Share News

పుచ్చకాయతో నోరూరేలా..!

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:06 AM

తియ్యటి పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరు. వేసవి తాపాన్ని తీర్చి దాహార్తిని తగ్గించే పుచ్చకాయ ఆరోగ్యప్రదాయిని కూడా. దీన్ని జ్యూస్‌లు, సలాడ్‌ల రూపంలో మాత్రమే కాదు ఎన్నో రకాలుగా ఆస్వాదించవచ్చు. అందరూ అమితంగా ఇష్టపడే పుచ్చకాయతో తయారుచేసే వెరైటీ రుచులు మీ కోసం...

పుచ్చకాయతో నోరూరేలా..!

తియ్యటి పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరు. వేసవి తాపాన్ని తీర్చి దాహార్తిని తగ్గించే పుచ్చకాయ ఆరోగ్యప్రదాయిని కూడా. దీన్ని జ్యూస్‌లు, సలాడ్‌ల రూపంలో మాత్రమే కాదు ఎన్నో రకాలుగా ఆస్వాదించవచ్చు. అందరూ అమితంగా ఇష్టపడే పుచ్చకాయతో తయారుచేసే వెరైటీ రుచులు మీ కోసం...

3.jpg

సార్బెట్‌

కావాల్సిన పదార్థాలు

పుచ్చకాయ ముక్కలు- నాలుగు కప్పులు, నిమ్మరసం- రెండు చెంచాలు, తేనె- రెండు చెంచాలు, పుదీనా ఆకులు- అయిదు

తయారీ విధానం

పుచ్చకాయ ముక్కలను మూడు గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. తరువాత వాటిని బ్లెండర్‌లో వేయాలి. నిమ్మరసం, తేనె, పుదీనా ఆకులు కూడా వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు బాక్సులోకి తీసి సమంగా పరచాలి. దీని మీద మూతపెట్టి రెండు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. తరువాత స్కూప్‌ సహాయంతో గాజు బౌల్స్‌లోకి తీసి సర్వ్‌ చేయడమే!


4.jpg

కేక్‌

కావాల్సిన పదార్థాలు

పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు, నూనె- మూడు చెంచాలు, వెనీలా ఎసెన్స్‌- రెండు చుక్కలు, మైదా- ఒకటిన్నర కప్పులు, బేకింగ్‌ పౌడర్‌- చెంచా, బేకింగ్‌ సోడా- పావు చెంచా, చక్కెర- ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు- అర కప్పు, రెడ్‌ ఫుడ్‌ కలర్‌- రెండు చుక్కలు, ఉప్పు- చిటికెడు

తయారీ విధానం

బ్లెండర్‌లో పుచ్చకాయ ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్‌ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు, చక్కెర, పుచ్చకాయ మిశ్రమం, ఫుడ్‌ కలర్‌ వేసి బాగా కలపాలి. ఆపైన కొద్దికొద్దిగా పాలు పోస్తూ కలపాలి. బేకింగ్‌ బౌల్‌ను తీసుకుని లోపల కొద్దిగా నూనె రాసి బేకింగ్‌ పేపర్‌ను అమర్చాలి. అందులో పుచ్చకాయ-మైదా మిశ్రమం పోసి 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్‌ చేసిన ఓవెన్‌లో ఉంచాలి. అరగంట తరువాత గిన్నెను బయటికి తీసి ఒక పళ్లెంలో బోర్లించాలి. తరువాత గిన్నె, బేకింగ్‌ పేపర్‌లను తీసివేయాలి. కేక్‌ చల్లారిన తరువాత ముక్కలుగా కోసి వేడి వేడి కాఫీ లేదా టీతో సర్వ్‌ చేయాలి.


5.jpg

సల్సా

కావాల్సిన పదార్థాలు

పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు, కీర ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, ఎర్రటి క్యాప్సీకమ్‌ ముక్కలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పుదీనా తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, చక్కెర- పావు చెంచా, నమ్‌కిన్స్‌ లేదా చిప్స్‌- ఒక కప్పు

తయారీ విధానం

వెడల్పాటి గిన్నెలో పుచ్చకాయ, కీరా, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ ముక్కలతోపాటు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఉప్పు, చక్కెర, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం చిలకరించాలి. ఒక పళ్లెంలో ఈ మిశ్రమంతోపాటు నమ్‌కిన్స్‌ లేదా చిప్స్‌ ఉంచి సర్వ్‌ చేయాలి.


6.jpg

పుడ్డింగ్‌

కావాల్సిన పదార్థాలు

పుచ్చకాయ ముక్కలు- అయిదు కప్పులు, పంచదార పొడి- అర కప్పు, కార్న్‌ఫ్లోర్‌- అర కప్పు, మంచినీళ్లు- అర కప్పు, కొబ్బరి పొడి- పావు కప్పు

తయారీ విధానం

చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి నీళ్లు పోసి ఉండలు రాకుండా జారుగా కలపాలి. బ్లెండర్‌లో పుచ్చకాయ ముక్కలు, పంచదార పొడి వేసి జ్యూస్‌లా బ్లెండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం పోసి బాగా కలపాలి. ఈ గిన్నెను స్టవ్‌ మీద పెట్టి మిశ్రమాన్ని కలుపుతూ అయిదు నిమిషాలపాటు ఉడికించాలి. మిశ్రమం దగ్గరకు వచ్చిన తరువాత దాన్ని చెంచాతో చిన్న గ్లాసుల్లో వేసి చల్లారనివ్వాలి. గంట తరువాత గ్లాసులను పళ్లెంలో బోర్లించి పైన మెల్లగా చేత్తో తట్టాలి. తరువాత గ్లాసులను తీసివేయాలి. ఇలా తయారైన పుడ్డింగ్‌ను చక్రాల్లా కోసి కొబ్బరిపొడిలో దొర్లించి సర్వ్‌ చేయాలి.

Updated Date - Mar 14 , 2026 | 05:06 AM