పొలం గట్టుపై సిక్సర్!
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:14 AM
చేతిలో బ్యాట్.. గుండెలో ఆత్మవిశ్వాసం.. కళ్లలో గెలుపు పిలుపు! వంటింటి గడప దాటడమే సాహసమనుకున్న చోట ఒక గ్రామీణ మహిళా రైతు...
చేతిలో బ్యాట్.. గుండెలో ఆత్మవిశ్వాసం.. కళ్లలో గెలుపు పిలుపు! వంటింటి గడప దాటడమే సాహసమనుకున్న చోట ఒక గ్రామీణ మహిళా రైతు తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టింది. మహారాష్ట్రలో సామాజిక విప్లవానికి నాంది పలికిన ‘ప్యాడీ కప్’ విజేత స్వాతి జెండే స్ఫూర్తిదాయక కథ ఇది.
ఆమె చేతులు బురద పొలంలో నాట్లు వేస్తాయి. అవే చేతులు పిచ్‌పై బ్యాట్ పట్టి బంతిని బౌండరీల ఆవలకు పంపుతాయి. వంటింటి పొగకు, పొలం పనుల ఒత్తిడి మధ్య నలిగిపోయే సగటు గ్రామీణ మహిళ.. తన క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగారు. మహారాష్ట్రలో వినూత్నంగా నిర్వహించిన ‘ప్యాడీ కప్’లో తన జట్టును విజేతగా నిలిపిన స్వాతి జెండే ప్రస్థానం ఒక సామాజిక విప్లవం.
వరి కోతలే కాదు.. వికెట్లు కూడా
పూణె జిల్లాలోని భోర్, వెల్హే (రాజ్‌గఢ్) తాలూకాలు వరిసాగుకు ప్రసిద్ధి. అయితే ఈ ప్రాంతంలో ఫిబ్రవరి వచ్చిందంటే చాలు వాతావరణం మారిపోతుంది. దశాబ్ద కాలంగా ‘సైబేజ్ ఆశా’ సంస్థ నిర్వహిస్తున్న ‘ప్యాడీ కప్’ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. 2025-26 సీజన్‌లో సుమారు 4,500 మంది రైతులు, 40కిపైగా మహిళా జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో స్వాతి జెండే ఒక శక్తిగా ఆవిర్భవించారు తెల్లవారుజామునే లేచి పశువుల పాకను శుభ్రం చేసి, కుటుంబానికి వండిన తర్వాత చీరకట్టుపైనే క్రికెట్ కిట్ తగిలించుకుని మైదానంలోకి దిగడం ఆమెకు అలవాటు.
వ్యవసాయ పిచ్‌పై క్రికెట్ కోత
ఈ టోర్నమెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం దాని నిర్వహణ పద్ధతి. రైతులు కేవలం మైదానంలో ఆడితే సరిపోదు. ఏడాది పొడవునా పదిమంది రైతులు ఒక బృందంగా ఏర్పడి ‘శాస్త్రీయ పద్ధతిలో వరిసాగు చేయాలి. స్వాతి జెండే తన బృందాన్ని కేవలం గ్రౌండ్‌లోనే కాదు, బురద పొలాల్లోనూ అద్భుతంగా నడిపించారు. వారు పాటించిన ‘సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (ఎస్‌ఆర్‌ఐ) పద్ధతి వల్ల తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించారు.
విజేతను నిర్ణయిస్తారిలా..
విజేతలను నిర్ణయించడానికి నిర్వహించే 500 మార్కుల స్కోరింగ్ విధానం చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో క్రికెట్ గెలుపునకు మాత్రమే మార్కులుండవు. వారు పొలంలో వాడిన సేంద్రియ ఎరువులు, పంట నాణ్యత, గ్రూపు సభ్యుల మధ్య ఉన్న సయోధ్య వంటి అంశాలకు 80 శాతం మార్కులు ఉంటాయి. అంటే, స్వాతి జట్టు ఇటు సాగులోను, అటు ఆటలోనూ నూటికి నూరుశాతం ప్రతిభ కనబర్చడంతోనే చాంపియన్ ట్రోఫీ ఆమె సొంతమైంది.
పిచ్ నుంచి పంచాయతీ వరకు
‘‘మొదట్లో క్రికెట్ బ్యాట్ పట్టుకోవడానికి చేతులు వణికేవి. గ్రామస్థులు చూసి నవ్వుతారేమో అని భయం వేసేది. కానీ ఈ రోజు నేను మా జట్టును నడిపిస్తున్న తీరు చూసి మా ఊరి మగవాళ్లే ఆశ్చర్యపోతున్నారు’’ అని స్వాతి చిరునవ్వుతో చెబుతారు. జట్టుకు కెప్టెన్‌గా ఉండటం ఆమెకు కొత్త గుర్తింపును ఇచ్చింది. గతంలో గ్రామంలో ఏవైనా సమస్యలు వచ్చినా, గ్రామ సభలు జరిగినా మహిళలు ఒక మూలన కూర్చుని వినేవారు తప్ప మాట్లాడే ధైర్యం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్వాతి ఇప్పుడు గ్రామ సభల్లో నిలబడి సమస్యలను ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను పదిమంది సభ్యుల క్రికెట్ టీంను వ్యూహాలతో నడిపిస్తున్నప్పుడు, నా ఊరి సమస్యలపై ఎందుకు మాట్లాడలేను?’’ అన్న ఆమె ప్రశ్నలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
కుటుంబ మద్దతు
స్వాతి ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అంశం కుటుంబాల నుంచి వచ్చిన మద్దతు. ఈ టోర్నీ ఫైనల్ జరుగుతున్నప్పుడు మైదానంలో గ్యాలరీ అంతా మహిళల భర్తలు, పిల్లలతో నిండిపోయింది. తమ భార్యలు బౌండరీలు బాదుతుంటే వారు ఈలలు వేస్తూ ప్రోత్సహించడం గ్రామీణ ప్రాంతాల్లో అరుదైన దృశ్యం. ‘‘మా అమ్మ గ్రౌండ్‌లో ఆడుతుంటే గర్వంగా అనిపిస్తుంది’’ అని స్వాతి కుమారుడు అంటుంటే, అది ఒక తరాన్నే మార్చేస్తున్న విప్లవంలా అనిపిస్తుంది.
అంతులేని ఆశయాల ప్రయాణం
స్వాతి జెండే వంటి నాయకురాలు ఇప్పుడు పూణెకే పరిమితం కాదు. ఆమె మాటలు ఇప్పుడు ఆ చుట్టుపక్కల 40 గ్రామాల్లోని మహిళలకు వేదవాక్కులు. ‘‘మనకు కావాల్సింది కేవలం కప్పుకాదు. ఈ ఆట ద్వారా దొరికే స్వేచ్ఛ. వంటింటి చాకిరీ నుంచి కొన్ని గంటల విరామం, మమ్మల్ని మేము నిరూపించుకునే అవకాశం. అదే అసలైన విజయం’’ అంటారు స్వాతి. చీరకట్టుతో సిక్సర్లు కొడుతూ సామాజిక అడ్డంకులను చెరిపేస్తున్న స్వాతి జెండే ఒక ‘సోషల్ కెప్టెన్’. ఆమె ప్రయాణం ఇప్పుడు లక్షల మంది మహిళల కలలకు కొత్త రెక్కలు తొడుగుతోంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు శివరాత్రి.. పాకిస్థాన్‌కు కాళరాత్రి