ఆటిజం ఆమడదూరం
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:07 AM
ఐదేళ్లు నిండుతున్నా మనవడికి మాటలు రాకపోతే, ‘వాళ్ల నాన్న పోలిక’ అని మురిసిపోయే నానమ్మలుంటారు.పిల్లాడు అదే పనిగా అల్లరి చేస్తుంటే, ‘అల్లరి కుంక’ అని గారం చేసే తల్లులుంటారు. కానీ ఇలాంటి తప్పుడు భ్రమలే పిల్లల పాలిట శాపాలవుతున్నాయా? పిల్లల్లో క్రమేపీ పెరుగుతున్న ‘ఆటిజం’ రుగ్మతకు మూల కారణాలేంటి? వైద్యులేమంటున్నారు?
ఐదేళ్లు నిండుతున్నా మనవడికి మాటలు రాకపోతే, ‘వాళ్ల నాన్న పోలిక’ అని మురిసిపోయే నానమ్మలుంటారు.పిల్లాడు అదే పనిగా అల్లరి చేస్తుంటే, ‘అల్లరి కుంక’ అని గారం చేసే తల్లులుంటారు. కానీ ఇలాంటి తప్పుడు భ్రమలే పిల్లల పాలిట శాపాలవుతున్నాయా? పిల్లల్లో క్రమేపీ పెరుగుతున్న ‘ఆటిజం’ రుగ్మతకు మూల కారణాలేంటి? వైద్యులేమంటున్నారు?
గతంతో పోల్చుకుంటే నేడు ఆటిజం పిల్లల సంఖ్య పెరుగుతోంది. పుట్టుకతో వెంట తెచ్చుకునే నాడీ సమస్యలు, జన్యు సమస్యలు ఆటిజం ప్రధాన కారణాల్లో కొన్ని మాత్రమే! వీటికి మించి పసి వయసులోనే పిల్లలకు స్ర్కీన్స్ అలవాటు చేయడం ఆటిజంకు కీలక కారణంగా మారుతోంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్‌తో పాటు, ఎడిహెచ్‌డి (అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్), మాటలు, భాష ఆలస్యమవడం, లెర్నింగ్ డిజబిలిటీస్.. ఇవన్నీ స్ర్కీన్స్‌తో ముడిపడి ఉంటున్నాయి. పుట్టినప్పుడు పిల్లల మెదడు పరిణతి లేని స్థితిలో ఉంటుంది. క్రమేపీ ఐదేళ్లలోపు పూర్తిగా ఎదుగుతుంది. ఆలోగా స్ర్కీన్స్‌ను అలవాటు చేయడం వల్ల, తెర మీద వేగంగా కదిలే బొమ్మలను మెదడు అంతే వేగంగా రిజిస్టర్ చేసుకోలేదు. మునుపటితో పోల్చుకుంటే, నేడు సామాజిక మాధ్యమాలు అందుబాటులోకొచ్చిన తర్వాత, పూర్తిగా ఎదిగిన మన మెదళ్లకే శ్రద్ధా వ్యవధి తగ్గిపోయింది. అలాంటప్పుడు సున్నితమైన స్థితిలో ఉండే పసికందుల మెదళ్లు సెల్‌ఫోన్లు, ట్యాబ్, టివి, ల్యాప్‌టాప్ తెరల మీద కనిపించే అంత వేగమైన కార్యకలాపాలను రిజిస్టర్ చేసుకోలేక, అతిగా స్టిమ్యులేజ్ అయిపోతూ ఉంటాయి. ఫలితంగా మెదడు ఎదుగుదల కూడా క్రమరహితంగా సాగుతుంది.
పిల్లల నేస్తాలవుతున్న గ్యాడ్జెట్లు
మునుపటితో పోల్చుకుంటే నేడు ఉమ్మడి కుటుంబాలు కరవవుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులవడం వల్ల పనుల ఒత్తిడిలో పిల్లలకు సరిపడా సమయాన్ని కేటాయించలేక, ఆయాలకు అప్పగించడం, లేదా సెల్‌ఫోన్ చేతికి ఇచ్చేయడం వల్ల పిల్లల మెదడు ఎదుగుదల మందగిస్తోంది. టివి లేదా ట్యాబ్‌లో పిల్లల వీడియో పాఠాలే ఆన్ చేసినా, ఈ గ్యాడ్జెట్లు పిల్లలు స్పందించేవరకూ ఆగకుండా అదే పనిగా వాటి పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయి. పిల్లలతో కళ్లు కలపడం, ముఖకవళికలకు తగ్గట్టు స్పందించడం, నవ్వడం, మాట్లాడించడం లాంటివి తల్లితండ్రులే చేయగలుగుతారు తప్ప గ్యాడ్జెట్లు చేయలేవనే విషయం గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డతో సంభాషించేటప్పుడు బిడ్డ మనలో ప్రతిఫలించే ప్రతి అంశాన్నీ రిజిస్టర్ చేసుకుంటుంది. మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఇలాగే ఏర్పడతాయి. కాబట్టి రెండేళ్లలోపే బిడ్డతో సంభాషిస్తూ, ఆటలాడిస్తూ వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. బంధువుల ఇళ్లలో వదలడం, పిల్లలతో కలిపి ఆటలాడించడం, పార్క్‌కు తీసుకెళ్లడం, బొమ్మలతో ఆడించడం లాంటివి చేయాలి. వినడం, తాకడం, అనుభవపూర్వకంగా గ్రహించడం ద్వారానే పిల్లలు జ్ఞానాన్ని పెంచుకుంటారనే విషయాన్ని తల్లితండ్రులందరూ గుర్తు పెట్టుకోవాలి.

ఈ లక్షణాల మీద కన్నేసి...
ఆటిజం తాలూకు లక్షణాలను ఎంత త్వరగా కనిపెట్టగలిగితే, ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలున్నట్టు గమనించిన వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. చాలా కుటుంబాల్లో కొన్ని మూఢ నమ్మకాలుంటాయి. మగపిల్లలకు మాటలు ఆలస్యంగా వస్తాయనీ, లేదా తండ్రిలాగే పిల్లాడికి కూడా మాటలు ఆలస్యమయ్యాయనీ, ముభావంగా ఉండడం పిల్లాడి స్వభావమనీ పొరబడుతూ ఉంటారు. ఆరోగ్యంగా పుట్టిన ప్రతి పిల్ల/పిల్లాడూ వయసుకు తగినట్టు మాటలు మాట్లాడడం మొదలుపెట్టాలి. పిల్లలు ఇంట్లో ఉంటే, ఎంతో కొంత అల్లరి ఉండాలి, తల్లితండ్రులను ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. వేలితో వస్తువులను చూపించడం, మారాం చేయడం, ఏడ్వడం.. ఇవన్నీ ఉండి తీరాలి. పిల్లాడు ఎవరినీ పట్టించుకోకుండా మౌనంగా ఉంటే, బిడ్డలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొన్ని లక్షణాలను కూడా గమనించాలి...
పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం
కళ్లు కలపకపోవడం
తల్లిని గుర్తుపట్టరు
చిరునవ్వు నవ్వరు
స్పందించరు
చిన్న పనులు చెప్పినా చేయలేరు
అర్థవంతమైన మాటలు మాట్లాడలేరు
చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తారు
బొమ్మలతో ఆడుకోలేరు
అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు
మీ బిడ్డకు ఎడిహెచ్‌డి ఉందా?
విపరీతంగా అల్లరి చేసే, దుందుడుగా ఉండే ప్రతి పిల్ల/పిల్లవాడినీ ఎడిహెచ్‌డి గాటన కట్టలేం! ఈ అల్లరితో పాటు పిల్లల నేర్పరితనం లోపించడం, స్పందించే తీరు, పార్కులో, బడిలో తన వంతు వచ్చే వరకూ ఆగలేకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, కొట్టడం, అరవడం లాంటి లక్షణాలను కూడా గమనించాలి. ఇవన్నీ కలగలసి ఉంటే, ఎడిహెచ్‌డిగా అనుమానించవచ్చు. చాలా కుటుంబాల్లో ఐదేళ్ల లోపు ఈ సమస్యను కనిపెట్టలేక, స్కూల్ నుంచి ఫిర్యాదులు అందుకుని ఏడేళ్ల వయసులో వైద్యుల దగ్గరకు పరిగెత్తుతూ ఉంటారు. ఇంత ఆలస్యంగా వైద్యులను ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లల్లో ఎడిహెచ్‌డితో పాటు ఆటిజం కూడా ఉండొచ్చు. ఆటిజం పెరిగి ఎడిహెచ్‌డి కూడా మొదలుకావచ్చు. ఎడిహెచ్‌డి పిల్లల్లో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే...
ఏ పని మీదా శ్రద్ధ ఉండదు. ఒక పని చేస్తూనే, మధ్యలో వదిలేసి రెండో పనికి పూనుకుంటారు
క్లాస్‌లో కుదురుగా కూర్చోకుండా తిరుగుతూ ఉంటారు, పక్క పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు
టీచర్ అడిగిన ప్రశ్నకు తోటి పిల్లల్ని సమాధానం చెప్పనివ్వకుండా తానే చెప్పాలని తొందరపడుతూ ఉంటారు
గెంతడం, పరిగెత్తడం, కొట్టడం, అరవడం
దూకుడుగా ఉండడం
మాటలు, భాష ఆలస్యమైతే?
వినికిడి లోపం, నాడీసమస్యలు, బ్రెయిన్ ఫీవర్, పుట్టుకతో చెవిలో లోపం కలిగిన పిల్లల్లో కూడా మాటలు ఆలస్యమవుతాయి. అలాగే మాటలు ఆలస్యమవడం ఆటిజంలో కూడా ఒక భాగమే! అలాగని మాటలు ఆలస్యమైన ప్రతి బిడ్డకూ ఆటిజం ఉందని అనుకోడానికి వీల్లేదు. కాబట్టి ఆటిజం వల్లే ఈ సమస్య ఉందని నిర్థారించుకోవడం కోసం పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ లేదా న్యూరోడెవల్‌పమెంట్ ఫిజీషియన్ చేత పరీక్షలు చేయించాలి. ఆటిజం ఉందని నిర్థారిస్తే, థెరపీలను ఆశ్రయించాలి. కొందరు వైద్యులను కలవకుండానే మాటలు రాలేదు కాబట్టి ఆటిజం ఉందనుకుని, చెవి సమస్యలున్న పిల్లల కోసం థెరపీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఫలితంగా పిల్లల విలువైన కాలం వృథా అవుతుంది.
ఈ లక్షణాలు కీలకం
ఆరు నెలల్లోపు పిల్లలు కళ్లలో కళ్లు కలిపి చూస్తారు, తల్లిని చూసి చిరునవ్వుతో స్పందిస్తూ ఉంటారు
9 నుంచి 10 నెలల పిల్లలు పేరు పెట్టి పిలిస్తే స్పందిస్తారు
ఏడాది వయసుకు టాటా, బై చెప్పగలుగుతారు, ఫ్యాన్ ఎక్కడుంది? అని అడిగినప్పుడు వేలితో చూపించగలుగుతారు
ఏడాది నుంచి ఏడాదిన్నర మధ్యలో అమ్మ, నాన్న, తాత, అక్క, రా... మొదలైన చిన్న చిన్న మాటలు మాట్లాడగలుగుతారు
గ్లాసు తీసుకురా అని చెప్పిన వెంటనే, తీసుకొచ్చి అందించే... సింగిల్ స్టెప్ కమాండ్స్
అనుసరించగలుగుతారు, తోటి పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటారు
థెరపీలు ఉన్నాయి
నాడీసంబంధ సమస్యలు, వినికిడి లోపాలు లేవనీ, పూర్తిగా ఆటిజం ఉందనీ నిర్థారించుకున్న తర్వాత, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీలు క్రమం తప్పకుండా వారానికి కనీసం ఐదు రోజులు, రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు ఇప్పించాలి. అలాగే ప్రతి మూడు, ఆరు నెలలకూ పిల్లల్లో పురోగతిని అంచనా వేస్తూ థెరపీని కొనసాగించాల్సి ఉంటుంది. ఎడిహెచ్‌డికి కూడా ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీలను ఇప్పించవలసి ఉంటుంది. ఈ పిల్లల్లో ఐక్యు కూడా తక్కువగా ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఐక్యుని కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ థెరపీల వల్ల స్పందించడం, కళ్లలో కళ్లు కలపడం, మాట్లాడడం, చెప్పిన మాట వినడం, అతి చురుకుదనం తగ్గడం, అదే పనిగా గెంతడం, పరిగెత్తడం లాంటి లక్షణాలు అదుపులోకొస్తాయి. సొంతగా దుస్తులు వేసుకోవడం, తీసుకోవడం, తనంతట తాను తినడం, కాలకృత్యాల మీద నియంత్రణ మొదలైనవన్నీ గాడిలో పడతాయి. మూడేళ్ల లోపు సమస్యను గుర్తించి, వైద్యుల సూచన మేరకు థెరపీలను ఆశ్రయించినప్పుడు అద్భుతమైన ఫలితాలను రాబట్టవచ్చు. ఐదేళ్లలోపు గ్రహిస్తే, కొంతమేరకు ఫలితం ఉంటుంది. ఏడేళ్ల వయసులో సమస్యను కనిపెట్టినా కూడా థెరపీ అందించవచ్చు. ఏడేళ్లు దాటిన పిల్లలను థెరపీతో సరిదిద్దడం చాలా కష్టం.
నివారణ ఇలా...
పిల్లల పొడవు, బరువు మీదే ప్రధానంగా దృష్టి పెట్టకుండా, వయసుకు తగినట్టు మాటలొస్తున్నాయా, లేదా అన్నది గమనించుకోవాలి. పిల్లల వైద్యులకు చూపిస్తూ, ఎదుగుదల పరీక్షలు చేయిస్తూ ఉండాలి
ఇతర పిల్లలతో సరిపోల్చి చూస్తూ ఉండాలి
పిల్లల్లో లోపం ఉందని అనుమానం వస్తే, ఆలస్యం చేయకుండా ప్రత్యేక నిపుణులను కలవాలి
రెండేళ్లలోపు పిల్లలకు స్ర్కీన్స్ అలవాటు చేయకూడదు
రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు గంట లోపు స్ర్కీన్ చూడనివ్వొచ్చు. కానీ ఆ వీడియో ఏదైనా, దాన్నుంచి కొత్త విషయం నేర్చుకునేలా ఉండాలి. ఆ సమయంలో తల్లి బిడ్డతో కలిసి కూర్చోవాలి
ఐదేళ్ల తర్వాత రెండు గంటల పాటు స్ర్కీన్ చూడనివ్వొచ్చు. కానీ దాంతో జ్ఞానం పెంపొందేలా ఉండాలి. స్ర్కీన్స్‌కు పెద్దల నిబంధనలు, పరిమితులు కూడా ఉండి తీరాలి
తోటి పిల్లలతో ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి, పిల్లలతో కలిసి ఆటలాడాలి, కొన్ని గంటల పాటు బంధువుల ఇళ్లకు పంపించి స్వతంత్రంగా మసలడం నేర్పించాలి
స్వతంత్రంగా తినడం నేర్పించాలి