పరివర్తనకు మార్గం
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:09 AM
ప్రపంచాన్ని జయించాలనే తపనతో మానవుడు వేల సంవత్సరాలుగా నిరంతరం ముందుకు సాగుతున్నాడు. ప్రకృతిని అధ్యయనం చేశాడు. సముద్రాలను దాటాడు. ఆకాశాన్ని..
సహజయోగ
ప్రపంచాన్ని జయించాలనే తపనతో మానవుడు వేల సంవత్సరాలుగా నిరంతరం ముందుకు సాగుతున్నాడు. ప్రకృతిని అధ్యయనం చేశాడు. సముద్రాలను దాటాడు. ఆకాశాన్ని చేరుకున్నాడు. విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో అద్భుతమైన అనేక విజయాలను సాధించాడు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంది... మనిషి తనను తాను నిజంగా తెలుసుకున్నాడా?
ప్రకృతి పరిణామక్రమాన్ని పరిశీలిస్తే... జీవరాశులన్నీ తమ అవసరాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచాన్ని అన్వేషిస్తూ అభివృద్ధి చెందాయి. జలచరాలు భూమిపై జీవించడానికి ప్రయత్నించాయి. జంతువులు పరిసరాలను ఎదుర్కోవడానికి తమ శరీర నిర్మాణాన్ని మార్చుకున్నాయి. మానవుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. ఆహారం కోసం అన్వేషించాడు. నివాసం ఏర్పరచుకున్నాడు. సంపదను కూడబెట్టాడు. అధికారాన్ని సంపాదించాడు. విజ్ఞానాన్ని సంపాదించాడు. కానీ భౌతిక ప్రగతి ఎంత జరిగినా.... అంతరంగంలో ప్రశాంతత, సంతృప్తి, ఆనందం లభించకపోతే జీవితం అసంపూర్తిగానే మిగులుతుంది.
మన దృష్టి బాహ్య ప్రపంచం నుంచి అంతరంగం వైపు మళ్ళినప్పుడే నిజమైన పరివర్తన సంభవిస్తుంది. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవడం, మన ఆలోచనలను పరిశీలించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, స్వీయ అవగాహనను పెంపొందించుకోవడం... ఇవే ఆధ్యాత్మిక జీవితానికి, పరివర్తనకు పునాదులు. ఒక అందమైన ఇంటిని నిర్మించిన తరువాత... దాని వెలుపల నిలబడి చూస్తూ ఉంటే ఆ ఇంటి సౌకర్యాలను అనుభవించలేం. అలాగే... ఎంత బలమైన కోటను నిర్మించినా, దాని లోపలకు వెళ్ళకపోతే అది రక్షణ ఇవ్వదు. ఇదే సూత్రం మన జీవితానికీ వర్తిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఎన్ని విజయాలు సాధించినా... అంతరంగంలోకి ప్రయాణించకపోతే శాశ్వతమైన ఆనందాన్ని పొందలేం. నేటి సమాజంలో సాంకేతిక సౌకర్యాలు విస్తరించిన వేళ... మానసిక ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి పెరుగుతున్నాయి. సమాచారం విపరీతంగా పెరిగింది... కానీ జ్ఞానం తగ్గుతోంది. పరిచయాలు పెరిగాయి... కానీ ఆత్మీయత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో మనిషికి అత్యవసరమైనది - అంతర్ముఖత. కొద్దిసేపైనా మనతో మనం గడపడం, మౌనాన్ని ఆస్వాదించడం, ధ్యానం ద్వారా మనస్సును పరిశుభ్రం చేసుకోవడం అత్యవసరం.
శ్రీ మాతాజీ నిర్మలాదేవి బోధించిన సహజయోగం ఇదే సందేశాన్ని అందిస్తుంది. మనలో సహజంగా నెలకొని ఉన్న ఆత్మ చైతన్యాన్ని మేలుకొలిపి, మన చిత్తాన్ని అంతర్ముఖంగా మరల్చినప్పుడే నిజమైన శాంతి, సమతుల్యత, ఆనందం లభిస్తాయని ఆమె బోధించారు. ఇది ఏదో ఒక మతానికి పరిమితమైన మార్గం కాదు. మానవుని అంతరంగ వికాసానికి సంబంధించిన విశ్వజనీన సత్యం. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనలో మార్పు రావాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే ముందు మన హృదయం శాంతిమయం కావాలి. బాహ్య విజయాలకన్నా అంతరంగ విజయం గొప్పది. మన చిత్తం బయట ప్రపంచంలో ఎంత విహరించినా... చివరకు అసలు గమ్యం మనలోనే ఉన్నదని గ్రహించినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. అంతర్ముఖత అంటే ప్రపంచాన్ని వదిలెయ్యడం కాదు... ప్రపంచాన్ని మరింత స్పష్టంగా, సమతుల్యతతో, ప్రేమతో చూడగలిగే స్థితికి చేరుకోవడం.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ