నెట్‌జీరో సర్పంచ్
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:53 AM
ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన తమ గ్రామం కాలుష్యం, వాతావరణ మార్పుల కోరల్లో చిక్కుకుపోవడం చూసి శారదా గైధానే తల్లడిల్లిపోయారు. మహిళల మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికై... గ్రామం రూపురేఖలను పూర్తిగా మార్చారు. ఆమె సారథ్యంలో మహారాష్ట్రలోని బేలా పంచాయతీ దేశంలో ‘తొలి కర్బన ఉద్గార రహితగ్రామం’గా చరిత్రకెక్కింది. దాదాపు లక్ష చెట్లతో, సౌర విద్యుత్‌తో, సమర్థమైన వ్యర్థాల నిర్వహణతో ప్రగతికి చిరునామాగా నిలుస్తోంది.
ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన తమ గ్రామం కాలుష్యం, వాతావరణ మార్పుల కోరల్లో చిక్కుకుపోవడం చూసి శారదా గైధానే తల్లడిల్లిపోయారు. మహిళల మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికై... గ్రామం రూపురేఖలను పూర్తిగా మార్చారు. ఆమె సారథ్యంలో మహారాష్ట్రలోని బేలా పంచాయతీ దేశంలో ‘తొలి కర్బన ఉద్గార రహితగ్రామం’గా చరిత్రకెక్కింది. దాదాపు లక్ష చెట్లతో, సౌర విద్యుత్‌తో, సమర్థమైన వ్యర్థాల నిర్వహణతో ప్రగతికి చిరునామాగా నిలుస్తోంది.
నెట్ జీరో... వాతావరణంలో తీవ్ర మార్పులకు కారణమయ్యే కర్బన ఉద్గారాలను సున్నా (లేకుండా) చేయడం. దీని గురించి అంతర్జాతీయంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. నివేదికలు, ప్రణాళికలు రూపొందుతూ ఉంటాయి. ‘నెట్ జీరో దిశగా పురోగతి ఎప్పటికి సాధించగలం?’ అనే నిట్టూర్పులు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే అది ఆచరణసాధ్యమేనని నిరూపించారు మహారాష్ట్రలోని బేలా సర్పంచ్ శారదా గైధానే. తమ గ్రామాన్ని దేశంలోనే ‘తొలి నెట్ జీరో గ్రామం’గా ఆమె తీర్చిదిద్దారు. అయితే అది అంత సులువుగా జరిగిపోలేదు.
అడుగడుగునా ఆటంకాలు...
‘‘ఆ రోజులు నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామంలోని వంటిళ్ళన్నీ పొగ చూరిపోయి ఉండేవి. మహిళలు కట్టెల పొయ్యిల పొగలో ఎన్నో అవస్థలు పడేవారు. తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారు. తలనొప్పి, కళ్ళ మంటలు, ఆయాసం... ప్రతి ఒక్కరిదీ ఇదే మాట. మరోవైపు విచ్చలవిడిగా చెట్లు కొట్టెయ్యడంతో పచ్చదనం కరువైపోయింది. పంటల దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. ఇదంతా తమ జీవితాల్లో భాగంగా జనం అలవాటు పడిపోయారు. మొదట్లో ఇవన్నీ వేర్వేరు సమస్యలుగా కనిపించాయి. కానీ వీటన్నిటికీ కారణం కాలుష్యం, వాతావరణ మార్పులేనని అర్థమయింది. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలనుకున్నాను. ఎన్నికల్లో నిలబడ్డాను. సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. ఆ తరువాతే అసలు కథ మొదలయింది’’ అని గుర్తు చేసుకున్నారు శారద. పంచాయతీ మీద అప్పటివరకూ పెత్తనం చెలాయించినవారు, మార్పును ఇష్టపడని వారు ఆమెకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ‘‘అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి వారి గురించి నాకు బాగా తెలుసు. అందుకే వాళ్ళను పట్టించుకోకుండా... నేను నిర్దేశించుకున్న లక్ష్యం గురించే ఆలోచించాను’’ అంటారు శారద.
పొగలేని వంటిళ్ళు
గ్రామంలో చెట్లు నాటించడంతో తన కార్యాచరణను ఆమె ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్ళి, చెట్ల ప్రాధాన్యతను వివరించారు. ‘‘ఒక్కసారి నాటి, సంరక్షిస్తే చాలు... మనకు కొన్ని తరాలపాటు మేలు చేస్తాయి’’ అని నచ్చజెప్పారు. ప్రతి ఇంటి ముందు, గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో, బంజరు భూముల్లో మొక్కలు నాటించారు. శుభకార్యాలు, పండుగల సమయాల్లో మొక్కలు నాటడాన్ని ఒక ఆనవాయితీగా మార్చారు. అలా నాటించిన లక్షకు పైగా మొక్కలు ఇప్పుడు చెట్లయ్యాయి. కొన్నేళ్ళ క్రితం బీడుగా కనిపించిన ప్రదేశాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ‘‘ఆ తరువాత కట్టెల పొయ్యిలకు బదులు గ్యాస్ పొయ్యిల్ని వినియోగించేలా మహిళలను ఒప్పించడానికి కూడా తంటాలు పడ్డాను. కట్టెలను ఏరి తెచ్చుకోవచ్చు. దానికి ఖర్చుండదు. అదే గ్యాస్ అయితే స్టౌ కొనుక్కోవాలి, సిలిండర్ల ఖర్చు భరించాలి. పేద వర్గాలకు చెందిన మహిళలు అందుకే ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులను కలిశాను. ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీతో సిలిండర్లు, స్టౌలు వచ్చేలా చేశాను. కొంత డబ్బును పంచాయతీ ద్వారా ఖర్చు చేశాం. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఎల్‌పిజి కనెక్షన్ ఉంది. పొగ లేకపోవడంతో కాలుష్యం తగ్గింది. మహిళల ఆరోగ్యాలు కూడా మెరుగుపడ్డాయి. ఇది నా రెండో విజయం’’ అని చెప్పారు శారద. ఆమె పట్ల నమ్మకంతో మరోసారి సర్పంచ్‌గా జనం గెలిపించారు.
జాతీయ స్థాయిలో ప్రశంసలు...
రెండో విడతలో స్వచ్ఛ ఇంధనం మీద శారద దృష్టి పెట్టారు. ఇళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయం... గ్రామమంతటా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించారు. మొత్తం వీధి దీపాలన్నీ సౌర విద్యుత్‌తోనే వెలుగుతున్నాయి. మరోవైపు తడి చెత్తను, పొడి చెత్తను ఇళ్ళ దగ్గరే వేరు చేసే పద్ధతిని అమలు చేస్తున్నారు. ఆ చెత్తను బయోగ్యాస్ ప్లాంట్ కోసం వినియోగిస్తున్నారు. అలాగే గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బహిష్కరించారు. ఆమె చేపట్టిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. 2004లో ‘రాష్ట్రీయ పంచాయతీ పురస్కార్’ను ఆ గ్రామం అందుకుంది. శారద సారథ్యంలో బేలా దేశంలోనే ‘మొదటి నెట్ జీరో గ్రామం’గా ఆవిర్భవించింది.
అది అందరి బాధ్యత
‘‘వాతావరణ మార్పు ప్రభావం మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి... ఇలా ప్రతిదాని మీదా ఉంటుంది. అది మన ఆరోగ్యానికి ముప్పు తెస్తుంది. అందుకే దాని నుంచి మన గ్రామాలను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి. నిరంతరం కొనసాగేలా చూడాలి’’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ముంబయి క్లైమెట్ వీక్’లో ఆమె చేసిన ప్రసంగం ప్రశంసాపాత్రమయింది. ‘‘ఈ నేలను, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. చిన్న విషయాల్లో మనం చేసే నిర్లక్ష్యాలకు భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు మా గ్రామం దేశానికి ఆదర్శంగా మారింది. ఆ ఆదర్శాన్ని కొనసాగించడమే నా ముందున్న బాధ్యత’’ అంటున్నారు శారద.