Share News

అక్షరనిధి

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:16 AM

బహుముఖ ప్రజ్ఞకు సరైన నిర్వచనంలా అనిపిస్తుంది నిధి శర్మ ప్రయాణం. స్ర్కీన్‌ రైటింగ్‌, సాహిత్యం, క్రీడలు... అన్నిటిలోనూ తనదైన ముద్ర వేసింది. ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ సిరీస్‌ రచయిత్రిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నిధి..

అక్షరనిధి

బహుముఖ ప్రజ్ఞకు సరైన నిర్వచనంలా అనిపిస్తుంది నిధి శర్మ ప్రయాణం. స్ర్కీన్‌ రైటింగ్‌, సాహిత్యం, క్రీడలు... అన్నిటిలోనూ తనదైన ముద్ర వేసింది. ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ సిరీస్‌ రచయిత్రిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నిధి... తన అనుభవాలు, అనుభూతులకు అక్షర రూపం ఇస్తుంటుంది. వాటిని సంగీతంలోనూ నిక్షిప్తం చేస్తోంది. ఈ మధ్య ‘డాడీస్‌ వరల్డ్‌’ పేరుతో ర్యాప్‌ గీతాన్ని విడుదల చేసిన ఆమె ప్రస్థానంలో ఆసక్తికర మలుపులు ఎన్నో...

‘‘శారీరకంగానే కాదు, మానసికంగానూ సవాలు విసిరే పనులు చేయడానికే నేను అధిక ప్రాధాన్యం ఇస్తాను. అందుకే ఏదో ఒక రంగానికే పరిమితం కాకుండా... నా అభిరుచులకు అనుగుణంగా, నా మనసుకు నచ్చిన మార్గంలో అడుగులు వేస్తున్నాను. ముంబయిలో పుట్టి పెరిగిన నేను... చిన్నప్పుడే సినిమాల వైపు ఆకర్షితురాలిని అయ్యాను. ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో ఆనర్స్‌ పూర్తయిన తరువాత ‘న్యూయార్క్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ ఫిలిమ్‌ అకాడమీ’ల్లో చిత్ర నిర్మాణం, స్ర్కీన్‌రైటింగ్‌ కోర్సులు చదివాను. అయితే సినీ పరిశ్రమలోనే స్థిరపడాలనే నియమం ఏమీ పెట్టుకోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా సాహిత్యంపై నాకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంటాను. ఏదో రాయాలని రాసేయకుండా... ఒక అర్థవంతమైన ముగింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాను. అలా రాసిందే స్పోర్ట్స్‌ డ్రామా... ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ మూడో సీజన్‌. ఇది ‘ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డు’కు నామినేట్‌ అయింది. దీనికి ముందు పర్యావరణ కార్యకర్త అల్‌గోర్‌ టీవీ కోసం పలు డాక్యుమెంటరీలు తీశాను. ఒక యాక్షన్‌ సిరీస్‌కు సహదర్శకత్వం వహించాను.


ఉత్కంఠభరితమైన జ్ఞాపకాలు...

సాహిత్యంపై నాకు ఎనలేని మక్కువని చెప్పాను కదా. ఆ మక్కువతోనే నా తొలి నవల ‘డ్యాన్సింగ్‌ విత్‌ డెమన్స్‌’ రాశాను. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ప్రయోగాత్మక ఫిక్షన్‌ డ్రామా ఇది. త్వరలోనే ఈ నవల వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. నా రెండో నవల ‘ఇన్విక్టస్‌: ది జంగిల్‌ దట్‌ మేడ్‌ మీ’. 2021లో రాశాను. నా బాల్యంలో జరిగిన ఒక సంఘటన దీనికి స్ఫూర్తి. చిన్నప్పుడు నేను, మరో ఐదుగురు పిల్లలం కలిసి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనా బోర్డర్‌ ప్రాంతం... దట్టమైన తవాంగ్‌ అడవుల్లో చిక్కుకున్నాం. సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంటుంది తవాంగ్‌. ఎన్నో వ్యయప్రయాసల తరువాత ప్రాణాలతో బయటపడ్డాం. ఈ నిజ జీవిత సాహస అనుభవానికి అక్షర రూపం ఇచ్చాను. అమెజాన్‌ అవుట్‌డోర్‌ సర్వైవల్‌ చార్టులో బెస్ట్‌ సెల్లర్‌గా ఈ పుస్తకం నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నాయకత్వం, ధైర్యం, జీవన్మరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మనిబ్బరం కోల్పోకూడదని చెప్పే సాహస గాథ. అప్పుడు మా బృందంలో అందరికంటే పెద్దవాడి వయసు 13 ఏళ్లు. అతి చిన్నవాడికి ఆరేళ్లు. ప్రవహించే సెలయేళ్లు, క్రూరమృగాలను దాటుకొంటూ సూర్యాస్తమయానికి ముందే బయటపడటానికి మేం చేసిన ప్రయత్నమే ‘ఇన్విక్టస్‌’లో కనిపిస్తుంది. ఉత్కంఠభరిత జ్ఞాపకాల సమాహారం అది. తవాంగ్‌లో చిన్నపాటి సైనిక స్థావరం ఉంది. మా నాన్న అక్కడ పని చేసే రోజుల్లో ప్రతి వేసవి సెలవులకు అదే మా మజిలీ.

డాడీస్‌ వరల్డ్‌...

ఒక సైనికుడి కూతురుగా నేను దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగాను. నాన్న బదిలీ అయిన ప్రతిసారీ కొత్త ప్రదేశాలు నాకు పరిచయం అయ్యేవి. సాయుధ దళాల మధ్య పెరగడం... ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడింది. జీవితం మీకు విసిరే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి అది మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. భిన్న ప్రాంతాలు, విభిన్న వ్యక్తిత్వాలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. అవి నా సాహిత్యంలో, సంగీతంలో ప్రతిబింబిస్తాయి. నాకున్న మరో అభిరుచి... కొత్త కొత్త ప్రాంతాలను చుట్టిరావడం.


ఇప్పటివరకు ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. వీటన్నిటి అనుభవంతో నేను ఈ మధ్య ‘డాడీస్‌ వరల్డ్‌’ పేరుతో మిలిటరీ హిప్‌హాప్‌ సింగిల్‌ ఒకటి విడుదల చేశాను. దీనికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాట... సైనిక శిబిరాల్లో గడిపిన నా బాల్యాన్ని గుర్తు చేస్తుంది. నాన్నలోని ధైర్యం, క్రమశిక్షణ నన్ను ఇవాళ ఇలా నిలబెట్టాయి. ఆ స్ఫూర్తితోనే సైనిక కుటుంబాల దృక్పథాన్ని, దృఢత్వాన్ని, వారి జీవితంలోని ఘట్టాలను సంగీత రూపంలోకి మార్చిన ఉత్సాహభరితమైన ట్రాక్‌ ఇది. సైన్యంలో చేరాలనుకొనేవారికి వాస్తవికతను గుర్తు చేసే పాట.

పరిమితి లేదు...

ఒక కథకురాలిగా నాకు నేను ఎప్పుడూ పరిధులు పెట్టుకోలేదు. ఎందుకంటే... మనపై ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం కష్టం. అలాగే ఒక ఆలోచనకు రూపం ఇచ్చేటప్పుడు, లేదా కథను రాసేటప్పుడు ముందుగానే దాని మాధ్యమం, ఫలితం గురించి పట్టించుకోను. స్వేచ్ఛగా ప్రవహించే సృజనాత్మక ప్రక్రియను ఆస్వాదిస్తాను. కవిత్వం, పాటల రచన అనేవి ఒకదానితో ఒకటి ముడిపడివున్న కళారూపాలు. రెండింటిలోనూ భాషాప్రావీణ్యం, పదాల కూర్పు, లయ లాంటివి ఉంటాయి. నా బాల్య అనుభవాలే ఈనాటి నా రచనావ్యాసంగానికి, భిన్న రంగాలలో రాణించడానికి పునాది వేసిందని నమ్ముతాను. భవిష్యత్తులో కూడా వైవిధ్యమైన, ప్రయోగాత్మక ప్రాజెక్టులతో నా ప్రత్యేకతను చాటుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నది నా ఆకాంక్ష.’’

Updated Date - Sep 26 , 2026 | 01:18 AM