకునే తొలి రోజుల్లో ఆకట్టుకునే సౌందర్య సాధనాలన్నీ కొనేస్తూ ఉంటాం! కానీ అవసరం మేరకు ఉత్పత్తులను ఆచితూచి ఎంచుకుంటే, తక్కువ ఖర్చుతో చక్కని మేకప్‌ సొంతమవుతుంది.

అందం కోసం ఆచితూచి..!

మేకప్‌ వేసుకునే తొలి రోజుల్లో ఆకట్టుకునే సౌందర్య సాధనాలన్నీ కొనేస్తూ ఉంటాం! కానీ అవసరం మేరకు ఉత్పత్తులను ఆచితూచి ఎంచుకుంటే, తక్కువ ఖర్చుతో చక్కని మేకప్‌సొంతమవుతుంది. మార్కెట్‌లో కనిపించే ఇంపైన ఉత్పత్తులన్నీ మన మేకప్‌ కిట్‌లో ఉండవలసిన అవసరం లేదు. ఐల్యాష్‌ కర్లర్‌, భిన్నమైన మేకప్‌ స్పాంజ్‌లు, పలు రకాల బ్లష్‌లూ, లిప్‌స్టిక్‌లూ కొనవలసిన అవసరం ఉండదు. ప్రారంభంలో బేసిక్‌ మేకప్‌ కిట్‌ కొనుక్కుంటే సరిపోతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఒక్కొక్క ప్రొడక్ట్‌ జోడించుకుంటూ వెళ్లాలి. మస్కారా, లిప్‌స్టిక్‌, ఐబ్రో పెన్సిల్‌, ఫౌండేషన్‌లతో మేకప్‌ మొదలు పెట్టుకోవాలి.

శుభ్రమైన ముఖానికే మేకప్‌

మేకప్‌కు ముందు ముఖం శుభ్రం గా ఉండాలి. ముఖం ఎలా ఉన్నా, దాన్ని మేకప్‌తో దాచేయవచ్చనుకోవడం సరి కాదు. మేకప్‌కు తగ్గట్టు ముఖాన్ని సిద్ధం చేసుకోవాలంటే, ముందుగా ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. గంటల తరబడి ముఖం మీద ఉండిపోయిన మాయిశ్చరైజర్‌, సన్‌స్ర్కీన్‌ మీదే మేకప్‌ వేసుకోకూడదు. ఈ నియమం లిప్‌స్టిక్‌కు మాత్రమే మినహాయింపు. లిప్‌స్టిక్‌ లేదా గ్లాస్‌ను తేలికగా రీఅప్లై చేసుకోవచ్చు. అయితే కాస్త ఖాళీ సమయం దొరికినా న్యాప్కిన్‌ను నీళ్లలో ముంచి, పెదవుల మీది లిప్‌స్టిక్‌ పూర్తిగా తొలగించి తిరిగి అప్లై చేసుకుంటే, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాం.

బ్రష్‌లతో తంటా...

చర్మ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మేకప్‌ బ్రషెస్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లను గిన్నెలో నింపి, ఒక టీస్పూన్‌ షాంపూ కలిపి, బ్రష్‌ కుంచెలన్నీ మునిగేలా పది నిమిషాలు నానబెట్టి, వేళ్లతో సున్నితంగా రుద్ది శుభ్రం చేసి, తాజా నీళ్లలో కడగాలి. తర్వాత బ్రష్‌లను టవల్‌ మీద ఆరబెట్టి, దాచుకోవాలి. మేకప్‌ బ్రష్‌లు అదనంగా కొని పెట్టుకుంటే, అత్యవసరమైన సమయాల్లో అక్కరకొస్తాయి. పైగా ఖరీదైన బ్రష్‌లనే ఎంచుకోవాలనే నియమమేమీ లేదు. నాణ్యత విషయంలో రాజీ పడినా మేకప్‌లో అంతగా మార్పులుండవు.


కనుబొమలు ప్రధానమే!

చాలా మంది ముఖంలోని అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చి, కనుబొమలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాగని వాటిని అవసరానికి మించి దిద్దుకున్నా, ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి తీర్చిదిద్దిన కనుబొమల కోసం, మ్యాట్‌ ఐషాడోతో కనుబొమలు దిద్దుకోవాలి. కనుబొమల రంగుకు దగ్గరగా లేదా అంతకంటే లేత రంగులో ఉండే ఐబ్రో పెన్సిల్‌నే ఉపయోగించాలి.

మేకప్‌తో నిద్ర

ఇది సరి కాదు. ఎంత అలసటతో పక్క మీద వాలిపోయినా, మేకప్‌ తొలగించడం మర్చిపోకూడదు. లేదంటే చర్మ రంథ్రాలు పూడుకు పోయి, ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. తర్వాతి రోజు ముఖం తాజాగా వెలిగిపోవాలంటే ముందు రోజు వేసుకున్న మేకప్‌ పూర్తిగా తొలగించి, చర్మానికి గాలి సోకేలా చూసుకోవాలి. మేకప్‌ తొలగించడానికి క్లీన్సింగ్‌ మిల్స్‌ లేదా స్వచ్ఛమైన కొబ్బరినూనె ఉపయోగిం చవచ్చు. మేకప్‌ తొలగించి, సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, తప్పనిసరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి.

Updated Date - Oct 03 , 2026 | 01:09 AM