పద్మ వికాసం
ABN , Publish Date - Jan 26 , 2026 | 02:41 AM
కలం పట్టినా, హలం పట్టినా.. సామాజిక మార్పు కోసం నడుంబిగించినా మహిళా శక్తికి సాటిలేదని ఈ ధీరవనితలు నిరూపించారు. తమదైన ముద్రతో సమాజ గమనాన్ని మార్చిన...
కలం పట్టినా, హలం పట్టినా.. సామాజిక మార్పు కోసం నడుంబిగించినా మహిళా శక్తికి సాటిలేదని ఈ ధీరవనితలు నిరూపించారు. తమదైన ముద్రతో సమాజ గమనాన్ని మార్చిన శివశంకరి, ఎస్.జి.సుశీలమ్మ, కొల్లక్కయిల్ దేవకి, విమలా మీనన్‌లను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. అక్షరం, ప్రకృతి, సేవ, కళ.. ఇలా విభిన్న రంగాల్లో వారు చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది.

అక్షర సేతువు
తమిళ సాహిత్య వినీలాకాశంలో ధృవతారగా వెలుగుతున్న శివశంకరిని కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించడం అక్షర లోకానికే గర్వకారణం. ఐదు దశాబ్దాలకు పైగా తన కలం ద్వారా సామాజిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించిన ఆమె కేవలం రచయిత్రిగానే కాకుండా ఒక సామాజిక విశ్లేషకురాలిగా దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. అక్షరాల ద్వారా దేశాన్ని ఏకం చేయాలనే ఆమె తపనకు ఈ పౌర పురస్కారం ఒక సముచిత గౌరవం. శివశంకరి రచనలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలలోని మనో వేదనలు, స్ర్తీల అంతరంగ మథనం, సామాజిక దురాచారాలను ఆమె తన రచనల్లో సూటిగా ప్రశ్నిస్తారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యపానం వంటి వ్యసనాల వల్ల కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో ఆమె కళ్లకు కట్టినట్టు చూపారు. పాఠకుల నాడి తెలిసిన రచయిత్రిగా ఆమె రాసిన అనేక నవలలు వెండితెరపైనా సంచలనం సృష్టించాయి. ఆమె సాహిత్య ప్రస్థానంలో తలమానికం వంటిది ‘నిట్ ఇండియా త్రూ లిటరేచర్’ ప్రాజెక్ట్. భారతదేశం వంటి భిన్నత్వంతో కూడిన దేశాన్ని సాహిత్యం ద్వారా ఎలా ఏకం చేయవచ్చో ఆమె నిరూపించారు. ఇందుకోసం ఆమె ఏకంగా 16 ఏళ్లపాటు దేశంలోని నాలుగు దిక్కులా పర్యటించారు. 18 భారతీయ భాషలకు చెందిన ప్రసిద్ధ రచయితలను కలుసుకుని వారి సంస్కృతిని, సాహిత్యాన్ని అధ్యయనం చేసి నాలుగు భారీ సంపుటాలను వెలువరించారు. ఇది భారతీయ సాహిత్య చరిత్రలో ఒక అరుదైన, సాహసోపేతమైన ప్రయత్నం.
శివశంకరి రాసిన ‘సూర్యవంశం’ అనే స్మృతి చిత్రాలు ఆమె వ్యక్తిగత ప్రయాణంతోపాటు ఒక తరం సామాజిక మార్పులను రికార్డు చేశాయి. ఈ రచనకు గాను ఆమెకు ఇప్పటికే ప్రతిష్ఠాత్మక ‘సరస్వతీ సమ్మాన్’ దక్కింది. ఇప్పుడు దక్కిన ‘పద్మశ్రీ’ పురస్కారం ఆమె నిబద్ధతకు, సాహిత్య కృషికి దేశం సమర్పించిన నీరాజనం. భాషలు వేరైనా, భావం ఒక్కటేనని చాటిచెప్పిన శివశంకరి అక్షర ప్రయాణం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తిపాఠం.

అనాథల పాలిట అమ్మ
నిశ్శబ్దంగా వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన వారు కొందరే ఉంటారు. అటువంటి వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన ఎస్.జి.సుశీలమ్మ. అనాథలు, అభాగ్యుల పాలిట కల్పవల్లిగా మారిన ఆమెను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించడం సామాజిక సేవా రంగానికి దక్కిన గౌరవం. దశాబ్ద కాలంగా ఆమె చేస్తున్న నిరంతర కృషికి ఈ అత్యున్నత పురస్కారం ఒక చిన్న గుర్తింపు మాత్రమే.
సుశీలమ్మ సేవా ప్రస్థానం నేటిది కాదు. దాదాపు ఆరు దశాబ్దాల కిందటే ఆమె హృదయం సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ద్రవించింది. కేవలం రూ. 15 నగదుతో ముగ్గురు అనాథ పిల్లలను చేరదీసి ఒక అద్దె ఇంట్లో ప్రారంభించిన ఆమె ప్రయాణం నేడు ‘సుమంగళి సేవా ఆశ్రమం’ అనే ఒక మహా సంస్థగా రూపాంతరం చెందింది. సంపద లేకపోయినా సేవాగుణం ఉంటే కొండంత పనిచేయవచ్చని ఆమె నిరూపించారు. అనాథ పిల్లలకు ఆమె ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో నిలబెట్టారు. సుశీలమ్మ కేవలం పిల్లలకే పరిమితం కాలేదు. గృహహింసకు గురై సమాజం వెలివేసిన మహిళలకు ఆమె ధైర్యాన్ని ఇచ్చారు. సుమంగళి సేవా ఆశ్రమం ద్వారా వేలాదిమంది మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా నిలబడేలా చేశారు. ఒక మహిళ స్వయం సమృద్ధి సాధిస్తే ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుందన్న గాంధేయ సిద్ధాంతాన్ని ఆమె ఆచరణలో చూపారు. ఆమె పెంచిన పిల్లలు, ఆమె ఆశ్రయంలో ఆసరా పొందిన మహిళలు నేడు ఆమెను ‘అమ్మ’ అని పిలుచుకుంటారు.
వయసు పైబడుతున్నా సుశీలమ్మలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంచడం, మహిళల ఆరోగ్య రక్షణ, వృద్ధులకు ఆసరా కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను ఆమె ఇప్పటికీ పర్యవేక్షిస్తున్నారు. ప్రచార ఆర్భాటం లేకుండా ఆమె చేసిన సేవలు ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. పద్మశ్రీ పురస్కారం ఆమె ఇంటి తలుపు తట్టడం ద్వారా భారత ప్రభుత్వం ఒక నిబద్ధత కలిగిన సేవామూర్తిని సరైన సమయంలో గుర్తించిందని చెప్పవచ్చు.

40 ఏళ్ళ ‘మొక్క’వోని దీక్ష
కొల్లక్కయిల్ దేవకీ అమ్మకు ప్రకృతే బడి, గుడి. ‘నేల ఎప్పుడూ పచ్చగా ఉంటేనే మనిషికి మనుగడ’ అని చెప్పడమే కాదు, పచ్చదనం కోసం నలభయ్యేళ్ళుగా పాటుపడుతున్నారు. రోజుకు ఒక్క మొక్కయినా నాటడాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. దేవకీ అమ్మ స్వస్థలం కేరళలోని ముత్తుకులమ్ గ్రామం. 1934లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆమెకు బాల్యం నుంచి వ్యవసాయ పనులు అలవాటే. వివాహం తరువాత... భర్త గోపాలకృష్ణ పిళ్ళై ఉపాధ్యాయ వృత్తిలో నిమగ్నమైతే... పొలం పనులను దేవకి చూసేవారు. కానీ కారు ప్రమాదానికి గురై, ఆమె పాదాలు బలహీనం కావడంతో... వ్యవసాయ పనులు చేయడం కష్టమయ్యేది. ‘‘పొలానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవడం ఆమెకు కష్టమయింది. ఇప్పుడే భర్త సూచనతో.... తమ తోటలో మొక్కలు పెంచడం ఆరంభించారు. ఇప్పటివరకూ అయిదువేలకు పైగా మొక్కలు నాటారు. వాననీటి సంరక్షణ పద్ధతులు చేపట్టారు.
నాలుగు దశాబ్దాల ఆమె కృషి ఇప్పుడు ఒక అడవిగా రూపుదిద్దుకుంది. అపురూపమైన ఎన్నో మొక్కలతో కళకళలాడుతోంది. వలస పక్షులకు విడిదిగా మారింది. తొంభయ్యేళ్ళు దాటినా ఇప్పటికీ ఆమెలో ఉత్సాహం, పర్యావరణ పరిరక్షణకోసం ఏదైనా చేయాలనే తపన తగ్గలేదు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని గట్టిగా వ్యతిరేకించే దేవకి తోటలో సేంద్రియ పద్ధతులనే అనుసరిస్తారు. ఆమె చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఆ తోట... ప్రకృతి ప్రేమికులతో పాటు విద్యార్థులను, పరిశోధకులకు సందర్శన స్థలంగా మారింది. ఇప్పుడు జానకి పిల్లలు కూడా ఆమె బాటతోనే... మొక్కల పెంపకం, సంరక్షణ చేస్తున్నారు. ‘నారీ శక్తి’ అవార్డుతో సభా అనేక పురస్కారాలను అందుకున్న దేవకికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’ అవార్డు... పర్యావరణ పరిరక్షణ దిశగా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

జగమెరిగిన గురువు
‘‘కళారంగంలో మీరు ఏం సంపాదించారు?’’ అని ఒక సందర్భంలో ఎదురైన ప్రశ్నకు ‘‘వేలమంది శిష్యుల్ని. వారే నా సంపద’’ అని సగర్వంగా బదులిచ్చారు విమలా మీనన్. నృత్య కళాకారిణిగా, గురువుగా దాదాపు ఆరున్నర దశాబ్దాల అనుభవం ఆమెది. సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మోహినీ ఆట్టం నృత్యాల్లో ఆహార్యం నుంచి ప్రదర్శన తీరు వరకూ ఆమె పలు ప్రయోగాలు చేశారు. కేరళలోని ఇరింజలకుడ గ్రామంలో 1943 జనవరి ఏడున ఆమె జన్మించారు. సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి కృష్ణన్‌నాయర్, తల్లి విశాలాక్షి ఆమె కళాభిరుచిని ప్రోత్సహించారు. చిన్న వయసులోనే నృత్యంతో పాటు కర్ణాటక సంగీతాన్ని కూడా ఆమె అభ్యసించారు. పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తరువాత... ‘కేరళ కళామండలం’ సంస్థలో నృత్యంలో నాలుగేళ్ళ డిప్లమా చేశారు. ‘కళామండలం విమలా మీనన్’గా ప్రసిద్ధులయ్యారు. మోహినీఆట్టంతోపాటు కేరళలో ప్రత్యేకించి మహిళలు చేసే తిరువతిరుకళి, భరతనాట్యం, సుప్రసిద్ధ తెలుగు నృత్యగురువు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి... ఇలా పలు నాట్యరీతులల్లో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. ఒక పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా పని చేస్తూ ఉండగా... భూటాన్‌లో ప్రభుత్వాధికారి అయిన విశ్వనాథ మీనన్‌తో విమలకు వివాహమయింది. భర్తతోపాటు భూటాన్ వెళ్ళి, అక్కడ నృత్య పాఠాలు బోధించడంతో పాటు పలుప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
స్వదేశానికి వచ్చిన తరువాత తిరువనంతపురంలో ‘కేరళ నాట్య అకాడమీ’ అనే సంస్థను ప్రారంభించారు. వేలాదిమందిని మోహినీఆట్టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. దక్షిణాది శాస్త్రీయ నృత్యాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవాలను అందుకున్న విమలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘నాలుగేళ్ళ వయసు నుంచి ‘కేరళ కళామండలం’లో నృత్యం నేర్చుకోవాలని కలలుకన్నాను. అక్కడే పూర్తిస్థాయి నర్తకిగా, కొరియోగ్రాఫర్‌గా రూపుదిద్దుకున్నాను. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. కానీ నృత్యం నేర్పడంలో ఉన్న సంతృప్తి నాకు మరెక్కడా దొరకలేదు. నా విద్యార్థులు ప్రపంచమంతటా ఉన్నారు. నృత్యకళకు గుర్తింపు తీసుకువస్తున్నారు. వారి కారణంగా నా పేరు ప్రపంచమంతా తెలిసింది. ఇంతకన్నా గొప్ప విజయం ఇంకేం ఉంటుంది?’’ అంటారు విమల.