Share News

క్లోమంలో తిత్తులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:17 AM

క్లోమంలో సిస్ట్‌ ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌గా భావించి భయపడకూడదు. కొన్నిటితో జీవితాంతం ఎలాంటి సమస్యా లేకపోవచ్చు. కాబట్టి ఏ సిస్ట్‌ ప్రమాదకరమైనదో కనిపెట్టి, తగిన చికిత్సను ఆశ్రయించాలి.

క్లోమంలో తిత్తులు

ప్యాంక్రియాటిక్‌ సిస్ట్‌ అంటే?

పాంక్రియాస్‌ లోపల లేదా దాని చుట్టూరా ఏర్పడే ద్రవంతో నిండిన తిత్తిని ప్యాంక్రియాటిక్‌ సిస్ట్‌ అని అంటారు. ఇతరత్రా ఆరోగ్య పరీక్షల్లో భాగంగా అలా్ట్రసౌండ్‌, సిటి, ఎమ్మారై చేయించుకున్నప్పుడు ఈ తిత్తులు కూడా బయటపడుతూ ఉంటాయి. అయితే అన్ని తిత్తులూ ప్రమాదకరమైనవి కావు. సీరస్‌ సిస్టాడెనోమాస్‌ అనే తిత్తులు ప్రమాదకరమైనవి కావు. క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తూ, వీటిని ఓ కంట కనిపెడుతూ ఉంటే సరిపోతుంది. మ్యూసినస్‌ సిస్టాడెనోమాస్‌ అనే తిత్తులు, కొన్ని రకాల ఇంట్రాడక్టల్‌ పాపిల్లరీ మ్యూసినస్‌ నియోప్లాజమ్స్‌ తిత్తులు భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. సాలిడ్‌ సూడోపాపిల్లరీ నియోప్లాజమ్‌ సాధారణంగా యువతుల్లో కనిపిస్తుంది. ఇది పెద్ద పరిమాణానికి పెరిగే స్వభావం కలిగి ఉండడంతో పాటు అరుదుగా క్యాన్సర్‌గా మారే ముప్పు కూడా ఉంటుంది కాబట్టి సర్జరీతో తొలగిస్తారు.

ఆందోళన వద్దు

పాంక్రియాస్‌లో సిస్టు కనిపించిన వెంటనే వైద్యులు వెంటనే సర్జరీ చేయకుండా, ప్రమాద సంకేతాల కోసం వెతుకుతారు. సిస్ట్‌ వేగంగా పెరగడం, దాని పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండడం, దాని లోపల గడ్డ ఉండడం, ప్యాంక్రియాస్‌లోని ప్రధాన డక్ట్‌ వెడల్పు పెరగడం మొదలైన లక్షణాలను పరిశీలిస్తారు. కామెర్లతో పాటు, అకారణంగా బరువు తగ్గడం, కడుపునొప్పి తగ్గకుండా వేధించడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు పరిస్థితిని తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సిస్టులను మరింత క్షుణ్ణంగా పరిశీ లించడం కోసం, ఎండోస్కోపిక్‌ అల్ట్రాసౌ చేస్తారు. ఒక సన్నని, ఫ్లెక్స్‌బుల్‌ ట్యూబ్‌ను నోట్లో నుంచి కడుపులోకి పంపించి సిస్టును దగ్గరగా పరిశీలించి, అవసరమైతే దాన్లోని ద్రవాన్ని సేకరించి పరీక్షిస్తారు.


సర్జరీ తప్పనిసరి కాదు

పరిమాణంలో చిన్నదిగా ఉండి, ప్రమాద సంకేతాలేవీ లేని సిస్టును క్రమంతప్పని పరీక్షలతో గమనిస్తూ ఉంటే సరిపోతుంది. సిస్టు రకం, ముప్పు ఆధారంగా ఆరు నుంచి పన్నెండు నెలలకోసారి వైద్యుల సూచన మేరకు ఎమ్మారై, సిటి స్కాన్‌ చేయించుకుంటూ ఉండాలి. కొందరు సర్జరీతో ఈ సిస్టులను తొలగించుకోకపోయినా అనేక ఏళ్ల పాటు ఆరోగ్యంగానే ఉంటారు. సర్జరీ చేయవలసి ఉన్నప్పుడు సిస్టు ఉన్న ప్రదేశం ఆధారంగా వైద్యులు అందుకు తగిన సర్జరీని ఎంచుకుంటారు. సిస్టు పాంక్రియాస్‌ తలభాగంలో ఉన్నప్పుడు విపుల్‌ ప్రొసిజర్‌ అవసరమవుతుంది. పాంక్రియాస్‌ మధ్య భాగం, చివరి భాగంలో ఉన్న సిస్టులకు డిస్టల్‌ ప్యాంక్రియాటెక్టమీని ఎంచుకుంటారు.


రోబోటిక్‌ సర్జరీ ఉపయోగమిదే!

క్లోమం పొత్తికడుపులో ఎంతో లోపల ముఖ్యమైన రక్తనాళాలు, ప్లీహంకు దగ్గరగా ఉంటుంది. పైగా ఇది సున్నితమైన అవయవం కాబట్టి ఈ భాగానికి సర్జరీ చేయడం కొంత క్లిష్టం. కాబట్టి పొత్తికడుపును కోసే అవసరం లేకుండా చిన్న కోతతో సర్జరీ చేయడానికి రోబోటిక్‌ సర్జరీని ఎంచుకుంటారు. సర్జన్‌, సర్జరీ సమయంలో, రోబోటిక్‌ సిస్టమ్‌ను స్వయంగా నియంత్రిస్తూ, మ్యాగ్నిఫైడ్‌ త్రిడి వ్యూ, ఇరుకైన ప్రదేశాల్లో కదిలే వీలున్న ఫ్లెక్స్‌బుల్‌ పరికరాలతో సమస్యను సరిదిద్దుతారు. రోబోటిక్‌ సర్జరీలో కచ్చితత్వంతో టిష్యూను విడదీసి, కుట్లు వేయడం సాధ్యపడుతుంది.

ముఖ్యంగా ప్లీహానికి దగ్గరగా ఉన్న రక్తనాళాలకు చేరువలో సర్జరీ చేసే సందర్భాల్లో కచ్చితత్వం ఎంతో బాగా అక్కరకొస్తుంది. ఈ సర్జరీ ద్వారా డిస్టల్‌ ప్యాంక్రియాటెక్టమీ అవసరమైన అనేక మంది రోగుల్లో ప్లీహాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. విపుల్‌ సర్జరీ అవసరమైన రోగుల్లో మ్యాగ్నిఫైడ్‌ వ్యూ, రోబోటిక్‌ సిస్టమ్‌ అందించే స్థిరమైన నియంత్రణ వల్ల పెద్ద కోత లేకుండానే సర్జరీని ముగించే వీలుంటుంది. ఇలాంటి మినిమల్లీ ఇన్వేసివ్‌ చికిత్సలతో తక్కువ నొప్పి, రక్తస్రావాలతో రోగులు త్వరగా కోలుకుని, దైనందిన జీవితాన్ని కొనసాగించే వీలు కలుగుతుంది.

సర్జరీ ఎవరికి?

రోబోటిక్‌ సర్జరీకి రోగులందరూ అర్హులు కారు. సిస్ట్‌ పరిమాణం, దాని ప్రదేశం, సమీప కణజాలాలకు క్యాన్సర్‌ వ్యాపించిందా, లేదా అనే అంశాల ఆధారంగా వైద్యులు అవసరాన్ని బట్టి రోబోటిక్‌ సర్జరీ లేదా ఓపెన్‌ సర్జరీని ఎంచుకుంటారు. ప్యాంక్రియాస్‌లో తిత్తి ఉన్నంత మాత్రాన దాన్ని క్యాన్సర్‌గా భావించకూడదు. సిస్ట్‌ రకం, దాంతో పొంచి ఉన్న ప్రమాదంతో పాటు చికిత్స అవసరం ఏ మేరకు ఉంది? ఓ కన్నేసి ఉంచితే సరిపోతుందా? అనే విషయాల గురించిన అవగాహన కోసం వైద్య పరీక్షలు చేయించుకోవాలి, వైద్యుల సూచనలను పాటించాలి.

డాక్టర్‌ వరుణ్‌ దాసరి

కన్సల్టెంట్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ

మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ, సంప్ర.08654 669966

Updated Date - Nov 24 , 2026 | 12:30 AM