మురికివాడ నుంచి ఆస్కార్ వరకు!
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:43 AM
కొన్నేళ్ళ క్రితం... శాండ్ మైనింగ్ మీద ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనకు అనూయ స్వామి వెళ్ళారు. ఉపాధిని వెతుక్కుంటూ స్వస్థలాలకు దూరమై, కొత్త చోట్ల అనుబంధాలు ఏర్పరచుకొని, తాత్కాలికమైన..
అనూయ స్వామి, హర్షిణి బోయళ్ళ... బెంగళూరులో పుట్టి పెరిగిన తెలుగమ్మాయిలు. జీవన వాస్తవికతను తెరకెక్కించాలనే తపన ఒకరిదైతే... అభినయంతో పాత్రలను చిరస్మరణీయం చెయ్యాలనే ఆకాంక్ష మరొకరిది... ఆ ఇద్దరి కలయికలో రూపొందిన తెలుగు- కన్నడ లఘు చిత్రం ‘పంకజ’... ఈ ఏడాది ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. ఆ చిత్రం వెనుక కథేమిటంటే...
కొన్నేళ్ళ క్రితం... శాండ్ మైనింగ్ మీద ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనకు అనూయ స్వామి వెళ్ళారు. ఉపాధిని వెతుక్కుంటూ స్వస్థలాలకు దూరమై, కొత్త చోట్ల అనుబంధాలు ఏర్పరచుకొని, తాత్కాలికమైన నివాసాల్లో గడిపేవారి బతుకులను ఆవిష్కరించిన ఎగ్జిబిషన్ అది. ఇంతలో... బెంగళూరులో ఉన్న తల్లి నుంచి అనూయకు ఫోన్ కాల్ వచ్చింది. తల్లితో ఆ ఎగ్జిబిషన్ గురించి చెబుతున్నప్పుడు... తన బాల్యం ఆమెకు గుర్తుకొచ్చింది. ‘‘అది పంకజ’ లఘు చిత్రానికి బీజం పడిన క్షణం’’ అంటారు అనూయ. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ. బతుకుతెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ చేరుకొని, అక్కడి నుంచి బెంగళూరుకు వలస వెళ్ళారు. వాళ్ళకు కన్నడ భాష ఏమాత్రం రాదు. అక్కడ వారికి తెలిసిన ఒకే ఒక కుటుంబం... బెంగళూరులోని అగారా మురికివాడల్లో ఉండేది. ‘‘అక్కడే మా అమ్మా నాన్నా కాపురం పెట్టారు. నేను అక్కడే పుట్టాను. చాలా రోజులు ఇరుకైన ఒక గదిలో ఉన్నాం. ఆ తరువాత ఇంకాస్త పెద్ద పోర్షన్‌కు మారాం. మా నాన్న రోజూ పొద్దున్నే పనులు వెతుక్కుంటూ వెళ్ళేవారు. రాత్రి వరకూ అమ్మకు నేను, నాకు అమ్మ... మేమిద్దరమే ఉండేవాళ్ళం. నాన్న కోసం ఎదురుచూసేవాళ్ళం. తరువాత మా తమ్ముడు పుట్టాడు. అప్పట్లో అమ్మ ఇరవైల వయసులో ఉంది. ‘పంకజ’ కథకు మా తల్లీ కూతుర్ల మధ్య అనుబంధమే మూలం’’ అని చెప్పారు అనూయ.
అమ్మ కథతో...
బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక... న్యూయార్క్ యూనివర్సిటీలోని ‘టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్’లో... ‘మీడియా ఆర్ట్స్ కోర్సులో అనూయ సీటు సంపాదించారు. ఆ యూనివర్సిటీలో... ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్పైక్ లీ దగ్గర టీచింగ్ అసిస్టెంట్‌గా చేరారు. ‘‘స్పైక్ ఒక స్వతంత్ర శక్తి. స్వతంత్రంగా ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో ఆయన నాకు నేర్పారు. అలాగే నటుడు విలియం డఫో, నిర్మాత గుర్నీత్ మోంగా కపూర్ లాంటి వారి సహచర్యం నాకు ఎంతో నేర్పింది. రెండో ఏడాది స్టూడెంట్ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు... నా గురించి బాగా తెలిసిన మా ప్రొఫెసర్ బర్బారా షవోక్ ‘‘మీ అమ్మ గురించి సినిమా ఎందుకు తియ్యకూడదు?’’ అని అడిగారు. నిజానికి అప్పటికే నా ఆలోచనల్లో స్ర్కిప్ట్ సిద్ధమైపోయింది. దాన్ని కాగితం మీద పెట్టాను. తుదిమెరుగులు దిద్దాను’’ అని చెప్పారు అనూయ. ఆ లఘు చిత్రాన్ని నిర్మించడానికి స్పైక్ లీ, విలియం టఫో, గుర్నీత్ మోంగా కపూర్ ముందుకు వచ్చారు. నటులకోసం అనూయ వెతుకులాట మొదలెట్టారు. అప్పుడు ఈ కథలోకి అడుగుపెట్టారు హర్షిణి బోయళ్ళ.
ఆర్కిటెక్ట్ నుంచి నటిగా...
‘‘అనూయ బెంగళూరు వచ్చి... కొందరు కన్నడ తారలను ఆడిషన్ చేశారు. వారి నటన బాగానే ఉంది, కానీ పంకజ పాత్రకు సంబంధించి వారిలో ఏదో లోపించినట్టు అనిపించిందట. అప్పుడు నా మిత్రుడు, ‘పంకజ’ చిత్రానికి సహ-నిర్మాత ప్రజ్వల్ నా గురించి అనూయకు చెప్పాడు. నేను అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసినా ప్రధానంగా రంగస్థల నటిని. అనూయ చెప్పిన కథ, పంకజ పాత్రలోని గాఢత నాకు నచ్చాయి అలా ఆ ప్రాజెక్టులో భాగమయ్యాను. అనూయతో పని చెయ్యడం మంచి అనుభవం’’ అని చెప్పారు హర్షిణి. ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్‌లో డిగ్రీ చేసిన హర్షిణి కొన్నాళ్ళు ఆర్కిటెక్ట్‌గా ప్రాక్టీస్ చేశారు. నటన, సంగీతం, నృత్యం అంటే చిన్ననాటి నుంచి ఇష్టం. బెంగళూరులోని ఒక కళా బృందంతో కలిసి ఎన్నో నాటకాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. స్వతంత్రంగా మ్యూజిక్ వీడియోలను, డాక్యుమెంటరీ డ్రామాలను రూపొందించారు. ‘‘నేను నా స్ర్కిప్ట్‌కు రోజూ మెరుగులు దిద్దుతూ ఉండేదాన్ని. మర్నాడు షూట్ చేసే వరకూ మార్పులు చేస్తూనే ఉండేదాన్ని. హర్షిణి రంగస్థల నటిగా చాలా బిజీ. కానీ ఎప్పటికప్పుడు స్ర్కిప్ట్ గురించి అడిగేది. నోట్స్ రాసుకొనేది. పాత్రను ఆమె మరింత అవగాహన చేసుకోవడం కోసం... నేను పెరిగిన ప్రాంతాలకు ఆమెను తీసుకువెళ్ళి చూపించాను’’ అన్నారు అనూయ.
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్‌గా...
ఇందులో మరో ముఖ్యమైన పాత్ర పంకజ కూతురైన ‘లలీ’్ల. ఆ పాత్రకోసం అగారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అనూయ సంప్రతించారు. ‘‘సినిమా అంటే ఆసక్తి ఉన్నా... చాలామంది మరీ బిడియంగా ఉన్నారు. మరికొందరిలో ఆ పాత్రకు మించిన చురుకుదనం కనిపించింది. చివరకు జి.పద్మశ్రీ అనే అమ్మాయిని ఎంపిక చేశాను. విచిత్రమేమిటంటే... ఆమెది కూడా బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబం. ఒకప్పుడు మేము నివసించిన వీధిలోనే తనూ ఉంటోంది. షూటింగ్ సమయంలో మిగిలిన అన్ని లొకేషన్లకూ మా అమ్మ వచ్చింది. కానీ అగారాకు మాత్రం రావడానికి ఇష్టపడలేదు. ఆమె జీవితంలో అక్కడున్న కాలం ఒక చేదు జ్ఞాపకం’’ అంటారు అనూయ. చిత్రీకరణ పూర్తి చేసుకున్నాక... ‘పంకజ’ను 20కి పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రతిచోటా ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలను, పురస్కారాలను అందుకున్న ఈ లఘు చిత్రం... ఈ ఏడాది జూన్‌లో ‘రెయిన్‌డ్యాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్’లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్‌గా అవార్డు గెలుచుకుంది. 99వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల కోసం పరిశీలనకు అర్హత సాధించింది. ‘‘ఇది మేం అస్సలు ఊహించలేదు. చాలామంది ‘కల నిజమైంది’ అంటూ ఉంటారు. కానీ ఇది మేము ఎన్నడూ కనని కల’’ అంటున్నారు అనూయ, హర్షిణి. ఇప్పుడు ఆస్కార్ సాధించడమే లక్ష్యంగా... పంకజ చిత్ర ప్రదర్శనల్లో ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
ఆ వాస్తవాలకు ప్రతిబింబంగా...
తెలుగు-కన్నడ భాషల్లో రూపొందిన ‘పంకజ’... 14 నిమిషాల లఘు చిత్రం. ఆచూకీ తెలియని భర్త కోసం కూతురితో సహా పంకజ అనే మహిళ బెంగళూరు మహా నగరానికి వచ్చి సాగించిన అన్వేషణ ప్రధానాంశం. భద్రత లేని అసంఘటిత రంగ కార్మికులు కనిపించకుండా పోతే... ఆ ప్రభావం వారి కుటుంబాల మీద ఎలా పడుతుందో హృద్యంగా చిత్రీకరించారు అనూయ. ‘‘ఈ చిత్రంలో రెండు అంశాలు సమాంతరంగా సాగుతాయి. మొదటిది... తల్లీ కూతుళ్ళ మధ్య ఉన్న బంధం. రెండోది... మన సమాజంలో వ్యవస్థీకృతమైన స్వార్థం, అత్యాశ, పేదల పట్ల క్రూరత్వం. నేను రోజు కూలీల మధ్య పెరిగాను. మన వ్యవస్థలో డబ్బు, పలుకుబడి, రాజకీయ అధికారం పేదలు, నిమ్నవర్గాల ప్రజల జీవితాలను ఎలా కల్లోల పరుస్తాయో ప్రత్యక్షంగా చూశాను. మనం జీవిస్తున్న సమాజంలోని ఈ వాస్తవాన్ని నా చిత్రం ప్రతిబింబించాలని అనుకున్నాను’’ అని చెబుతున్నారు అనూయ.