ఈ చిన్నారులు కవితాసిరులు
ABN , Publish Date - May 07 , 2026 | 05:55 AM
గ్రామీణ బాలలు కలం పట్టారు. తమలోని భావాలను అక్షరాల్లో పలికించారు. పువ్వులను దారంతో కూర్చి దండగా మార్చినట్టు... ఆ సాహిత్యం...
అభిరుచి
గ్రామీణ బాలలు కలం పట్టారు. తమలోని భావాలను అక్షరాల్లో పలికించారు. పువ్వులను దారంతో కూర్చి దండగా మార్చినట్టు... ఆ సాహిత్యం సంకలనంగా మారి... ఒక పుస్తకంగా వెలువడింది. సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబిస్తూ... సమాజం పట్ల తమ దృక్పథాన్ని తెలియజేస్తూ... ‘సిర్పూర్ ప్రభుత్వ పాఠశాల’ విద్యార్థులు తీసుకువచ్చిన సృజన సిరి పుస్తకం ముచ్చట్లు ‘నవ్య’ పాఠకుల కోసం.
నిజామాబాద్ జిల్లా... ‘సిర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల’... ఇక్కడ తరగతుల్లో పాఠాలే కాదు... పిల్లల్లో సాహిత్యం కూడా ఉప్పొంగుతోంది. విద్యార్థుల చేతుల్లో కలం పడగానే అది కవిత్వంగా మారుతోంది. పుస్తకాలకే పరిమితమయ్యే పాఠశాల జీవితం ఇక్కడ భావాల ప్రవాహంగా మారింది. తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు సంపాదకత్వంలో వెలువడిన ‘సృజన సిరి’ పుస్తకం అందుకు సాక్ష్యంగా నిలిచింది. ఇందులోని రచనల్లో అత్యధికంగా బాలికలవే ఉండటం విశేషం. దీనికి ప్రేరణ... ప్రధానోపాధ్యాయుడు వి.సత్యనారాయణ. ఆయన విద్యార్థుల సృజనాత్మకతకు వేదిక కల్పించారు. వారి గ్రామీణ నేపఽథ్యాన్ని ప్రతిబింబిస్తూ... మన సంస్కృతి గొప్పతనాన్ని చెబుతూ... చిన్నారులు తమలోని భావాలకకు అక్షర రూపం ఇచ్చారు. పాఠశాలను బాలల సాహిత్యానికి చక్కని వేదికగా మలిచారు.
ప్రకృతి... సమాజం...
‘సృజన సిరి’ సంకలనంలోని కవితలు చదివితే పిల్లల దృష్టి ఎంత విస్తృతమో అర్థమవుతుంది. ఎం.మాధురి, ఆర్.సరిత, ఎం.ప్రవీణ్ తదితర విద్యార్థులు ప్రకృతిని జీవనాధారంగా చిత్రించారు. చెట్లు, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘ప్రకృతి లేకపోతే మనిషి లేడు’ అనే భావం వీరి కవితల్లో పదే పదే వినిపిస్తుంది. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న మార్పులను కూడా ఇక్కడి విద్యార్థులు గమనిస్తున్నారు. చిన్న వయస్సులోనే బాధ్యతాయుతమైన ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. వారి పదాల్లో అమాయకత్వం ఉన్నా... భావాల్లో గ్రామీణ జీవితం, ప్రకృతి, మనిషి సంబంధం కలిసి ఒక సమగ్ర దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. పెద్దలను సైతం ఆలోచింపజేస్తున్నాయి.
కుటుంబ బంధాలు...
విద్యార్థుల రచనల్లో కుటుంబ బంధాలు కనిపిస్తున్నాయి. తల్లి పాత్రను, ఆమె ప్రేమను పదాల్లో పెట్టిన తీరు హృదయాన్ని తాకుతుంది. అలాగే ఉగాది వంటి పండుగలను రంగుల పండుగగా వర్ణించారు. పండుగల వెనుక ఉన్న ఆనందం, సంస్కృతి, సంప్రదాయాలు ఇందులో ప్రతిబిస్తాయి. చిన్న చిన్న అనుభవాలను పెద్ద భావాలుగా మలచడం వారి ప్రత్యేకత. వారి రచనలు చదివితే గ్రామీణ జీవన సౌందర్యం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. కుటుంబం, పండుగలు, సంస్కృతి కలిసి ఒక భావోద్వేగ ప్రపంచాన్ని నిర్మించాయి. ఈ కవితలు, కథలు కేవలం అక్షరాలు మాత్రమే కాదు... చిన్నారులు అపురూప అనుభవాలు.

పేదల బడి... కానీ...
సిర్పూర్ ప్రభుత్వ పాఠశాలలో వసతులు తక్కువ. కానీ అది తమ ప్రతిభకు పదును పెట్టుకోవడానికి అవరోధం కాలేదని విద్యార్థులు నిరూపించారు. చిన్న వయస్సులోనే సమాజంపై వారికున్న అవగాహన అబ్బురపరుస్తుంది. పేదల బడే... కానీ సరైన మార్గదర్శకత్వం ఉంటే ఏ లక్ష్యం అయినా అధిగమించవచ్చని వీరిని చూస్తే అర్థమవుతుంది. అందరి కృషితో రూపుదిద్దుకున్న ‘సృజన సిరి’ పుస్తకం ఇటీవల ‘తెలంగాణ సారస్వత పరిషత్’లో ఆవిష్కృతమైంది. విద్యార్థుల కలం నుంచి జాలువారిన, వివిధ వేదికలపై బహుమతులు పొందిన రచనలు ఇందులో అక్షరబద్ధమయ్యాయి. ఈ ప్రయత్నం రేపటి తరం సాహిత్యం వైపు అడుగులు వేయడానికి ప్రేరణగా నిలుస్తుందనేది పుస్తక ప్రియుల మాట.
కసుపు వెంకటరమణ, నిజామాబాద్
మార్పునకు మూలం
ఈ సాహిత్య సృష్టి వెనుక ఉపాధ్యాయుల కృషి అపారంగా ఉంది. డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు విద్యార్థులలో సాహిత్య స్ఫూర్తిని నాటారు. హెచ్‌ఎం వి.సత్యనారాయణ ప్రోత్సాహం వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా పిల్లల ఆలోచనలకు రెక్కలు తొడిగారు. ప్రతి విద్యార్థి తన భావాన్ని రాయడానికి ప్రోత్సహించారు. తప్పులను సరిదిద్దుతూ ముందుకు నడిపించారు. సాధారణ బడిని సృజనశాలగా మార్చారు. దీని వెనుక ఉపాధ్యాయుల ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. విద్యార్థులను సాహిత్యం వైపు నడిపించాలన్న తపన ఉంది.