ఎన్నో రూపాలు... ఎన్నెన్నో కథలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:00 AM
మహా శివుడి అనంతమైన రూపాలలో లింగస్వరూపంతో పాటు మరెన్నో ఉన్నాయి. వాటిలో మరికొన్ని రూపాలు, వాటి వెనుక ఉన్న కథలు తెలుసుకుందాం......
మహా శివుడి అనంతమైన రూపాలలో లింగస్వరూపంతో పాటు మరెన్నో ఉన్నాయి. వాటిలో మరికొన్ని రూపాలు, వాటి వెనుక ఉన్న కథలు తెలుసుకుందాం.
శ్రీ కిరాతమూర్తి: అర్జునుణ్ణి శివుడు అనుగ్రహించిన రూపం ఇది. పాశుపతాస్త్రాన్ని కోరుతూ ఘోర తపస్సు చేస్తున్న అర్జునుణ్ణి శివుడు పరీక్షించాలనుకున్నాడు. ఒక రాక్షసుణ్ణి వరాహంగా మార్చి పంపాడు. అది బీభత్సం సృష్టించడంతో దాన్ని చంపడానికి అర్జునుడు బాణం వేశాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ వరాహానికి మరో బాణం కూడా తగులుకొని ఉంటుంది. బోయవాడు తానే ఆ వరాహాన్ని చంపానంటాడు. కాదు... నేనే చంపానంటాడు అర్జునుడు. వారి మధ్య గొడవ యుద్ధానికి దారి తీస్తుంది. చివరకు అర్జునుడు ఓడిపోతాడు. కిరాతరూపంలో వచ్చినది శివుడు అని గ్రహించి, శరణు వేడుతాడు. శివుడు నిజరూపంలో కనిపించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు.
శ్రీ జలంధరవధమూర్తి: జలంధరుడు శివుడి మూడో కంటి నుంచి పుట్టాడు. సముద్రుడు అతణ్ణి పెంచుకొని ఆ పేరు పెట్టాడు. ఒకసారి శివుణ్ణి దర్శించుకున్న ఇంద్రుడు... తనకు పోటీ అయిన శత్రువు లేడని విర్రవీగితే... ఇంద్రుడి గర్వాన్ని జలంధరుడు అణచివేశాడు. దేవతల దగ్గర ఉన్న మృత సంజీవని విద్యతో మరణాన్ని ఎలా జయించాలో తెలుసుకున్న జలంధరుడు... దేవతలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. చివరకు శివుడితోనే తలపడగా... చక్రంతో అతణ్ణి శివుడు సంహరించి లోకానికి శాంతి కలిగించాడు.
శ్రీ మన్మథ సంహారమూర్తి: మన్మథుడు అంటే మనసును మథించేవాడని అర్థం. దాక్షాయణీదేవి యోగాగ్నిలో ప్రవేశించాక... శివుడు విరాగియైు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. పర్వతరాజు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శివ సేవ కోసం నియమించాడు. శివపార్వతుల కల్యాణం జరగాలంటే... శివుడికి పార్వతిపై మోహం కలగాలని దేవతలు మన్మథుణ్ణి ప్రేరేపిస్తారు. అతడు ముందు భయపడినా... ‘ఇది దైవకార్యం’ అని ఇంద్రుడు చెప్పి ఒప్పిస్తాడు. శివుణ్ణి పార్వతి పూజించే సమయంలో... శివుడిపై మన్మథుడు పుష్పబాణాలు వేస్తాడు. శివుడికి పార్వతిపై అనురాగభావం ఏర్పడుతుంది. వెనువెంటనే తన మనసు పార్వతిపై లగ్నం కావడానికి కారణం తెలుసుకున్న శివుడు... మూడోకంటిని తెరిచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. ఇదే కామాంతక రూపం.
శ్రీ గజసంహారమూర్తి: పూర్వం మహిషాసురుడి కుమారుడు గజాసురుడు ప్రజలను చిత్రహింసలు పెట్టసాగాడు. లోకరక్షకుడైన పరమేశ్వరుడు గజాసురుడి మీదకు యుద్ధానికి వచ్చాడు. తనను చంపేవాడు ఆయనేనని తెలుసుకున్న గజాసురుడు... తన చర్మాన్ని ధరించాలని, తన తల త్రిలోకపూజ్యం కావాలని శివుణ్ణి కోరుకున్నాడు. అతని కోరిక మన్నించిన శివుడు గజచర్మాంబరధారి అయ్యాడు. గజాసురుడి శిరస్సును వినాయకుడికి అతికించి గజాంతకమూర్తిగా దర్శనమిచ్చాడు.
శ్రీ కాలసంహారమూర్తి: మృకండు మహర్షి దంపతులకు చాలాకాలం పిల్లలు కలుగలేదు. వారు అనేక పూజలు, వ్రతాలు చేశారు. చివరకు శివుణ్ణి శరణు వేడారు. ‘‘దుర్మార్గుడైన చిరాయుష్మంతుడు కావాలా? అఖండ భక్తి ఉన్న అల్పాయుష్కుడు కావాలా?’’ అని శివుడు అడిగాడు. వారు భక్తిపరుణ్ణే కోరుకున్నారు. కానీ తమ బిడ్డ అల్పాయుష్కుడని వారు బాధపడేవారు. వారి కుమారుడు మార్కండేయుడు కూడా శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. అతని ఆయుష్షు తీరిందని యముడు వచ్చి పాశం విసిరాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని కావలించుకున్నాడు. యమపాశం పిల్లవాడితో పాటు శివలింగానికీ చుట్టుకుంది. శివుడు లింగాన్ని చీల్చుకుంటూ శివుడు వచ్చి, కాలుణ్ణి సంహరించి... కాల సంహారమూర్తి అయ్యాడు. మార్కండేయుణ్ణి చిరంజీవిగా అనుగ్రహించాడు.
శ్రీ భిక్షాటనమూర్తి: ప్రవృత్తి మార్గంలో ప్రజలను నడపాల్సిందిగా ఋషులను పరమేశ్వరుడు ఆదేశించాడు. కానీ వారు మాత్రం నివృత్తి మార్గంలో నడిచారు. వారి మార్గాన్ని మళ్ళించడం కోసం అందమైన యువకుడి రూపంలో దారుకావనంలోకి శివుడు ప్రవేశించాడు. ‘భవతీ భిక్షాందేహి’ అన్నాడు. మునిపత్నులు ఆ రూపానికి ఆకర్షితులై ఆయన వెంట నడవసాగారు. ఈ సంగతి తెలుసు కున్న ఋషులు ఆయనపై ఎన్ని ప్రయోగాలు చేసినా ఏమీ కాలేదు. ఆయనే శివుడు అని వారు గ్రహించేలోగా మాయమయ్యాడు. తరువాత నిజం తెలుసుకున్న ఋషులు ప్రవృత్తిబాట పట్టారు. ఆ సందర్భంలో ధరించిన రూపమే శ్రీ భిక్షాటన మూర్తి.
శ్రీ నటరాజమూర్తి: శివుడు నాట్యకళకు అధిపతి. హిమవంతుడి భార్య అయిన మేనకాదేవి... తన కుమార్తె పార్వతీదేవితో నాట్యంలో సమాన ప్రతిభను చూపించాలని శివుడితో పందెం వేస్తుంది. శివుడు తన తాండవంలో అనేక నాట్యభంగిమలు ప్రదర్శించగా... పార్వతి కూడా వాటిని ఆడి చూపిస్తుంది. చివరకు ఊర్ధ్వతాండవ భంగిమతో శివుడు విజేతగా నిలిచి నటరాజమూర్తిగా అవతరించాడు.