నచ్చినట్టు జీవించడమే ఇష్టం
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:36 AM
నా దృష్టిలో రిలేషన్‌షి్‌ప అంటే కేవలం ప్రేమ, ఆకర్షణ, కలిసి సమయం గడపడం మాత్రమే కాదు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, నమ్మకం, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండటం ఎంతో ముఖ్యం. గతంలో కొన్ని..
‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నిత్యా మేనన్... తన సహజ నటనతో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాల ఎంపికలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో స్పష్టమైన ఆలోచనలతో ఉండే ఆమె.. తాజాగా తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే తన పెళ్లి వార్తలు, వ్యక్తిగత జీవితంపై నిత్య ఏమన్నారో ఆమె మాటల్లోనే...
‘‘నా దృష్టిలో రిలేషన్‌షి్‌ప అంటే కేవలం ప్రేమ, ఆకర్షణ, కలిసి సమయం గడపడం మాత్రమే కాదు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, నమ్మకం, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండటం ఎంతో ముఖ్యం. గతంలో కొన్ని సంబంధాల్లో నా స్వేచ్ఛకు భంగం కలిగే పరిస్థితులు ఎదురయ్యాయి. కొందరి ప్రభావం ఎలా ఉంటుందంటే, వారితో ఉన్నప్పుడు మనకంటూ సొంత వ్యక్తిత్వమే లేకుండా పోతుంది. కనీసం స్వేచ్ఛగా ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉండదు. నా ఆత్మ కుంచించుకుపోయినట్లు, ఎంతో బలహీనపడినట్లు అనిపించేది. మన ప్రతి నిర్ణయాన్ని నియంత్రించే వ్యక్తులతో కలిసి ప్రయాణించడం చాలా కష్టం. అలాంటి బంధాల నుంచి బయటకు రావాలని నేను నిర్ణయించుకున్నప్పుడు, అది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు.. జీవితానుభవాల నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం. ఒక్కోసారి ఆ బంధాన్ని కాపాడుకోవడం కంటే, అందులోంచి బయటకు వచ్చి మనల్ని మనం కాపాడుకోవడం, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం.
బంధం వీడితేనే మనశ్శాంతి
మన భాగస్వామి మనల్ని నియంత్రిస్తూ, మన ఇష్టాలకు అనుగుణంగా జీవించనివ్వకపోతే మానసికంగా తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. నిజానికి అలాంటి టాక్సిక్ బంధాల నుంచి బయటపడటం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఒకసారి ధైర్యం చేసి బయటకు వచ్చిన తర్వాత, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే అవకాశం దక్కుతుంది. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్లు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. నా గత అనుభవాలు నాకు నేర్పిన అతిపెద్ద సత్యం ఇదే.
పెళ్లి అనే పేరు అక్కర్లేదు
గతంలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలను చూసి, నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చాలామంది అనుకున్నారు. కానీ నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదు. నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది. కాకపోతే కేవలం పెళ్లి చేసుకోవాలి కదా అని ఎవరో ఒకరిని ఎంచుకోలేను. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి నా స్వేచ్ఛను గౌరవించాలి, నా వ్యక్తిత్వానికి, నా కలలకు విలువ ఇవ్వాలి. ఒకరినొకరు నియంత్రించుకోవడం కాకుండా, ఇద్దరూ కలిసి ఎదిగేలా ప్రోత్సహించుకోవాలి. అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండటానికైనా నేను సిద్ధమే. నాకు కావాల్సింది కేవలం పెళ్లి అనే పేరు కాదు, సరైన తోడు.
ఆత్మసంతృప్తే ముఖ్యం
నలుగురిలో ఎక్కువగా కనిపించడం, అందరి దృష్టి నాపైనే ఉండటం నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. చిన్నతనంలో ఎవరైనా నా వైపు తదేకంగా చూస్తుంటే ‘వెళ్లిపోండి’ అని చెప్పేంత సిగ్గుపడేదాన్నని మా ఇంట్లో వాళ్లు ఇప్పటికీ చెబుతుంటారు. నిజానికి యోగా టీచర్ లాంటి ప్రశాంతమైన వృత్తిని ఎంచుకుని ఉంటే నాకు ఎంతో సౌకర్యంగా ఉండేది. కానీ జీవితంలో సవాళ్లను ఎదుర్కొని కొత్త విషయాలు నేర్చుకోవడానికే సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. నటన, సినిమా అనేవి నా జీవితంలో ఒక భాగం మాత్రమే, అవే నా సర్వస్వం కాదు.
నిర్మాతగా కొత్త అడుగు
ఈ ఏడాది ‘కేయూరి ప్రొడక్షన్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. కేవలం కథలు చెప్పడం మాత్రమే కాకుండా, ప్రేక్షకుల మనసులను లోతుగా తాకే, వారిలో మార్పు తీసుకొచ్చే చిత్రాలను నిర్మించాలన్నదే నా ఆశయం. ప్రస్తుతం దర్శకుడు డీకే దర్శకత్వంలో, విక్రమ్ కె. కుమార్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పాన్ఇండియా స్థాయిలో ఓ ఫాంటసీ డార్క్ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. గతేడాది ‘కాదలిక్క నేరమిల్లై’, ‘తలైవన్ తలైవి’, ‘ఇడ్లీ కడై’ చిత్రాలతో అలరించిన నేను, ఇప్పుడు వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించిన హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’తో డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీంతో పాటు కన్నడంలో ‘ఒమ్మొమ్మె’, చిత్రం చేస్తున్నాను. ఏది ఏమైనా, ప్రతి అడుగులోనూ నా ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడుకుంటూ నాకు నచ్చినట్లుగా జీవించడమే నాకు ఇష్టం!
యంత్రంలా పనిచేయలేను
నేను సినిమాలకు ఎందుకు తరచూ విరామం తీసుకుంటానని చాలామంది అడుగుతుంటారు. నా దృష్టిలో జీవితం అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, దానికి మించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక సహజమైన పువ్వు తన పరిసరాల నుంచి ఎంతో శక్తిని, అందాన్ని గ్రహిస్తుంది. నేను కూడా అంతే. యంత్రంలా ఆగకుండా పనిచేయలేను, కెమెరా ముందు కృత్రిమంగా నటించలేను. పాత్రలోని భావోద్వేగాలు నా అంతరాత్మ లోతుల్లోంచి సహజంగా రావాలి. అందుకే సినిమాలకు విరామం తీసుకున్నప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటాను, తిరిగి శక్తి పుంజుకుంటాను. నా ఈ ప్రయాణంలో పాటలు పాడటం, ‘ఫ్రోజెన్ 2’ వంటి చిత్రాల్లో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి.