ఇంటి ‘సీలింగ్’ కొత్తగా...
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:48 AM
ఇంట్లో ‘ఫాల్స్ సీలింగ్’ లేకపోయినా ‘సీలింగ్’ కొత్తగా అందంగా కనిపించేందుకు ఉపకరించే చిట్కాలివే...
‘సీలింగ్’కు దగ్గరగా గోడల అంచుల వెంబడి ఎల్‌ఈడీ స్ట్రిప్స్‌ను అమర్చుకోవచ్చు. దీనివల్ల కాంతి నేరుగా కళ్లమీద పడకుండా సీలింగ్ మీదికి ప్రసరిస్తుంది. దీంతో గది రిచ్‌గా కనిపిస్తుంది. లైటింగ్ అంతగా అవసరం లేని బెడ్ రూమ్, డైనింగ్ రూమ్, బాల్కనీలకు ఈ విధానాన్ని ప్రయత్నించవచ్చు.
సన్నని లోహపు పట్టీల్లో చిన్న చిన్న లైట్లను అమర్చి రూపొందించిన ట్రాక్ లైట్లను ‘సీలింగ్’కు నలువైపులా ఏర్పాటుచేసుకోవచ్చు. ఈ స్పాట్‌లైట్లను మనకు నచ్చినట్లు అంటే ఒకదాన్ని సోఫా వైపునకు, మరోదాన్ని పుస్తకాల అర వైపునకు ఉండేలా మార్చుకోవచ్చు. వీటివల్ల గది కొత్తగా ప్రకాశిస్తుంది.
‘సీలింగ్’కు ఎప్పుడూ తెల్ల రంగునే వేయనక్కర్లేదు. గోడలకు వేసిన రంగునే ‘సీలింగ్’కు కూడా వేస్తే ఇంటికి వెరైటీ లుక్ వచ్చేస్తుంది. లైట్ బేజ్, డార్క్ గ్రీన్, లైట్ టెర్రకోట కలర్స్‌ను ఎంపిక చేసుకుంటే ఇల్లు విశాలంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
‘సీలింగ్’ ఎత్తుగా ఉన్నట్లయితే హాల్లో లైట్లతో నిండిన పెద్ద షాండ్లియర్‌ను వేలాడదీసుకోవచ్చు. గాజు, క్రిస్టల్ డిజైన్లను ఎంచుకుంటే ఇల్లంతా వెలుగులతో ప్రకాశిస్తుంది. అదే డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్‌లలో అయితే పెండెంట్ లైట్లను ఎంపికచేసుకోవడం మంచిది.
సీలింగ్ అంతటా సన్నని చెక్క పట్టీలను అమర్చుకోవచ్చు. ఈ డిజైన్ ఇంటికి వింటేజ్ లుక్‌నిస్తుంది.
అప్‌లైటర్ ఫ్లోర్ ల్యాంప్‌లను తెచ్చి గది నాలుగు మూలల్లో ఏర్పాటు చేస్తే ‘సీలింగ్’పై కాంతి ప్రసరించి చక్కని డిజైన్ ఆవిష్కృతమవుతుంది. వీటిని ఇంట్లో ఎక్కడకావాలంటే అక్కడికి సులువుగా మార్చుకోవచ్చు కూడా. తెలుపు లేదా లేత రంగుల్లో ఉన్న సీలింగ్‌కు ఈ పద్ధతి చక్కని ఎంపిక.