ఈ సర్జరీలు సురక్షితం
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:49 AM
సర్జరీ అనగానే గుండెలు గుభేలుమనే పరిస్థితులు పోయాయి. ల్యాప్రోస్కోపిక్‌ను మించిన రోబోటిక్ సర్జరీలు నేడు అందుబాటులోకొచ్చాయి. చిన్న కోతతో, కచ్చితత్వంతో సమస్యను సమర్థంగా సరిదిద్దే రోబోటిక్ సర్జరీల ప్రయోజనాల గురించి వైద్యులేమంటున్నారంటే...
సర్జరీ అనగానే గుండెలు గుభేలుమనే పరిస్థితులు పోయాయి. ల్యాప్రోస్కోపిక్‌ను మించిన రోబోటిక్ సర్జరీలు నేడు అందుబాటులోకొచ్చాయి. చిన్న కోతతో, కచ్చితత్వంతో సమస్యను సమర్థంగా సరిదిద్దే రోబోటిక్ సర్జరీల ప్రయోజనాల గురించి వైద్యులేమంటున్నారంటే...
ల్యాప్రోస్కోపీతో చేయదగిన సర్జరీలన్నీ రోబోటిక్‌తో చేయొచ్చు. రోబోటిక్ సర్జరీ ల్యాప్రోస్కోపీనే పోలి ఉన్నప్పటికీ ఈ సర్జరీతో అటు వైద్యులకూ, ఇటు రోగులకూ అనేక ప్రయోజనాలుంటాయి. ఈ సర్జరీలో సమస్య తలెత్తిన భాగాన్ని మరింత స్పష్టంగా, దగ్గరగా చూడగలిగే వీలుండడంతో పాటు, కచ్చితత్వానికి కూడా ఆస్కారం ఉంటుంది. సాధారణంగా రోబోటిక్ అనగానే వైద్యులకు బదులుగా రోబోట్స్ సర్జరీ చేస్తాయేమోననే అపోహలుంటాయి. కానీ నిజానికి రోబోటిక్ సర్జరీలో రోబోట్ వైద్యులకు మార్గనిర్దేశం చేస్తుంది. చేతి కదలికలను స్థిరం చేస్తుంది. కాబట్టి పొరపాట్లకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. అదనంగా చిన్న కోత, తక్కువ రక్తస్రావం మొదలైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఫలితంగా రోగులు సర్జరీ తదనంతరం త్వరితంగా కోలుకోగలుగుతారు.
అదనపు ప్రయోజనాలున్నాయి
ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసే సమయంలో వైద్యులు, కీహోల్స్ ఏర్పాటు చేసుకుని, అంతర్గత శరీర భాగాన్ని మానిటర్‌లో పరీక్షిస్తూ, పరికరాల సహాయంతో సర్జరీని ముగిస్తారు. రోబోటిక్ సర్జరీలో కీహోల్స్ ద్వారా పరికరాలను కదిలించే సమయంలో వైద్యుల చేతులను రోబోట్స్ నియంత్రిస్తాయి. ఈ సమయంలో వైద్యులు త్రీడి గ్లాసెస్ ధరిస్తారు కాబట్టి శరీరం లోపల సర్జరీ చేయవలసిన ప్రదేశం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రోబోట్ 360 డిగ్రీల మేరకు తిరగగలుగుతుంది. అంతేకాకుండా వైద్యుల చేతులు కొంత మేరకు కంపిస్తున్నప్పటికీ ఆ ఒడిదొడుకులను కూడా రోబోట్ అడ్డస్ట్ చేసుకుంటుంది. కాబట్టి వైద్యులు కచ్చితత్వంతో సర్జరీ చేయగలుగుతారు. తప్పిదాలకు ఏమాత్రం ఆస్కారం ఉండదు.
పలు ప్రదేశాల్లో...
పలు రకాల క్లిష్టమైన సమస్యల పరిష్కారం కోసం రోబోటిక్ సర్జరీని ఎంచుకోవచ్చు. అవేంటంటే...
మెడ: థైరాయిడ్‌తో పాటు ఇతరత్రా కణుతులు
ఛాతీ: రొమ్ములో గడ్డలు గుండె, ఊపిరితిత్తులు: అవరోధాలు, గడ్డలు
పొట్ట: జీర్ణవ్యవస్థ, గర్భాశయ వ్యవస్థ, మూత్రపిండాల క్యాన్సర్
గర్భాశయం: గర్భాశయాన్ని తొలగించడం, ఫైబ్రాయిడ్లు, ట్యుబెక్టమీ, ఎండోమెట్రియోసిస్
హెర్నియాల కోసం...
సైకిల్ ట్యూబ్ పంక్చర్ అయినప్పుడు లోపలున్న గాలి ఎలా బయటకొస్తుందో, పొట్ట కండరాలు బలహీనపడినప్పుడు లోపలి పేగులు కూడా బయటకు తన్నుకొస్తాయి. ఇదే హెర్నియా. పొట్టలోని గోడలు బలహీనంగా ఉండడం వల్ల, వయసు మళ్లడం వల్ల, స్థూలకాయంతో కండరాలు బిగుతును కోల్పోవడం వల్ల, కొల్లాజన్ సమస్యల వల్ల... ఇలా పలు రకాల కారణాల వల్ల హెర్నియా తలెత్తుతూ ఉంటుంది. సాధారణంగా కొందరు మహిళల్లో సిజేరియన్ తదనంతరం ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ట్యూబ్‌కు పంక్చర్ పడితే ప్యాచ్ వేసినట్టే, హెర్నియా తలెత్తినప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా శరీరంలో కలిసిపోయే మెష్‌ను అమర్చుతారు. అయితే కొందర్లో హెర్నియా సర్జరీలు విఫలమై, సమస్య తిరగబెడుతూ ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం నేడు వైద్యులు వినూత్న పద్ధతిని ఎంచుకుంటున్నారు. అబ్డామినల్ వాల్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీలో భాగంగా మెష్‌ను పొట్టలో పెట్టకుండా, గోడ పొరల మధ్య అమర్చగలుగుతున్నారు. దీని వల్ల మెష్ పేగులకు అంటుకుపోకుండా ఉంటుంది.
సాధారణంగా రోబోటిక్ సర్జరీల పట్ల ప్రజల్లో పలు అపోహలుంటాయి. కానీ నిజానికి పొరపాట్లకు ఆస్కారం లేని సమర్థవంతమైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని నిస్సందేహంగా ఎంచుకోవచ్చు. వైద్యులు, అనుమాన నివృత్తి కోసం, అవగాహన కోసం సర్జరీ సమయంలో రోగులకు మానిటర్‌లో సర్జరీ విధానాన్ని చూపించి వివరిస్తారు. అయితే ఈ సర్జరీని ఎంచుకునే ముందు, ఈ సర్జరీలో అనుభవజ్ఞులైన సర్జన్లను ఎంచుకోవాలి.
రోబోటిక్ సర్జరీ ప్రయోజనాలు
నొప్పి తక్కువ
తక్కువ రక్తస్రావం
త్వరితంగా కోలుకోగలుగుతారు
హెర్నియా తలెత్తే అవకాశాలు తక్కువ
చిన్న కోత
కచ్చితత్వం