పెట్స్‌కీ కావాలి సంరక్షణ
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:51 AM
వర్షాకాలంలో అందానికి, ఆరోగ్యానికీ మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగే పెంపుడు జంతువులను కూడా కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో అందానికి, ఆరోగ్యానికీ మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగే పెంపుడు జంతువులను కూడా కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాల్లో విపరీతంగా వ్యాప్తిచెందే ఇన్ఫెక్షన్లు, పేలు, చర్మ సమస్యల నుంచి పెట్స్‌ని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం...
పెంపుడు జంతువులు వర్షంలో తడిసినప్పుడు వాటికి పాదాలు, చెవులు, పొట్ట, చర్మపు ముడతల్లో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. ఈ భాగాలను మెత్తటి తువాలుతో పొడిగా తుడవాలి. బొచ్చు ఎక్కువగా ఉన్నట్లయితే హెయర్ డ్రైయర్ సహాయంతో ఆరబెట్టాలి. వాటి శరీరం తడితడిగా ఉన్నట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పేలు చేరడం, చర్మ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో పెట్స్‌కి రోజూ స్నానం చేయించనక్కర్లేదు. వాటి శరీరానికి ఎక్కువగా బురద అంటుకుని మురికిగా ఉన్నాయనిపిస్తేనే స్నానం చేయించాలి. షాంపూలు, సబ్బులు ఎక్కువగా ఉపయోగిస్తే వాటి చర్మపు పొరలు దెబ్బతింటాయి. స్నానం చేయించిన తరువాత బ్లో డ్రైయర్‌తో వాటి శరీరంపై ఉన్న తడిని ఆరనివ్వాలి.
వాకింగ్‌కి వెళ్లి వచ్చిన తరువాత వాటి పాదాల్లో చేరిన బురదను వేడినీటితో కడిగి శుభ్రం చేయాలి. వేళ్ల మధ్య తడి లేకుండా తుడవాలి. బొచ్చు గుబురుగా ఉన్న పెట్స్ పట్ల ఎక్కువ శ్రద్ద వహించాలి. రోజూ బొచ్చును దువ్వుతుంటే చర్మానికి గాలి తగులుతుంది. బొచ్చు కూడా చిక్కులు పడకుండా ఉంటుంది. పేలు, ఈగలు, ఇతర పురుగుల వల్ల వాటికి ఇబ్బంది కలుగకుండా ఉంటుంది. పెట్స్‌కు ఎక్కువగా బొచ్చు రాలడం, చర్మం ఎర్రగా మారడం, కుంటడం, చెవి నుంచి చీము కారడం, వాంతులు, విరేచనాలు, జ్వరం, ఏమీ తినకపోవడం లాంటివి గమనిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అవసరమైన టీకాలు వేయించాలి.
వర్షం పడుతోందంటూ పెట్స్‌ని బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచడం మంచిది కాదు. వాటిని బయట కొద్దిసేపు తిరగనివ్వాలి. తేలికపాటి వ్యాయామాలు చేయించాలి. బయటికి తీసుకెళ్లేటప్పుడు వాటికి రెయిన్ కోట్లు, సాక్స్, తేలికపాటి బూట్లు వేయడం మంచిది.