పరశురామమూర్తి
ABN , Publish Date - May 22 , 2026 | 02:26 AM
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఆరోది పరశురామావతారం. దీని గురించి ‘విష్ణుపురాణం’, ‘భాగవతపురాణం’ వివరంగా తెలిపాయి. ‘విష్ణుపురాణం’ ప్రకారం... భృగువంశానికి...
తెలుసుకుందాం
శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఆరోది పరశురామావతారం. దీని గురించి ‘విష్ణుపురాణం’, ‘భాగవతపురాణం’ వివరంగా తెలిపాయి. ‘విష్ణుపురాణం’ ప్రకారం... భృగువంశానికి చెంది రుచీకుడు అనే మహర్షి... గాధి అనే రాజు కుమార్తె సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. తెల్లని దేహం, ఒక చెవి మాత్రమే నీలం రంగులో ఉండే వెయ్యి గుర్రాలను తనకు ఇవ్వాలని గాధి షరతు పెడతాడు. వరుణుణ్ణి రుచీకుడు ఉపాసించి, అశ్వతీర్థం దగ్గర ఆ గుర్రాలను పొంది, వాటిని గాధికి ఇచ్చి... సత్యవతిని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత... రెండు రకాలైన భక్ష్యాలను రుచీకుడు సిద్ధపరచి... సంతానం కోసం వాటిని తినాల్సిందిగా తన భార్యకు, అత్తగారికి ఇస్తాడు. సత్యవతి తనకు నిర్దేశించినదాన్ని తల్లికి ఇచ్చి, తల్లికోసం ఏర్పరచినదాన్ని తాను తింటుంది. ఈ విషయం తెలిసిన రుచీకుడు కోపగిస్తాడు. ఆమెకు క్రూరవర్తనం చెందిన కుమారుడు పుడతాడని, నెత్తురు పారేలా చేస్తాడనీ శపించబోతాడు. తన కుమారుడు కాకుండా... మనుమడు అలా అయ్యేలా చేయాలని ఆమె వేడుకుంటుంది. సత్యవతికి పుట్టిన కుమారుడు జమదగ్ని. సత్యవతి తల్లికి పుట్టినవాడు విశ్వామిత్రుడు. జమదగ్ని కుమారుడే హైహేయ వంశాన్ని విచ్ఛిన్నం చేసి, రాజులను అంతం చేసిన పరశురాముడు. తల్లి ఆజ్ఞప్రకారం తల్లిని అతను చంపుతాడు. మళ్ళీ ఆమెను బతికించగలుగుతాడు. ‘రేణుకాదేవి’. ‘ఎల్లమ్మ’, ‘ఏకవీర’ అనే పేర్లతో దేవతగా ఆమె పూజలు అందుకుంటోంది. పరశురాముడు మహేంద్ర పర్వత ప్రాంతంలో ఈనాటికీ చిరంజీవిగా ఉన్నాడనేది శాస్త్రవచనం.
పరశురాముడికి 41 అస్త్ర శస్త్ర ప్రయోగాలు తెలుసునని ‘విష్ణుధర్మోత్తర పురాణం’ చెబుతోంది. పరశురాముడు చేతిలో పరశువు (గొడ్డలి) ధరించి శత్రువులైన రాజులను సంహరిస్తూ ఉంటాడనీ, ఆయన బంగారు శరీర ఛాయ కలిగినవాడిని ‘పాంచరాత్ర ఆగమం పేర్కొంది. కాగా... శాంతముద్రతో, జటామకుటధారియైు, కుడిచేతిలో గొడ్డలి, ఎడమచేతిలో విల్లును పట్టుకొని ఉంటాడని, శ్రీవత్స, కౌస్తుభ, వనమాలాది చిహ్నాలతో, యజ్ఞోపవీతాన్ని, ఉత్తరీయాన్ని ధరించి ఉంటాడని, నాలుగు చేతులు కలిగినవాడైతే శంఖం, చక్రం, ధనస్సు, బాణం ధరించి ఉంటాడని ‘పాద్మ సంహిత’ తెలిపింది. ‘విష్వక్సేన సంహిత’ ప్రకారం... ఆ స్వామి రెండు చేతులు కలిగినవాడై, గొడ్డలిని, బాణాలను లేదా కుడిచేతిలో కమండలాన్ని ఎడమ చేతిలో అక్షమాలను ధరించి ఉంటాడు, కాగా... చతుర్భుజాలతో... వెనుక చేతుల్లో కుడివైపు గండ్రగొడ్డలి, ఎడమవైపు ధనస్సు, ముందు చేతులలో ఖడ్గం, డాలు ధరించి కనిపిస్తాడని ‘హయశీర్ష సంహిత’ వివరించింది.
మహేంద్రగిరిపై...
‘వైఖానస ఆగమం’ ప్రకారం... పరశురాముడి ప్రతిమను మధ్యమ దశతాళమానాన్ని అనుసరించి 120 అడుగులు పొడవు ఉండేలా చేయాలి. రెండు చేతులు ఉన్న మూర్తికి కుడి చేతిలో పరశువు ఉంటుంది. ఎడమ చేయి సూచీముఖ హస్తంగా ఉంటుంది. శిరస్సుపై జటామకుటం, శరీరంపై యజ్ఞోపవీతం విధిగా చూపాలి. ఆ మూర్తి తెల్లని వస్త్రాలలో, ఎర్రని రంగుతో ఉండాలి. ‘అగ్నిపురాణం’ ప్రకారం... పరశురాముడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు. వాటిలో పరశువు, ఖడ్గం, బాణం, ధనస్సు ధరిస్తాడు. అయితే... చతుర్భుజ పరశురామమూర్తి ప్రతిమలు చాలా అరుదు. ఈ స్వామిని ఆరాధిస్తే శత్రునాశనం కలుగుతుందనీ, ప్రార్థించినవారికి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఒడిశాలోని గజపతి జిల్లాలో మహేంద్రగిరి పర్వతం మీద... దాదాపు 4,925 అడుగుల ఎత్తులో ప్రాచీనమైన పరశురామ దేవాలయం ఉంది. తూర్పు కనుమల్లోని ఈ ప్రదేశం... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు సరిహద్దు ప్రాంతం. చిరంజీవిగా ఉండే పరశురాముడు తపస్సు చేసిన పవిత్ర స్థలంగా పురాణాలు దీన్ని వర్ణించాయి.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..