Share News

పట్టాలపై పవర్‌ గాళ్స్‌

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:48 AM

మాది సిరిసిల్ల. డీఎడ్‌, బీఎస్సీ పూర్తిచేశాను. నిజామాబాద్‌ జిల్లా దగ్గర మోర్తాడ్‌ స్టేషన్లో అసిస్టెంట్‌ పాయింట్స్‌మన్‌ (గ్రూప్‌ డి స్టాఫ్‌)గా పనిచేస్తున్నా. ఈ పోస్టులో ఎక్కువగా మగవారే ఉంటారు.

పట్టాలపై పవర్‌ గాళ్స్‌

స్వాతంత్య్రం అంటే సాధికారత. దాన్ని సాధించే క్రమంలో... సరికొత్త పాత్రల్లో తమను తాము నిరూపించుకోవడానికిమహిళలు సిద్ధమవుతున్నారు. పురుష ఉద్యోగులే ఎక్కువగా కనిపించే వృత్తుల్లోనూ తమ సామర్థ్యాన్ని చాటుతున్నారు. పల్లె ప్రాంతాల నుంచి వచ్చి, రైల్వే శాఖలో వివిధ స్థాయిల్లో రాణిస్తున్న ముగ్గురు మహిళలఅనుభవాలు... స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘నవ్య’కు ప్రత్యేకం.

కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చినా...

- దూశ స్రవంతి

మాది సిరిసిల్ల. డీఎడ్‌, బీఎస్సీ పూర్తిచేశాను. నిజామాబాద్‌ జిల్లా దగ్గర మోర్తాడ్‌ స్టేషన్లో అసిస్టెంట్‌ పాయింట్స్‌మన్‌ (గ్రూప్‌ డి స్టాఫ్‌)గా పనిచేస్తున్నా. ఈ పోస్టులో ఎక్కువగా మగవారే ఉంటారు. మహిళలు తక్కువనే చెప్పాలి. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సి వస్తుంది. స్టేషన్‌ నుంచి రైళ్లు వెళ్లేటప్పుడు లోకోపైలట్లు, గార్డులకు ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఆల్‌రైట్‌ సిగ్నల్స్‌ ఇవ్వాలి. ట్రెయిన్‌ మూమెంట్స్‌, ఇంటర్‌ లాకింగ్‌ పాయింట్స్‌ చూసుకోవాలి. స్టేషన్‌ మాస్టర్‌ అప్పగించిన వర్క్‌ చేయాలి. రోజుకు 12 గంటల డ్యూటీ ఉంటుంది. ఆ టైమ్‌లో స్టేషన్‌ నుంచి కనీసం పది రైళ్లు వెళతాయి. రోజుకు 24 రైళ్ల వరకూ ప్రయాణిస్తుంటాయి. ఇది సింగిల్‌ లైన్‌ సెక్షన్‌ కాబట్టి ప్రక్క స్టేషన్‌ వాళ్లు లైన్‌ క్లియర్‌ తీసుకుంటారు. ఒక ట్రెయిన్‌ వెళ్లిన తరువాతనే మరో దానికి అనుమతివ్వాలి. రైలు సరిగా వెళుతుందో లేదో చూసుకోవాలి. ఏదైనా అనుమానం వస్తే... పగలు ఎర్ర జెండా, రాత్రి రెడ్‌ లైట్‌ను గార్డుకు చూపించాలి. ట్రెయిన్‌ వచ్చేటప్పుడు స్టేషన్‌ ప్యానెల్‌లో సమాచారం వస్తుంది. పక్క స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరినది కనిపిస్తుంది. మాకు వాకీటాకీల్లో కూడా చెబుతారు.

Untitled-5 copy.jpg


చిన్న స్టేషన్‌ కాబట్టి రాత్రి పూట ఒక్కోసారి భయమనిపిస్తుంది. ఆర్‌ఆర్‌సీ ఎగ్జామ్‌కు అప్లయ్‌ చేసేటప్పుడు ఇలా రాత్రి షిఫ్ట్‌లు ఉంటాయని నాకు తెలీదు. పరీక్ష పాసైన తరువాత కాచిగూడ స్టేషన్‌లో శిక్షణ ఇచ్చారు. తరువాత ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టు వచ్చింది. కానీ ఆసక్తిగా అనిపించలేదు. 2020లో పంచాయతీ సెక్రటరీ పోస్టు కూడా వచ్చింది. అది కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కాబట్టి వద్దనుకున్నా. రైల్వేలో పెద్ద స్థాయికి వెళ్లడానికి డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్స్‌ ఉంటాయి. వాటికి ప్రిపేర్‌ అవుతున్నా.


మూడుసార్లు సీవోఎం అవార్డు

- జ్యోతి రాణి

మాది జమ్మికుంట దగ్గర సీతంపేట. వరంగల్‌లో డీ ఫార్మసీ, జమ్మికుంటలో బీఎస్సీ, హనుమకొండలో బీఈడీ పూర్తిచేశాను. డిగ్రీ చదివేటప్పుడు ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాశాను. మా బ్యాచ్‌లో 80 మంది ఎంపికైతే నేనొక్కదాన్నే అమ్మాయిని. మొదట ఝార్ఖండ్‌లో ట్రైనింగ్‌. శిక్షణ పూర్తయ్యాక సంబల్‌పూర్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో స్టేషన్‌ మాస్టర్‌గా నియమించారు. తరువాత సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకి జోనల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసి ఆలేరులో పోస్టింగ్‌ ఇచ్చారు. ఏడాదిపాటు పనిచేశాక జమ్మికుంటకు బదిలీ అయిది. అక్కడ సీనియర్‌ ఆఫీసర్‌ పద్మజా మేడమ్‌ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నాకు మూడుసార్లు సీవోఎం అవార్డు ఇప్పించడంతోపాటు సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ తరుపున ‘అవుట్‌ స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డ్‌’కు నామినేట్‌ చేశారు. జమ్మికుంటలో 7 ఎల్‌సీ గ్రేడ్స్‌ ఉంటాయి. వీటిలో 4 నాన్‌-ఇంటర్‌లాక్‌వి. అంటే వచ్చీ పోయే ట్రెయిన్లకు లైన్‌ క్లియర్‌ చేయడానికి ముందే ప్రైవేట్‌ నంబర్లతో వాటిని క్లోజ్‌ చేస్తారు. ఈ సమాచారాన్ని నిరంతరం ట్రెయిన్లకు తెలియజేస్తుండాలి. ఆ సమయంలో విధి నిర్వహణ చాలా కష్టంగా అనిపించేది. దానితోపాటు నామీద ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉండేది. అయిదేళ్ల తరువాత ఉప్పల్‌కు వచ్చి ఎనిమిది నెలలు పనిచేశా. తరువాత కాజీపేటకు బదిలీ అయింది. ప్రస్తుతం అక్కడే డిప్యూటీ స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నా. రోజుకు సగటున 140 రైళ్లు వచ్చిపోతూ ఉంటాయి. వాటిని పర్యవేక్షించాలి. నాకు ఆరు గంటలు డ్యూటీ టైమ్‌. వచ్చే పోయే రైళ్ల గురించి ముందుగానే ఒక అవగాహన ఉంటే డ్యూటీ చక్కగా చేసుకోవచ్చు. ఆఫీసుకు రాగానే డిమాండ్‌ ట్రెయిన్‌ సమాచారం ఇస్తారు.

Untitled-5 copy.jpg


నేను మొదట్లో ప్లాట్‌ఫారమ్‌ డ్యూటీ చేసేదాన్ని. పాసింజర్‌ ట్రెయిన్లు వెళ్లేటప్పుడు వాకీ టాకీ పట్టుకొని ప్లాట్‌ఫారమ్‌ మీద గమనిస్తుండాలి. ఎవరైనా మహిళలు, వృద్దులు రైలు ఎక్కలేకపోయారా అనేవి తెలుసుకుంటూ ఉండాలి. ఒకసారి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ప్రమాదవశాత్తు ఒక అమ్మాయి జారిపడింది. వెంటనే లోకోపైలట్‌కు సమాచారమిచ్చి ట్రెయిన్‌ ఆపించి ఆమెను కాపాడాను. స్టేషన్‌ మాస్టర్‌ని ఎంపిక చేసేటప్పుడు సైకలాజికల్‌ టెస్ట్‌ పెడతారు. ఏ సమయానికి ఎలా, ఎంత వేగంగా రియాక్ట్‌ అవుతారనేది పరిశీలిస్తారు. మేము డ్యూటీలో ఉన్నప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.


ఉద్యోగానికి పనికిరావన్నారు

- బండి స్వప్న ప్రియ

మాది వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లోని గుండ్రాతి మడుగు. పదోతరగతి వరకు జడ్పీహెచ్‌ఎ్‌సలో చదువుకున్నాను. గవర్నమెంట్‌ జూనియర్‌ గరల్స్‌ కాలేజీలో ఇంటర్‌, నలంద డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశాను. మాది పేదకుటుంబం. ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి మెయిన్‌ రోడ్డుకు వచ్చి అక్కడ బస్సెక్కి కాలేజీకి వెళ్లేదాన్ని. డిగ్రీ పూర్తయ్యాక ఆర్‌ఆర్‌సీ గ్రూప్‌ డీ ఎగ్జామ్‌ రాసి అర్హత సాధించా. తరువాత మెడికల్‌, ఫిజికల్‌ టెస్టులకు పిలిచారు. అందులో భాగంగా రన్నింగ్‌, బరువులెత్తడం లాంటి పరీక్షలు ఉండేవి. వాటికోసం మా ఊళ్లోనే ప్రాక్టీస్‌ చేసేదాన్ని. నాన్న వెంట వచ్చేవారు. అప్పుడు చాలామంది ‘‘ఆడవాళ్లు రైల్వే ఉద్యోగాలు చేయలేరు, ఎంపిక కావడం కూడా కష్టం’’ అంటూ నిరుత్సాహపరిచేవారు. కానీ నేను పట్టుదలగా సాధన చేశాను, పూర్తి ఫిట్‌నెస్‌తో అన్ని పరీక్షల్లో అర్హత సాధించాను. పాయింట్స్‌మన్‌గా మణుగూరులో పోస్టింగ్‌ వచ్చింది. ఏడేళ్లపాటు ఆ ఉద్యోగం చేశాను. ఆపరేటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో విధులు ఉండేవి. ట్రాక్‌ వెంబడి క్రాస్‌ ఓవర్‌ పాయింట్స్‌ని ఇంజన్‌తో కప్‌లింగ్‌ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఇంటర్‌ లాకింగ్‌ ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం చేత్తోనే చేయాలి. మొదట్లో నాకది చేతనయ్యేది కాదు. తరువాత పట్టుదలతో నేర్చుకున్నా. పాసింజర్‌ కోచెస్‌కు కప్‌లింగ్‌ చేయడానికి 25 కేజీల బరువు ఎత్తాల్సి వచ్చేది. అది చూసి నా తోటి ఉద్యోగులంతా ‘‘ఈ పనులు ఆడవాళ్లు చేయలేరు’’ అనేవారు. అప్పటివరకూ ఆ స్టేషన్‌లో మహిళా సిబ్బంది లేరు. ఏడాది తరువాత భద్రాచలానికి బదిలీ చేశారు. డిపార్ట్‌మెంట్‌ల్‌ పరీక్షలు రాసి. 2021లో గూడ్స్‌ ట్రెయిన్‌ మేనేజర్‌గా ఎంపికయ్యాను. ఆ విధులు చాలా కష్టంగా ఉంటాయి. ఇంజన్‌తోపాటు 60 వేగన్లు ఉంటాయి. వాటి స్లైడింగ్‌, లోడింగ్‌, ఫార్మేషన్‌ మొత్తం చూసుకోవాలి. గమ్యస్థానం చేరేవరకూ వాటితోనే ఉండాలి. ఆ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వర్తించాను.


ప్రస్తుతం సీనియర్‌ గూడ్స్‌ ట్రెయిన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా. పగలు, రాత్రి షిఫ్టులు ఉంటాయి. నీటి సౌకర్యం అంతగా ఉండదు కానీ ప్రతి స్టేషన్లో వాష్‌రూమ్స్‌ అందుబాటులో ఉంటాయి. అనుకోకుండా గూడ్స్‌ ఆగినప్పుడు భయమనిపించడం సహజమే. కానీ వాకీ టాకీల ద్వారా డ్రైవర్‌, స్టేషన్‌ మాస్టర్‌ అందుబాటులో ఉంటారు. కంట్రోలర్స్‌ కూడా మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మహిళలకు మరీ లాంగ్‌ కాకుండా షార్ట్‌ ట్రిప్స్‌ ఇస్తుంటారు. ఒక్కోసారి ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు భోజనం, వసతి లాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు. ‘‘గూడ్స్‌ వెంట ఒక్కదానివే ప్రయాణించడం కష్టం’’ అంటూ ఎంతమంది భయపెట్టినా నేను మాత్రం ధైర్యంగానే ఉండేదాన్ని. నన్ను చూసి మరో పదిమంది అమ్మాయిలు రావాలి అనుకునేదాన్ని. ప్రస్తుతం సికింద్రాబాద్‌ డివిజన్లో 39 మంది మహిళలు పనిచేస్తున్నారు. భద్రాచలంలో మాత్రం నేనొక్కదాన్నే. ఈ ప్రయాణంలో ఎన్నో ఆనందానుభూతులు ఎదురవుతుంటాయి. సూర్యాస్తమయాలను చూస్తున్నప్పుడు, పున్నమి రాత్రుల్లో చంద్రుడు వెంట వస్తుంటే సంతోషంగా ధైర్యంగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా అడవుల్లో ట్రెయిన్‌ ఆగినప్పుడు జంతువుల అరుపులు వినిపిస్తే మాత్రం కాస్త భయమేస్తుంది. అయినా ధైర్యంగానే ఉంటాను. నా వృత్తి బాధ్యతల నిర్వహణలో భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం మరువలేనిది.

Updated Date - Aug 15 , 2026 | 05:49 AM