వైకల్యంపై గెలిచిన అక్షర యోధురాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:04 AM
శరీరానికి వైకల్యం ఉండొచ్చు కానీ సంకల్పానికి కాదని నిరూపించింది 22 ఏళ్ల ప్రాప్తిగౌడ. మాతృభాషపై మమకారం, అమ్మమ్మల నాటి అనుబంధాలను అక్షరబద్ధం చేస్తూ ‘అరెభాషె’ భాషలో ఆమె సృష్టించిన సాహిత్యం ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది.
శరీరానికి వైకల్యం ఉండొచ్చు కానీ సంకల్పానికి కాదని నిరూపించింది 22 ఏళ్ల ప్రాప్తిగౌడ. మాతృభాషపై మమకారం, అమ్మమ్మల నాటి అనుబంధాలను అక్షరబద్ధం చేస్తూ ‘అరెభాషె’ భాషలో ఆమె సృష్టించిన సాహిత్యం ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది.
ఆమె అడుగులు తడబడవచ్చు.. కానీ ఆమె కలలు ఆకాశమంత ఎత్తున విహరిస్తున్నాయి. ఆమె నడక కష్టతరం కావొచ్చు.. కానీ ఆమె కలం పరుగు ఆగే ప్రసక్తే లేదని నిరూపించింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్లియా తాలూకాలోని అరంతోడు అనే ఒక మారుమూల గ్రామం నుంచి మొదలైన ఒక యువతి ప్రయాణం నేడు కర్ణాటక సాహిత్య యవనికపై ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఆమె పేరు ప్రాప్తిగౌడ. 22 ఏళ్ల ప్రాయంలోనే శారీరక సవాళ్లను ధిక్కరించి ‘అరెభాషె’ అనే మాతృభాషలో తన తొలి పుస్తకాన్ని ఆవిష్కరించి వార్తల్లో నిలిచింది.
కుగ్రామం నుంచి అక్షర లోకం వరకు...
సుళ్లియా ప్రాంతంలోని పచ్చని ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రాప్తికి చిన్నతనం నుంచే సవాళ్లు ఎదురయ్యాయి. రైతు బిడ్డగా పుట్టిన ఆమెది రవాణా సౌకర్యాలు సరిగా లేని గ్రామీణ ప్రాంతం. బాల్యం నుంచే నడవడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది. తోటి పిల్లలు పరిగెడుతుంటే, తను మాత్రం అడుగు తీసి అడుగు వెయ్యడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చేది. అయితే, ఆ శారీరక ఇబ్బంది ఆమె మేధస్సుకు ఎప్పుడూ అడ్డుకాలేదు. బయట ప్రపంచంలో తిరగకపోయినా, పుస్తకాల ప్రపంచంలో విహరించడం ఆమెకు అలవాటైంది. కన్నడ సాహిత్యాన్ని అవపోసన పడుతూ, చిన్నప్పటి నుంచే కవితలు, వ్యాసాలు రాయడం ప్రారంభించింది. ఆ అక్షరాలే ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాయి.
అమ్మమ్మ ముచ్చట్లు
ప్రస్తుత తరం పిల్లలకు అమ్మమ్మల చేతుల్లోని గోరుముద్దలు కరువయ్యాయి. రాత్రిపూట చందమామను చూపిస్తూ అమ్మమ్మ చెప్పే కథల కమ్మదనం నేటి తరానికి తెలియకుండా పోతోంది. ఇదే అంశం ప్రాప్తిని ఆలోచింపజేసింది. తన తొలి పుస్తకం ‘విమలవ్వన మూరు పిల్లిక’ (విమలమ్మ ముగ్గురు మనవలు) ద్వారా ఆ పాత రోజులను మళ్లీ కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేసింది.
మానవీయ బంధాల ప్రతిబింబం
98 పేజల ఈ కథా సంకలనం అక్షరాల కూర్పు మాత్రమే కాదు, కనుమరుగువుతున్న మానవీయ సంబంధాల ప్రతిబింబం. ఒక అమ్మమ్మకు, ఆమె మనవరాలికి మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని గ్రామీణ నేపథ్యంలో ఆమె ఎంతో అద్భుతంగా ఆవిష్కరించింది. ‘‘ఈ డిజిటల్ యుగంలో మనం ఎన్నో విలువైన జ్ఞాపకాలను కోల్పోతున్నాం. ముఖ్యంగా అమ్మమ్మలతో గడిపిన ఆ మధుర క్షణాలను పాఠకులు మళ్లీ గుర్తు చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష’’ అని ప్రాప్తి చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో ఒకింత తృప్తి కనిపించింది.
లక్ష్యం దిశగా ప్రయాణం
ప్రస్తుతం పుత్తూరులోని వివేకానంద కళాశాలలో బీఈడీ చదువుతున్న ప్రాప్తి రచయిత్రిగానే ఆగిపోవాలని అనుకోవడం లేదు. రైతు అయిన తండ్రి చిన్నప్ప, తల్లి లక్ష్మి ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేది ఆమె పట్టుదల. మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత పీహెచ్‌డీ చేయాలనేది ఆమె కల. ‘‘వైకల్యం అనేది శరీరానికి మాత్రమే ఉండాలి, మనం సాధించాలనుకునే లక్ష్యానికి అది ఎప్పుడూ అడ్డుగోడ కాకూడదు’’ అని చెబుతోంది ప్రాప్తి. పరిమిత రవాణా సౌకర్యాలున్న మారుమూల పల్లె నుంచి వచ్చి, శారీరక లోపాన్ని పక్కనపెట్టి, సాహితీ లోకంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రాప్తిగౌడ కథ నేటి యువతకు ఒక గొప్ప ప్రేరణ.ఙ
భాషకు పట్టాభిషేకం
కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే ‘అరెభాషె’ ఒక విశిష్టమైన మాండలికం. ఇంట్లో ప్రతిరోజూ మాట్లాడే ఈ భాషపై ప్రాప్తికి మమకారం ఎక్కువ. తన తొలి గ్రంథం మాతృభాషలోనే ఉండాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ‘కర్ణాటక అరెభాషె సంస్కృతి, సాహిత్య అకాడమీ’ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించడం ఆమెకు దక్కిన అతిపెద్ద గుర్తింపు. ఇటీవల జరిగిన పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖుల సమక్షంలో ఈ పుస్తకం ఆవిష్కృతమైంది. అకాడమీ ఇప్పటివరకు 77 పుస్తకాలను ప్రచురించగా, అతి చిన్న వయసులోనే ప్రాప్తి ఈ ఘనత సాధించడం విశేషం.