Share News

శక్తి సాధనకు సోపానాలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:59 AM

భారతీయ సంప్రదాయంలో కొన్ని పండుగల్లో పగటివేళకు ప్రాధాన్యం ఉంటే మరికొన్ని పండుగలకు రాత్రివేళ ప్రాధాన్యం ఉంది. రాత్రి ప్రధానమైన పండుగల్లో ఆశ్వయుజ మాస నవరాత్రి ఉత్సవాలు అత్యంత విశిష్టమైనవి...

శక్తి సాధనకు సోపానాలు

భారతీయ సంప్రదాయంలో కొన్ని పండుగల్లో పగటివేళకు ప్రాధాన్యం ఉంటే మరికొన్ని పండుగలకు రాత్రివేళ ప్రాధాన్యం ఉంది. రాత్రి ప్రధానమైన పండుగల్లో ఆశ్వయుజ మాస నవరాత్రి ఉత్సవాలు అత్యంత విశిష్టమైనవి. సాధారణంగా రాత్రి అంటే సూర్యాస్తమయం తరువాత వచ్చే చీకటి అనే భావన కలుగుతుంది. ఆ నల్లటి చీకటి తమస్సుకు ప్రతీక. తమస్సు అవిద్యను, అజ్ఞానాన్ని, అంధకారాన్ని సూచిస్తుంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే ఉపనిషత్‌ వాక్యం మానవ జీవన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. చీకటి నుంచి వెలుగులోకి పయనించాలనే ప్రేరణ కలిగిస్తుంది.

‘రాత్రికి అధిదేవత అయిన రాత్రిదేవి... తమస్సును తనలోకి లయం చేసుకొని, లోకంలో వెలుగులు నింపే దేవత’ అని ఋగ్వేదం స్తుతించింది. కాల స్వరూపిణి అయిన శక్తి... ఉషాదేవిగా, రాత్రి దేవిగా ఆవిష్కృతమై, కాలచక్రాన్ని శాసిస్తూ ఉంటుంది. రాత్రిదేవిని తమోగుణ ప్రధానమైన తామసీదేవిగా మాత్రమే కాకుండా... పగటివేళ అలసిపోయిన జగత్తుకు విశ్రాంతి కలిగించి, రక్షించే దైవశక్తిగా ఋషులు స్తుతించారు. పగటి పూట అలుపెరుగని వేగంతో పరుగెత్తే మనసుకు రాత్రి కళ్ళెం వేసి, అంతర్ముఖం చేస్తుంది. పగలు ప్రవృత్తి- రాత్రి నివృత్తి. అందుకే ‘శ్రీదేవి సప్తశతి’లో రాత్రిదేవిని ‘మహావిద్యా... మహామాయా.. మహామేధా... మహాస్మృతిః’ అని వర్ణించారు. అంటే ఆమె మహామాయా స్వరూపిణి మాత్రమే కాదు, మహావిద్యా స్వరూపిణి. ఈ రెండు భిన్నమైన లక్షణాలను కలిగిన దేవీతత్త్వ రహస్యాన్ని తెలుసుకోగలగడమే నిజమైన నవరాత్రి. చీకటి గర్భంలో వెలుగును దర్శించడమే నిజమైన దేవీ సాధన.


ప్రతికూలతపై విజయం

మాతృ గర్భంలోని శిశువు చీకటిలోనే రూపు దాలుస్తుంది, వెలుగులోకి పయనిస్తుంది. అలాగే సాధకులలో జ్ఞానోదయం కూడా అంతర్ముఖ నిశ్శబ్దంలోనే ప్రారంభమవుతుంది. శ్రీదేవీ భాగవతంలోని మధు కైటభ సంహార వృత్తాంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ రాక్షస సంహారం చేయవలసిన సమయంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నాడు. బ్రహ్మ చేసిన ప్రార్థనతో... విష్ణుమూర్తి శరీరం నుంచి తన నిద్రా శక్తిని దేవి ఉపసంహరించి, అసుర సంహార శక్తిని ప్రసాదించి, మధు కైటభ సంహారానికి కారణమయింది. ఇందులోని అంతరార్థం విశేషమైనది. నిద్రకు కారణం శక్తి, జాగృతికి కారణం శక్తి, అసుర సంహారానికి కారణం శక్తి. ఆమె మహామాయ. బంధానికి కారణమయ్యే శక్తిని మాత్రమే కాదు, బంధాలను ఛేదించి, జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా కూడా భాసిస్తోంది. ఇదే విధంగా అమ్మవారు నవరాత్రులలో రాక్షసులతో యుద్ధం చేసి, రక్తబీజుడు, మహిషాసురుడు తదితరులను సంహరించింది. లోకానికి శాంతిని, శుభాన్ని కలిగించింది. యుద్ధ సమయంలో మహిషాసురుడు ఒక్క రూపంతో కాకుండా అనేక రూపాలతో, చిత్రవిచిత్రమైన యుద్ధం చేశాడు. దేవి ఎంతో ఓర్పుతో, నేర్పుతో అతణ్ణి సంహరించింది. మహిషాసురుడు అంటే ప్రతికూలమైన అసురశక్తి. నిత్య జీవితంలో ఎదుర్కొనే వ్యతిరేక పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులకు పురాణ రూపం. వాటిని ఎదిరించి, జయించగలిగే శక్తి సాధనకు సోపానాలే ఈ తొమ్మిది రాత్రులు.


స్ఫూర్తి నింపే ప్రతీకలు

ఈ తొమ్మిది రోజులలో వివిధ దేవాలయాల్లో... వాటి సంప్రదాయాల ప్రకారం అమ్మవారు విభిన్నమైన అలంకారాలలో/ అవతారాలలో దర్శనం ఇస్తుంది. ఈ అలంకారాలు ఆమె శక్తికి, వైభవానికి చిహ్నాలు మాత్రమే కాదు, నిత్య జీవితంలో స్ఫూర్తిని నింపే ప్రతీకలు. వయస్సును అనుసరించి జీవితంలోని వివిధ దశలలో వచ్చే ఇబ్బందులను సమయానుకూలంగా ఎలా పరిష్కరించుకోవాలో, మన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలియజేసే స్వరూపాలు. బాల్యంలో బాలాదేవిగా, కౌమారంలో కన్యాకుమారిగా, సువాసినీ రూపంలో లలితాదేవిగా, వృద్ధాప్యంలో ధూమావతీదేవిగా కనిపించే ఆమె చేసిన రాక్షస సంహారం శక్తితత్త్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ దేవీతత్త్వాన్ని మహిళలలో దర్శిస్తూ ‘నారీ ఏవ నారాయణీ’ అనే భావనతో పూజలు చేసే ప్రత్యేక సంప్రదాయం హిందూ ధర్మానికి, భారతీయతకూ తలమానికం. నవరాత్రుల సంగ్రామ విజయం ద్వారా జగన్మాత ధర్మ సంస్థాపన చేసిన విజయ దశమి... దివ్య తేజస్సుతో వెలుగులు విరజిమ్ముతూ ఈ నవరాత్రులను పరిపూర్ణం చేస్తుంది. ‘నవ’ అంటే తొమ్మిది మాత్రమే కాదు... ‘నూతన, నవీన, సరికొత్త అని కూడా అర్థం. తమస్సు నుంచి నూతన తేజస్సు వరకు, సంకల్పం నుంచి సమర్పణ వరకు, ఆలయం నుంచి అంతరంగం వరకు, చీకటి నుంచి చైతన్యం వరకు చేరడమే నిజమైన నవరాత్రి సాధన, అసలైన శక్తి ఉపాసన.

మాతాజీ శ్రీరమ్యానందభారతీ

శ్రీశక్తి పీఠం, తిరుపతి.

9160455255

Updated Date - Oct 09 , 2026 | 12:59 AM